
భారత మహిళల జట్టుకు తొలి ఓటమి
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన మూడో రౌండ్‌లో భారత్ 1.5–2.5తో ఓడిపోయింది. అనా ఉషెనినాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 62 ఎత్తుల్లో; లులిజా ఉస్మాక్‌తో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 50 ఎత్తుల్లో; నటాలియా బుక్సాతో జరిగిన గేమ్‌ను పద్మిని రౌత్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇనా గపోనెంకో చేతిలో తానియా సచ్‌దేవ్ 83 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు భారత పురుషుల జట్టు 2.5–1.5తో బెలారస్‌పై గెలిచి ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. విదిత్, పరిమార్జన్ నేగి, శశికిరణ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఆదిబన్ నెగ్గి భారత్‌ను గెలిపించాడు.