దీపా మాలిక్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది.
పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది.
శక్తి పుంజం
దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు.
ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు
దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది.
రెండు యుద్ధాలను జయించిన వేళ
కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది.
దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment