సరదాగా మొదలుపెట్టిన ఆట... అతడి కెరీర్‌గా మారింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చిరు ప్రాయంలోనే అపార నైపుణ్యంతో మేటి ఆటగాళ్లకు ‘చెక్’ పెట్టే స్థాయికి తీసుకెళ్లింది. ఒక్కో పావును కదుపుతూ, ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ చెస్ క్రీడాకారులు కలలు కనే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దిశగా అడుగులు వేయిస్తోంది. ఆ కుర్రాడే హర్ష భరతకోటి...! కొన్నాళ్లుగా అంతర్జాతీయ చెస్‌లో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ తారగా కితాబు అందుకుంటున్నాడితడు. ఇప్పటికే రెండు జీఎం నార్మ్‌లు సొంతం చేసుకుని చిరకాల స్వప్నానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు గ్రాండ్ మాస్టర్లైన కోనేరు హంపి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, లలిత్‌బాబు ఆంధ్రప్రదేశ్ వారు. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే హర్ష భరతకోటి రూపంలో తెలంగాణ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్‌ను మనం చూడవచ్చు.
సాక్షి, హైదరాబాద్ : ప్రతిభ ఉన్నా సరైన సమయంలో గుర్తింపు రాకపోతే అది మరుగున పడిపోతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే నైపుణ్యానికి నిత్యం పదును పెట్టుకుంటూ ఉండాలి. ప్రతిభావంతులకు తగిన చేయూత లభించాలి. మన దగ్గర వ్యవస్థ ద్వారా కాకుండా స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారులెందరో ఉన్నారు. మేధో క్రీడ చెస్‌లోనూ ఇలాంటి వారెందరో కనిపిస్తారు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మొదలు తాజా గ్రాండ్‌మాస్టర్ హిమాన్షు శర్మ వరకు ఎన్నో అవాంతరాలను అధిగమించి అనుకున్న స్థానానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అపార ప్రతిభ ఉన్న యువ చెస్ ఆటగాళ్ల కోవలోకే వస్తాడు 18 ఏళ్ల హర్ష భరతకోటి. ఇటీవలే నేపాల్‌లో జరిగిన కఠ్మాండూ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన హర్ష కొన్నేళ్లుగా తన ఖాతాలో క్రమం తప్పకుండా విజయాలు జమ చేసుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడైన హర్ష కోచ్ ఎన్‌వీఎస్ రామరాజు శిక్షణలో రాటు దేలాడు. ఓనమాలు నేర్చుకున్న రెండేళ్ల తర్వాత జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి కాంస్య పతకం సాధించాడు. తర్వాత పలు ర్యాంకింగ్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. అటాకింగ్ ఆటతో దూసుకెళ్లే అలవాటున్న హర్ష పరిస్థితిని బట్టి వ్యూహాలను మార్చేసి ఫలితాన్ని తారుమారు చేసే సత్తాగలవాడు. ఏడేళ్లుగా చెస్ టోర్నీలు ఆడుతున్న తను ఇప్పటివరకు 20 కంటే ఎక్కువమంది గ్రాండ్‌మాస్టర్‌లను ఓడించడం విశేషం. ప్రస్తుతం 2463 ఎలో రేటింగ్ పాయింట్లతో ఉన్న హర్ష 2500 మార్క్‌ను అందుకొని గ్రాండ్‌మాస్టర్ హోదా పొందాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. రోజూ తొమ్మిది గంటల పాటు సాధనతో రాబోయే రెండు నెలల కాలంలో కోల్‌కతా, ఒడిశా, ముంబైలలో జరిగే టోర్నీల్లో పాల్గొననున్నాడు.
ఒక్కో పర్యటనకు భారీ మొత్తం...
భారత్‌లో ప్రస్తుతం చెస్ టోర్నీల సంఖ్య భారీగా పెరిగింది. అయితే రేటింగ్ పాయింట్లు పెంచుకోవాలంటే తమకంటే రేటింగ్ ఎక్కువ ఉన్న క్రీడాకారులు పాల్గొనే టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. యూరోప్‌లో గ్రాండ్‌మాస్టర్స్ ఎక్కువ పాల్గొనే టోర్నీలు చాలా జరుగుతాయి. ఇలాంటి టోర్నీల్లో పాల్గొనడం అందరివల్ల అయ్యే పనికాదు. రానుపోను ఖర్చులు, వసతి, టోర్నీ సందర్భంగా చెస్ సహాయకులతో (సెకండ్స్) శిక్షణ... ఇలా ఒక్కో పర్యటనకు కనీసం ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం భరించడం ఔత్సాహిక యువ క్రీడాకారులకు సాధ్యమయ్యే పనికాదు. కార్పొరేట్ సంస్థలు, క్రీడాభిమానులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ముందుకువచ్చి తమవం తుగా ఆర్థిక సహాయం చేస్తే హర్ష కెరీర్ మరింత వెలిగిపోతుంది.
కార్ల్‌సన్‌నే ఆకట్టుకున్నాడు...
అది 2017 ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీ వేదిక... ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), హికారు నకముర (అమెరికా), విశ్వనాథన్ ఆనంద్ తదితర దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నీలో హర్ష కూడా బరిలోకి దిగాడు. తొలి ఐదు రౌండ్‌లలో ఐదుగురు గ్రాండ్‌మాస్టర్స్‌తో తలపడి, అందులో ఇద్దరిని ఓడించి, మరో ఇద్దరితో ‘డ్రా’ చేసుకొని మరో గేమ్‌లో ఓడిపోయాడు. అప్పటి హర్ష ఎలో రేటింగ్ (2394)ను బట్టి చూస్తే అతని ప్రదర్శన అద్భుతమని ఆ టోర్నీలో పాల్గొన్న చెస్ పండితులు కితాబిచ్చారు. హర్ష గేమ్‌లు ఆడతున్న సమయంలో ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ హర్ష బోర్డు వద్దకు వచ్చి అతని ఎత్తులను పరిశీలించి వెళ్లడం జరిగింది.
హర్ష భరతకోటి విజయాలు...
2011: అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్–11 విభాగంలో కాంస్య పతకం.
2012: శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అండర్–12 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం.
2012: చెన్నైలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో అండర్–12 విభాగంలో స్వర్ణం.
2013: పాండిచ్చేరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో స్వర్ణం.
2014: న్యూఢిల్లీలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం.
2016: న్యూఢిల్లీలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం.
2017: పాట్నాలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం.
2017: ఇరాన్‌లో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో రజతం.
2017: ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో తొలి జీఎం నార్మ్ సొంతం.
2018: దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ సొంతం.
Comments
Please login to add a commentAdd a comment