భారత్‌కు మూడో విజయం
సఖద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మూడో విజ యాన్ని సాధించింది. క్యూ బాతో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 2.5-1.5 పాయింట్ల తేడాతో గెలిచింది. డొమింగెజ్‌తో హరికృష్ణ 27 ఎత్తుల్లో; బ్రుజోన్ బాటిస్‌తో సేతురామన్ 53 ఎత్తుల్లో; పెరెజ్‌తో శశికిరణ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెనాల్డో స్యురెజ్‌పై విదిత్ సంతోష్ గుజరాతి 41 ఎత్తుల్లో గెలిచి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.
మహిళల జట్టుకు మూడో ఓటమి
మరోవైపు చైనాలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. జార్జియా జట్టుతోఆదివారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక... మహారాష్ట్ర అమ్మాయి సౌమ్య స్వామినాథన్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ ఓడిపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
హంపి, బేలా ఖోతెనాష్‌విలి గేమ్ 40 ఎత్తుల్లో; హారిక, లెలా జవఖిష్‌విలి గేమ్ 80 ఎత్తుల్లో; సౌమ్య, సలోమి మెలియా గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. పద్మిని రౌత్ 41 ఎత్తుల్లో మేరీ అరాబిద్జె చేతిలో పరాజయం పాలైంది. ఏడో రౌండ్ తర్వాత భారత్ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. సోమవారం జరిగే ఎనిమిదో రౌండ్‌లో పోలండ్‌తో టీమిండియా తలపడుతుంది.