సాక్షి, హైదరాబాద్: అఖిల భారత బిలో 1400 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో పశ్చిమ బెంగాల్ క్రీడాకారుడు అర్ఘ్యసేన్ విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం 8.5 పాయింట్లతో అతను అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి వరకు పోరాడిన తెలుగు క్రీడాకారిణి తేజశ్రీకి నిరాశ తప్పలేదు. తమిళనాడుకు చెందిన భరత్ రాజ్ రన్నరప్‌గా నిలవగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పి. తేజశ్రీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరితో పాటు ఎస్. ఉన్నిక్రిష్ణన్ (కేరళ), ఎంఏ సమీ (కేరళ) 8 పాయింట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా భరత్, తేజ వరుసగా రెండు, మూడు స్థానాల్లో... ఉన్నిక్రిష్ణన్, సమీ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విజేతగా నిలిచిన అర్ఘ్యసేన్‌కు టైటిల్‌తో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌కు రూ. 25,000, తేజశ్రీకి రూ. 13,000 నగదు బహుమతిగా అందజేశారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ దీపక్, టీఎస్‌సీఏ కార్యదర్శి కేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment