ప్రపంచ జూనియర్ చెస్ టైటిల్ సొంతం
గాంధీనగర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత యువ చెస్ తార దివ్య దేశ్‌ముఖ్ తన కెరీర్‌లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ మహిళల అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
చివరిదైన 11వ రౌండ్‌లో దివ్య 57 ఎత్తుల్లో క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై గెలిచింది. నాగపూర్‌కు చెందిన దివ్య ఈ టోర్నీలో తొమ్మిది గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.
క్రచ్యాన్ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా... అలవెర్దియెవా అయాన్ (అజర్‌బైజాన్; 8.5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది. విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ. 1 లక్షా 79 వేలు) ప్రైజ్‌మనీతోపాటు స్వర్ణ పతకం, విన్నర్స్ ట్రోఫీ లభించాయి.
విజయానంతరం దివ్య మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఆటను ఎలా ఆడాలో కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే నేను రంగంలోకి దిగాను’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.
18 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సాధించిన విజయాలు
2020- ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్(టీమ్)- స్వర్ణం
2022- వుమెన్స్ ఇండియన్ చెస్ చాంపియన్‌షిప్- విజేత
2022- చెస్ ఒలింపియాడ్(వ్యక్తిగత విభాగం)- కాంస్యం
2023- ఆసియా మహిళా చెస్ చాంపియన్‌షిప్- విజేత
2023- టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్(వుమెన్స్ రాపిడ్)- ప్రథమ స్థానం
2024- ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్- చాంపియన్.
Comments
Please login to add a commentAdd a comment