
జాతీయ చెస్‌లో తెలుగోళ్ల క్లీన్‌స్వీప్
► రవితేజకు స్వర్ణం, ప్రణీత్‌కు కాంస్యం
హైదరాబాద్: జాతీయ చాలెంజర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు క్లీన్‌స్వీప్ చేశారు. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని నోయిడాలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో ఏపీ ఆటగాడు ఎస్.రవితేజ విజేతగా నిలువగా, అతని సహచరుడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ రజతం నెగ్గాడు. తెలంగాణకు చెందిన ఫిడే మాస్టర్ కె. ప్రణీత్ సూర్య కాంస్య పతకం గెలిచాడు. వీరంతా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించారు.
ఈ టోర్నీ కూడా యూపీలోనే నవంబర్‌లో జరగనుంది. 8 మంది గ్రాండ్‌మాస్టర్లు, 19 మంది అంతర్జాతీయ మాస్టర్లు తలపడిన చాలెంజర్ చెస్‌లో అంతర్జాతీయ మాస్టర్ ప్రణీత్, బాలచంద్రలిద్దరూ 9.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే టై బ్రేక్‌లో బాలచంద్రకు రెండు, ప్రణీత్‌కు మూడో స్థానం దక్కాయి. 13 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో రైల్వేకు ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ మాస్టర్ రవితేజ 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) అధ్యక్ష, కార్యదర్శులు నరసింహా రెడ్డి, వెంకటేశ్వర రావు... ప్రణీత్‌ను అభినందించారు.