ఖేల్ రత్న అవార్డులకు ప్రాతిపదిక ఏంటీ?
న్యూఢిల్లీ: క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే అత్యుత్తమ ‘ఖేల్ రత్న’ అవార్డును ఈసారి నలుగురు ఒలింపిక్ క్రీడాకారులకు ఇచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ఈ అవార్డు అందుకున్న గ్రహీతల్లో పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు ఒలింపిక్ మెడల్స్ అందుకున్నవారుకాగా, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌లు ఒలింపిక్స్‌లో గట్టి పోటీ ఇచ్చినా పతకం రానివారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఖేల్ రత్న అవార్డులతోపాటు రెండవ అత్యుత్తమ అవార్డు అయిన అర్జున అవార్డులను 15 మంది క్రీడాకారులకు అందజేసింది.
ద్రోణాచార్య, ద్యాన్‌చంద్ లాంటి అవార్డుల విషయాన్ని పక్కన పెడితే ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రదానం చేస్తున్న తీరును గమనిస్తే కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న క్రైటేరియా ఏమిటనే సందేహం రాకపోదు. క్రీడా రంగంలో వరుసగా నాలుగేళ్లపాటు ‘స్పెక్టాక్యులర్ (అద్భుతంగా)’, ‘అవుట్ స్టాండింగ్ (అసాధారణం)’ రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డులను ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. స్పెక్టాక్యులర్, అవుట్ స్టాండింగ్ అనే పదాలకు సరైన నిర్వచనమే మార్గదర్శకాల్లో లేదు. అంటే కేంద్రంలో అధికారంలోవున్న ఏ ప్రభుత్వమైనా ఈ పదాలను ఎలాగైనా వాడుకోవచ్చన్నమాట.
ఖేల్‌రత్న, అర్జున అవార్డుల కోసం క్రీడాకారులను ఎంపిక చేయడానికి మాజీ క్రీడాకారులు, మాజీ అవార్డు గ్రహీతలు, ఒలింపియన్స్, క్రీడల జర్నలిస్టులు, నిపుణులు, క్రీడల నిర్వాహకులు, కామెంటేటర్లతో కూడిన ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అవార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. వివిధ రకాల క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులు గత నాలుగేళ్లలో సాధించిన విజయాలేమిటో పరిశీలించి వాటికి 80 మార్కులు వేస్తుంది. ఆ తర్వాత వారి ఒవరాల్ ప్రతిభను పరిగణలోకి తీసుకొని మరో 20 వెయిటేజ్ మార్కులు వేసే అధికారం కమిటీకి ఉంది. ఆ తర్వాత అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను కేంద్ర క్రీడల శాఖ మంత్రికి పంపిస్తుంది. తుది నిర్ణయం ఆ మంత్రియే తీసుకోవాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులను సూచించే అధికారం కూడా ఆ మంత్రికి ఉంటుంది.
ఇప్పటి వరకు ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించారా?
అత్యుత్తమ అవార్డు అయిన ఖేల్ రత్ననే పరిగణలోకి తీసుకుంటే ఆయా కాలాల్లో అంతర్జాతీయ క్రికెట్ రంగంలో బాగా రాణించిన రాహుల్ ద్రవిడ్ (24,208 పరుగులు), సౌరభ్ గంగూలి (18,575 పరుగులతోపాటు ఉత్తమ కెప్టెన్‌గా గుర్తింపు)కి, దేశంలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే (956 వికెట్లు)లను ఎందుకు విస్మరించారు.? క్రికెట్‌లో సచిన్‌కు తప్పా ఎవరికి ఖేల్ రత్న ఇవ్వలేదని, ఆ క్రీడను అవార్డు కోసం అంతగా పరిగణలోకి తీసుకోమని సమాధానం వచ్చినట్లయితే 12 మేజర్స్‌లో విజయం సాధించిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేశ్ భూమతిని ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తక మానదు. 1999 నుంచి 2002 మధ్య ఆయన కనీసం ఐదు మేజర్స్‌లో విజయం సాధించారు.
చెస్‌లో విశ్వనాథ ఆనంద్‌కు మొట్టమొదటిసారిగా 1991–1992లో ఖేల్ రత్న అవార్డు రాగా ఎక్కువ మందికి షూటింగ్‌లోనే ఖేల్ రత్న అవార్డులు వచ్చాయి. ఏ క్రీడలను ప్రోత్సాహించాలనుకుంటున్నారో, ఎవరికి అవార్డులు వస్తాయో సందేహాస్పదంగా ఉంటోంది. ఒలింపిక్స్‌లో ఉత్తమంగా రాణించారనే ఉద్దేశంలో ఈసారి నలుగురు ఒలింపియన్లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారని సరిపెట్టుకోవచ్చు. ప్రతిసారి అలా జరగడం లేదుకదా, ప్రతి ఏడాది ఒలింపిక్స్ ఉండవుకదా! అందుకని ఎంపిక క్రైటేరియానే మార్చాల్సి ఉంటుందేమో!