దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు దేశాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడంతో పాటు స్కూళ్లను మూసివేశారు.
అటు ఫిలిప్పీన్స్ నుండి థాయ్‌లాండ్ వరకు, ఇటు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ వరకు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నేపధ్యంలో బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌లో పాఠశాలలను మూసివేశారు. మరోవైపు ఇండోనేషియాలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది దశాబ్దాల క్రితం నాటి ఉష్ణోగ్రతల రికార్డును అధిగమించింది.ఈ
వేడి వాతావరణం మే మధ్యకాలం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత, కరెంటు కోతలు, పంట నష్టం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి.
కంబోడియా గత 170 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని జలవనరులు, వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చాన్ యుథా తెలిపారు. గడచిన వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. సెంట్రల్ మాగ్వే, మాండలే, సాగింగ్, బాగో ప్రాంతాల్లోని ఏడు టౌన్‌షిప్‌లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మయన్మార్ వాతావరణ విభాగం వెల్లడించింది. మయన్మార్‌లోని పలు పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రపంచస్థాయి రికార్డులను దాటాయి.
థాయ్‌లాండ్‌లోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. బ్యాంకాక్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగపూర్‌లోని వాతావరణ శాఖ దేశంలో ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. వియత్నామీస్ మీడియా నివేదికల ప్రకారం మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో అడవుల్లో కార్చిచ్చు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది.
మలేషియాలో వరుసగా మూడు రోజులు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని మలేషియా వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆసియా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొన్నందున పలు చోట్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలతో ఆసుపత్రులలో చేరుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి చెందారని థాయ్‌లాండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వడదెబ్బ కాణంగా దేశంలో ఇప్పటివరకూ రెండు మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు మరణించారు. ఈ వివరాలను ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది.
బంగ్లాదేశ్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 20 మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఇండోనేషియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు డెంగ్యూ జ్వరాలకు దారి తీస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే ఇన్‌ఫెక్షన్, కేసుల కంటే డెంగ్యూ జ్వరాలు రెండింతల మేరకు పెరిగాయని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment