
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ క్రీడాకారుడు మాస్టర్ ఎం. శ్రీశ్వాన్ తన ప్రొఫెషనల్ చెస్ కెరీర్‌లో మరో ఘనత సాధించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనా చెస్ టోర్నీలో పాల్గొన్న శ్రీశ్వాన్ అద్భుతంగా రాణించి ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదాను పొందడానికి అవసరమైన మూడో నార్మ్‌ను అందుకున్నాడు. తద్వారా తెలంగాణ నుంచి అతిపిన్న వయస్సులో ఐఎం హోదాను సంపాదించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం 13 ఏళ్ల 5 నెలల 10 రోజుల వయస్సున్న శ్రీశ్వాన్ ఐఎం హోదాను అందుకోవడానికి అవసరమైన 2400 ఎలో రేటింగ్ పాయింట్లను దాటేశాడు. అతని ఖాతాలో ఇప్పుడు 2461 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. శ్రీశ్వాన్ తెలంగాణ తరఫున ఏడో ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ప్లేయర్ కావడం విశేషం.