Sports award
-
మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక
ఐపీఎల్ మెగావేలంలో సురేశ్ రైనాకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా పేరున్న రైనాను వేలంలో ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే ఇదే రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. మొత్తంగా వివిధ దేశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు నామినేట్ అయ్యారు. రైనాతోపాటు మాజీ రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ ఆటగాడు రాబర్ట్ కార్లోస్, జమైకన్ స్ప్రింటర్ అసఫా పావెల్, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ దిగ్గజం ఎడ్గర్ డేవిడ్స్ తదితరులు ఉన్నారు. తన క్రికెట్ కెరీర్లో అతను చేసిన సేవకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు మాల్దీవ్స్ ప్రభుత్వం తెలిపింది. కాగా మార్చి 17న మాల్దీవ్స్‌లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడామంత్రి జహీర్ హసన్ రసెల్.. రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. ఇక రైనా టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు. -
విజేత కోనేరు హంపి
న్యూఢిల్లీ: భారత చెస్ స్టార్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది. వార్షిక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతీ చంద్, షూటర్ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. 40 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డు నామినీలను ఎంపిక చేయగా... అభిమానుల ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఐదుగురు నామినీల్లో అత్యధిక ఓట్లు హంపికే వచ్చాయని బీబీసీ తెలిపింది. అవార్డుల ప్రకటన కార్య క్రమాన్ని ‘వర్చువల్’గా బీబీసీ నిర్వహించింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూ జార్జ్‌కు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు... షూటర్ మనూ భాకర్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించాయి. భారత క్రీడారంగంలోని అత్యు త్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019లో ఈ అవార్డును బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది. ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మొత్తం చెస్ క్రీడకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. క్రికెట్ సహా ఇతర క్రీడలతో పోలిస్తే భారత్‌లో చెస్‌పై ఎక్కువ మంది దృష్టి ఉండదు. ఇకపై మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నా ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కారణంగానే ఇన్నేళ్లుగా విజయాలు సాధించగలుగుతున్నాను. ఒక మహిళా క్రీడాకారిణి ఆటను వదిలేయాలని ఎప్పుడూ అనుకోరాదు. పెళ్లి, పిల్లలు జీవితంలో భాగమే కానీ మన జీవన గమనాన్ని మార్చరాదు. –హంపి -
ఖేల్ రత్న అవార్డులకు ప్రాతిపదిక ఏంటీ?
న్యూఢిల్లీ: క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే అత్యుత్తమ ‘ఖేల్ రత్న’ అవార్డును ఈసారి నలుగురు ఒలింపిక్ క్రీడాకారులకు ఇచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ఈ అవార్డు అందుకున్న గ్రహీతల్లో పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు ఒలింపిక్ మెడల్స్ అందుకున్నవారుకాగా, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌లు ఒలింపిక్స్‌లో గట్టి పోటీ ఇచ్చినా పతకం రానివారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఖేల్ రత్న అవార్డులతోపాటు రెండవ అత్యుత్తమ అవార్డు అయిన అర్జున అవార్డులను 15 మంది క్రీడాకారులకు అందజేసింది. ద్రోణాచార్య, ద్యాన్‌చంద్ లాంటి అవార్డుల విషయాన్ని పక్కన పెడితే ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రదానం చేస్తున్న తీరును గమనిస్తే కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న క్రైటేరియా ఏమిటనే సందేహం రాకపోదు. క్రీడా రంగంలో వరుసగా నాలుగేళ్లపాటు ‘స్పెక్టాక్యులర్ (అద్భుతంగా)’, ‘అవుట్ స్టాండింగ్ (అసాధారణం)’ రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డులను ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. స్పెక్టాక్యులర్, అవుట్ స్టాండింగ్ అనే పదాలకు సరైన నిర్వచనమే మార్గదర్శకాల్లో లేదు. అంటే కేంద్రంలో అధికారంలోవున్న ఏ ప్రభుత్వమైనా ఈ పదాలను ఎలాగైనా వాడుకోవచ్చన్నమాట. ఖేల్‌రత్న, అర్జున అవార్డుల కోసం క్రీడాకారులను ఎంపిక చేయడానికి మాజీ క్రీడాకారులు, మాజీ అవార్డు గ్రహీతలు, ఒలింపియన్స్, క్రీడల జర్నలిస్టులు, నిపుణులు, క్రీడల నిర్వాహకులు, కామెంటేటర్లతో కూడిన ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అవార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. వివిధ రకాల క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులు గత నాలుగేళ్లలో సాధించిన విజయాలేమిటో పరిశీలించి వాటికి 80 మార్కులు వేస్తుంది. ఆ తర్వాత వారి ఒవరాల్ ప్రతిభను పరిగణలోకి తీసుకొని మరో 20 వెయిటేజ్ మార్కులు వేసే అధికారం కమిటీకి ఉంది. ఆ తర్వాత అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను కేంద్ర క్రీడల శాఖ మంత్రికి పంపిస్తుంది. తుది నిర్ణయం ఆ మంత్రియే తీసుకోవాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులను సూచించే అధికారం కూడా ఆ మంత్రికి ఉంటుంది. ఇప్పటి వరకు ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించారా? అత్యుత్తమ అవార్డు అయిన ఖేల్ రత్ననే పరిగణలోకి తీసుకుంటే ఆయా కాలాల్లో అంతర్జాతీయ క్రికెట్ రంగంలో బాగా రాణించిన రాహుల్ ద్రవిడ్ (24,208 పరుగులు), సౌరభ్ గంగూలి (18,575 పరుగులతోపాటు ఉత్తమ కెప్టెన్‌గా గుర్తింపు)కి, దేశంలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే (956 వికెట్లు)లను ఎందుకు విస్మరించారు.? క్రికెట్లో సచిన్‌కు తప్పా ఎవరికి ఖేల్ రత్న ఇవ్వలేదని, ఆ క్రీడను అవార్డు కోసం అంతగా పరిగణలోకి తీసుకోమని సమాధానం వచ్చినట్లయితే 12 మేజర్స్‌లో విజయం సాధించిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేశ్ భూమతిని ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తక మానదు. 1999 నుంచి 2002 మధ్య ఆయన కనీసం ఐదు మేజర్స్‌లో విజయం సాధించారు. చెస్‌లో విశ్వనాథ ఆనంద్‌కు మొట్టమొదటిసారిగా 1991–1992లో ఖేల్ రత్న అవార్డు రాగా ఎక్కువ మందికి షూటింగ్‌లోనే ఖేల్ రత్న అవార్డులు వచ్చాయి. ఏ క్రీడలను ప్రోత్సాహించాలనుకుంటున్నారో, ఎవరికి అవార్డులు వస్తాయో సందేహాస్పదంగా ఉంటోంది. ఒలింపిక్స్‌లో ఉత్తమంగా రాణించారనే ఉద్దేశంలో ఈసారి నలుగురు ఒలింపియన్లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారని సరిపెట్టుకోవచ్చు. ప్రతిసారి అలా జరగడం లేదుకదా, ప్రతి ఏడాది ఒలింపిక్స్ ఉండవుకదా! అందుకని ఎంపిక క్రైటేరియానే మార్చాల్సి ఉంటుందేమో!