గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్‌లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది.
రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది.
దీపకు మూడో పురస్కారం
పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్‌లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
విమల్‌కు ద్రోణాచార్య
సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్‌బన్ పటేల్, రణ్‌బిర్‌సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు.
మేరీ తప్పుకుంది...
భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది.
అవార్డు నామినీల జాబితా
రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్).
అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో).
ఆర్‌డీటీకి పురస్కారం
క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది.
కాలక్రమంలో రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది.
‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’
– ‘సాక్షి’తో సాయి ప్రణీత్
‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’
– ట్విట్టర్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన
‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్‌రాణా షూటింగ్‌లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్‌వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’
– ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా
దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్
Comments
Please login to add a commentAdd a comment