
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ సంచలనం సృష్టించాడు. గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబుపై అద్భుత విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో తెల్లపావులతో ఆడిన 15 ఏళ్ల అర్జున్ కేవలం 23 ఎత్తుల్లో లలిత్ బాబు ఆట కట్టించి ఈ టోర్నీలో ఆరో విజయం నమోదు చేశాడు.
మరో గేమ్‌లో తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి 49 ఎత్తుల్లో ఆరాధ్య గార్గ్‌ను ఓడించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో... హర్ష 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నేడు చివరి రౌండ్ గేమ్‌లు జరుగుతాయి.