జిషిత...విశ్వవిజేత | jishitha World Champion in Under-14 category | Sakshi
Sakshi News home page

జిషిత...విశ్వవిజేత

Published Thu, Sep 28 2017 12:26 AM | Last Updated on Thu, Sep 28 2017 2:17 AM

jishitha World Champion in Under-14 category

అంతర్జాతీయ చెస్‌ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. గ్రాండ్‌మాస్టర్స్‌ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బాటలో పయనిస్తూ 13 ఏళ్ల ధనుమూరి జిషిత విశ్వవిజేతగా అవతరించింది. ఉరుగ్వేలో ముగిసిన ప్రపంచ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి అండర్‌–14 బాలికల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్‌ హోదాలో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్న జిషిత అంచనాలకు అనుగుణంగా రాణించి తొమ్మిది పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్‌కు స్వర్ణం, రెండు రజతాలు లభించాయి. అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్, అండర్‌–18 బాలికల విభాగంలో మహారాష్ట్ర అమ్మాయి సాక్షి చిత్లాంగె రన్నరప్‌గా నిలిచి రజత పతకాలను గెల్చుకున్నారు.   

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ చదరంగంలో మరోసారి తెలుగు తేజానికి పట్టం లభించింది. ఉరుగ్వే రాజధాని మాంటివీడియోలో ముగిసిన ప్రపంచ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ధనుమూరి జిషిత అండర్‌–14 బాలికల విభాగంలో టైటిల్‌ను దక్కించుకుంది. నిర్ణీత 11 రౌండ్లకుగాను జిషిత తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు గ్రామానికి చెందిన జిషిత తొమ్మిది గేముల్లో గెలిచి, మిగతా రెండు గేముల్లో ఓడిపోయింది. రమోనా (లాత్వియా), అల్వా గ్లింజ్నెర్‌ (జర్మనీ), అనాపావోలా (అర్జెంటీనా), స్విత్లానా (కెనడా), ఐరిస్‌ జూ (అమెరికా), సిండీ జాంగ్‌ (అమెరికా), మృదుల్‌ దేహాంకర్‌ (భారత్‌), సలీమోవా (బల్గేరియా), యాసమిన్‌ (అమెరికా)లపై నెగ్గిన జిషిత... బిబిసారా (రష్యా), దరియా మిరునా (రొమేనియా) చేతిలో ఓడిపోయింది.  

ఈ విజయంతో జిషిత ఆంధ్రప్రదేశ్‌ నుంచి అండర్‌–14 బాలికల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2000లో స్పెయిన్‌లో), ద్రోణవల్లి హారిక (2004లో గ్రీస్‌లో) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా భారత్‌ నుంచి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆరో క్రీడాకారిణి జిషిత. హంపి, హారికలతోపాటు పద్మిని రౌత్‌ (2008లో), మహాలక్ష్మి (2012లో), వైశాలి (2015లో) కూడా టైటిల్స్‌ను సాధించారు.

ప్రపంచ చాంపియన్‌గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది.  తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, రమాజ్యోతి నిరంతర ప్రోత్సాహం... కోచ్‌ రామరాజు అద్భుత శిక్షణతో నిలకడగా విజయాలు సాధిస్తున్నాను. అమ్మ చెస్‌ ఆడుతుండగా ఈ ఆటపై నాకు ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సీరియస్‌గా దృష్టి సారించి తొలుత స్కూల్‌స్థాయి టోర్నీల్లో పాల్గొన్నాను. అనంతరం నా ఆటలోని లోపాలను సవరించుకుంటూ గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో టైటిల్స్‌ సాధిస్తున్నాను. గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్‌–13 విభాగంలో స్వర్ణం, ఈ ఏడాది ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా యూత్‌ పోటీల్లో అండర్‌–14 విభాగంలో స్టాండర్డ్, బ్లిట్జ్‌ ఈవెంట్స్‌లో స్వర్ణాలు గెలిచాను. హంగేరి చెస్‌ దిగ్గజం జూడిత్‌ పోల్గర్‌ను అభిమానిస్తాను. మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ (డబ్ల్యూఐఎం), మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) హోదాలు సంపాదించాడమే నా తదుపరి లక్ష్యం. ఈ ఈవెంట్‌లో ఒకానొక దశలో పతకంపై ఆశలు కోల్పోయాను. ఆ సమయంలో కోచ్‌ రామరాజు సూచనలు, తల్లిదండ్రుల మద్దతుతో ఒత్తిడికి లోనుకాకుండా ఆడి వరుసగా ఐదు గేముల్లో గెలిచి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాను.           
–‘సాక్షి’తో జిషిత

రన్నరప్‌ అర్జున్‌
మరోవైపు అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఎరిగైసి అర్జున్‌ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్లు పూర్తయ్యాక అర్జున్‌ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. ఏడు గేముల్లో గెలుపొందిన అర్జున్, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలువడం విశేషం. నెస్సి డేవిడ్‌ (నార్వే), ఆండ్రీ క్రిస్టియన్‌ (రొమేనియా), యువాన్‌ మార్టిన్‌ (అర్జెంటీనా), రోహన్‌ తాలుక్‌దార్‌ (కెనడా), నోవా ఫెకెర్‌ (స్విట్జర్లాండ్‌), కౌస్తవ్‌ చటర్జీ (భారత్‌), సచా బ్రోజెల్‌ (ఇంగ్లండ్‌)లపై నెగ్గిన ఈ హన్మకొండ కుర్రాడు జాన్‌ సుబెల్జ్‌ (స్లొవేనియా), డొమినిక్‌ హోర్వత్‌ (ఆస్టియా), బత్సురెన్‌ దంబాసురెన్‌ (మంగోలియా), పావెల్‌ టెక్లాఫ్‌ (పోలాండ్‌)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. 10 పాయింట్లతో బత్సురెన్‌ దంబాసురెన్‌ టైటిల్‌ దక్కించుకోగా... 8.5 పాయింట్లతో పావెల్‌ టెక్లాఫ్‌ కాంస్య పతకాన్ని సంపాదించాడు. అండర్‌–18 బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సాక్షి చిత్లాంగె ఎనిమిది పాయింట్లతో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించింది.  

ఒక్కో అడుగు ముందుకేస్తూ...
ఐదేళ్ల క్రితం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సెలెక్షన్‌ టోర్నీలో విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చిన అర్జున్‌ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆశాకిరణంగా ఎదిగాడు. తల్లిదండ్రులు డాక్టర్‌ శ్రీనివాసరావు, జ్యోతిల ప్రోత్సాహంతో చెస్‌పై మరింత మక్కువ పెంచుకున్నాడు. తన నైపుణ్యానికి పదును పెట్టి గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్‌–13 విభాగంలో చాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పోటీల్లో కనబరిచిన ప్రదర్శనతో అతను ఆసియా, ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించాడు. గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా యూత్‌ పోటీల్లో అర్జున్‌ అండర్‌–14 విభాగంలో విజేతగా నిలిచాడు. అదే జోరును ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మిడిల్, ఎండ్‌ గేమ్‌లో చక్కగా రాణించే అర్జున్‌కు మున్ముందు తగిన ప్రోత్సాహం లభిస్తే ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న అతడిని  భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్‌గా చూసే అవకాశముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement