
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్‌గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇటలీలో జరుగుతున్న గ్రెడైన్ ఓపెన్‌లో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ లూకా మోరోనిపై గెలుపొందాడు.
ఈ ప్రదర్శనతో ప్రజ్ఞానందకు జీఎం హోదా లభించేందుకు అవసరమైన మూడో జీఎం నార్మ్ ఖాయమైంది. 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ప్రజ్ఞానంద జీఎం హోదా పొంది... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా ఇప్పటిదాకా పరిమార్జన్ నేగి (ఢిల్లీ–13 ఏళ్ల 4 నెలల 22 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ప్రపంచంలో పిన్న వయస్సులో జీఎం అయిన రికార్డు సెర్గీ కర్జాకిన్ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది.