
న్యూఢిల్లీ: మేటి రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రతిపాదించింది. గత రెండేళ్లుగా అద్భుత ప్రదర్శనరీత్యా వీరిద్దరిని ప్రతిష్టాత్మక అవార్డుకు సమాఖ్య సిఫార్సు చేసింది. ఇప్పటికే వీరు తమ దరఖాస్తులను సమర్పించినట్లు తెలిపింది. రాహుల్ అవారె, హర్‌ప్రీత్ సింగ్, దివ్య కక్రాన్, పూజా ధండా పేర్లను ‘అర్జున అవార్డు’కు, కోచ్‌లకు ప్రకటించే ద్రోణాచార్య అవార్డుకు వీరేందర్ కుమార్, సుజీత్ మాన్, నరేంద్ర కుమార్, విక్రమ్ కుమార్‌లను డబ్ల్యూఎఫ్‌ఐ ప్రతిపాదించింది. ధ్యాన్‌చంద్ జీవిత కాల సాఫల్య పురస్కారానికి భీమ్ సింగ్, జై ప్రకాష్ పేర్లను పంపింది.
ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న 25 ఏళ్ల బజరంగ్... ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్ట్రీసయిల్ 65 కేజీల విభాగంలో బంగారు పతకం గెల్చుకున్నాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. ఇక వినేశ్... ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా 53 కేజీలో విభాగంలో పోటీ పడిన ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. మరోవైపు జాతీయ షూటింగ్ సమాఖ్య... హీనా సిద్ధు, అంకుర్ మిట్టల్‌లను ‘ఖేల్‌రత్న’కు అంజుమ్ మౌద్గిల్, షాజిర్ రిజ్వీలను ‘అర్జున అవార్డు’లకు నామినేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment