విజేత కోనేరు హంపి | Koneru Humpy bags 2nd BBC Indian Sportswoman of the Year award | Sakshi

విజేత కోనేరు హంపి

Mar 9 2021 6:39 AM | Updated on Mar 9 2021 6:39 AM

Koneru Humpy bags 2nd BBC Indian Sportswoman of the Year award - Sakshi

న్యూఢిల్లీ: భారత చెస్‌ స్టార్, ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది. వార్షిక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి ‘ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్, స్ప్రింటర్‌ ద్యుతీ చంద్, షూటర్‌ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. 40 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డు నామినీలను ఎంపిక చేయగా... అభిమానుల ఓటింగ్‌ ద్వారా విజేతను నిర్ణయించారు.

ఐదుగురు నామినీల్లో అత్యధిక ఓట్లు హంపికే వచ్చాయని బీబీసీ తెలిపింది. అవార్డుల ప్రకటన కార్య క్రమాన్ని ‘వర్చువల్‌’గా బీబీసీ నిర్వహించింది. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్‌ అయిన అంజూ జార్జ్‌కు ‘లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు... షూటర్‌ మనూ భాకర్‌కు ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించాయి. భారత క్రీడారంగంలోని అత్యు త్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019లో ఈ అవార్డును బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది.

ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మొత్తం చెస్‌ క్రీడకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. క్రికెట్‌ సహా ఇతర క్రీడలతో పోలిస్తే భారత్‌లో చెస్‌పై ఎక్కువ మంది దృష్టి ఉండదు. ఇకపై మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నా ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కారణంగానే ఇన్నేళ్లుగా విజయాలు సాధించగలుగుతున్నాను. ఒక మహిళా క్రీడాకారిణి ఆటను వదిలేయాలని ఎప్పుడూ అనుకోరాదు. పెళ్లి, పిల్లలు జీవితంలో భాగమే కానీ మన జీవన గమనాన్ని మార్చరాదు.
–హంపి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement