శభాష్‌... హర్ష | Special story to chess player Harsha Bharathakoti | Sakshi
Sakshi News home page

శభాష్‌... హర్ష

Published Mon, Oct 8 2018 1:31 AM | Last Updated on Mon, Oct 8 2018 1:31 AM

Special story to  chess player Harsha Bharathakoti - Sakshi

నిరీక్షణ ముగిసింది. హైదరాబాద్‌ చెస్‌ క్రీడాకారుడు హర్ష భరతకోటి అనుకున్నది సాధించాడు. భారత్‌ నుంచి 56వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు. ఎరిగైసి అర్జున్‌ తర్వాత తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆగస్టులో అబుదాబి మాస్టర్స్‌ టోర్నీలో హర్ష మూడో జీఎం నార్మ్‌ సంపాదించినా... జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 రేటింగ్‌ పాయింట్లు ఆ సమయానికి అతని ఖాతాలో లేకపోవడంతో జీఎం టైటిల్‌ రాలేదు. ఆ తర్వాత ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన హర్ష తన రేటింగ్‌ పాయింట్లను 2492కు పెంచుకున్నాడు. తాజాగా గుజరాత్‌ ఓపెన్‌ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీలో హర్ష వరుసగా నాలుగో విజయం సాధించి మరో 8 రేటింగ్‌ పాయింట్లు సంపాదించాడు. ఈ క్రమంలో జీఎం టైటిల్‌ ఖరారు కావడానికి అవసరమైన 2500 పాయింట్ల మైలురాయి దాటి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌: చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారందరూ ఏనాటికైనా గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే మేధో క్రీడ అయిన చెస్‌లో ఈ ఘనత సాధించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా... కష్టాన్ని ఇష్టంగా మలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. కాస్త ఆలస్యమైనా అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటాం. హైదరాబాద్‌ చెస్‌ ప్లేయర్‌ హర్ష భరతకోటి విషయంలో అదే జరిగింది. గత ఆగస్టులోనే జీఎం హోదా దక్కాల్సినా... అవసరమైన రేటింగ్‌ పాయింట్లు లేకపోవడంతో ఈ ఘనత అందుకోలేకపోయాడు. అయితేనేం తన ఆటతీరుకు మరింత పదునుపెట్టి... తనకంటే మేటి ఆటగాళ్లను మట్టికరిపించి... రెండు నెలల వ్యవధిలోనే 2500 మైలురాయిని అందుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అయ్యాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న గుజరాత్‌ ఓపెన్‌ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో 18 ఏళ్ల హర్ష వరుసగా నాలుగో విజయం సాధించాడు. తజకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్, 2651 రేటింగ్‌ ఉన్న ఫారూఖ్‌ అమనతోవ్‌తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ 32 ఎత్తుల్లో గెలిచి సంచలనం సృష్టించాడు. అంతకుముందు హర్ష మూడో రౌండ్‌లో పరాబ్‌ రిత్విజ్‌ (భారత్‌)పై 48 ఎత్తుల్లో... రెండో రౌండ్‌లో రక్షిత రవి (భారత్‌)పై 32 ఎత్తుల్లో... తొలి రౌండ్‌లో చంద్రేయి హజ్రాపై గెలిచాడు. నాలుగో రౌండ్‌ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.  

ఒక్కో మెట్టు ఎక్కుతూ...  
తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్‌ ఆడటం ప్రారంభించిన హర్ష రెండేళ్లు తిరిగేలోపు జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న హర్ష క్రమం తప్పకుండా తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అటాకింగ్‌ గేమ్‌ను ఇష్టపడే ఈ హైదరాబాద్‌ అబ్బాయి గేమ్‌ పరిస్థితిని బట్టి వెంటవెంటనే వ్యూహాలు మార్చి ఫలితాన్ని తారుమారు చేయగల సమర్థుడు. ఏడేళ్లుగా చెస్‌లో ఉన్న హర్ష ఇప్పటివరకు 25 మంది కంటే ఎక్కువ మంది గ్రాండ్‌మాస్టర్లను ఓడించాడు. 2017 అక్టోబరులో ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ టోర్నీలో తొలి జీఎం నార్మ్‌ పొందిన హర్ష... ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దుబాయ్‌ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్‌... ఆగస్టులో అబుదాబి మాస్టర్స్‌ టోర్నీలో మూడో జీఎం నార్మ్‌ సంపాదించాడు.  

హర్ష భరతకోటి ముఖ్య విజయాలు 
∙2011: జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం. ∙2012: ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–12 ర్యాపిడ్‌ విభాగంలో స్వర్ణం. ∙2012: కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–12 విభాగంలో స్వర్ణం. ∙2013: జాతీయ జూనియర్‌ అండర్‌–13 చాంపియన్‌షిప్‌లో స్వర్ణం.  2014: ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో రజతం ∙2016: ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం ∙2017: జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం ∙2017: ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్‌ విభాగంలో రజతం ∙2017: ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ టోర్నీలో తొలి జీఎం నార్మ్‌ ∙2018: కఠ్మాండూ ఓపెన్‌లో స్వర్ణం ∙ 2018: దుబాయ్‌ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్‌ ∙2018: అబుదాబి మాస్టర్స్‌ టోర్నీలో మూడో జీఎం నార్మ్‌. 

‘గ్రాండ్‌మాస్టర్‌ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కలను సాకారం చేసుకునేందుకు పదేళ్లుగా శ్రమిస్తున్నాను. నేనీస్థాయికి చేరుకోవడం వెనుక కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు కృషి ఎంతో ఉంది. ఆటపరంగానూ, ఆర్థికంగానూ ఆయన నాకెంతో సహాయం చేశారు. జీఎం లక్ష్యం నెరవేరడంతో మున్ముందు నా రేటింగ్‌ను మరింత పెంచుకుంటాను. 2700 రేటింగ్‌ను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. ఈ క్రమంలో ఎవరైనా స్పాన్సర్లు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.’       
– ‘సాక్షి’తో హర్ష  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement