Tumor surgery
-
కడుపులో కణితి..ప్రాణాంతకమా? కాదా?
ఇండోర్‌కి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 15 కిలోల భారీ కణితిని గుర్తించారు వైద్యులు. రెండు గంటలకు పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి మరీ ఆ కణితిని తొలగించారు ఇండెక్స్ ఆస్పత్రి వైద్యబృందం. ఆ మహిళ ఆ భారీ కణితితో చాలా ఇబ్బంది పడింది. తినాలన్నా నడవాలన్న చాలా ఆయాసపడేది. గత కొంతకాలంగా ఆ ఇబ్బంది పడలేక చివరికి ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా ఈకణితికి గురించి తెలిసింది. చాలా పెద్ద సైజులో ఉందని తొలగించకపోతే ఏ క్షణమైన పగిలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించకుందామె. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కణుతులు గురించి. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. అసలు ఎందువల్ల వస్తుంది? ఇది ప్రాణాంతకమా? తదితరాల గురించే ఈ కథనం. ఈ కణితి ఎందుకు ఏర్పడుతుందంటే.. శరీరం కొత్త కణాలను తయారు చేసేటప్పుడూ ఆటోమెటిక్‌గా పాత కణాలు చనిపోతాయి. కానీ ఒక్కొసారి ఆ కణాలు చనిపోకుండా పాతవాటి కంటే వేగంగా పెరగడం జరగుతుంది. అవన్నీ పోగులు మాదిరిగా ఏర్పడి పెరిగి కణితిలా ఏర్పడుతాయి. ఇది చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. కణితులు రావడానకి గల కారణాలు శరీరంలో పరివర్తన చెందిన బీఆర్సీఏ జన్యువుల వంటి జన్యు ఉత్పరివర్తనలు లించ్ సిండ్రోమ్ వంటి వారసత్వ పరిస్థితులు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కుటుంబ చరిత్రలో ఉన్నా ధూమపానం బెంజీన్ వంటి టాక్సిన్స్‌కు గురికావడం హెచ్‌పీవీ వంటి వైరస్లుస ఊబకాయం సంకేతాలు లేదా లక్షణాలు కణితులు సంకేతాలు లేదా లక్షణాలు ⇒త్వరితగతిన అలసటకు గురవ్వడం ⇒జ్వరం ⇒తొందరగా బరువు తగ్గడం ⇒ఆకలి లేకపోవడం ⇒రాత్రిపూట సడెన్‌గా చెమటలు పట్టడం ⇒భరించలేని ఒకవిధమైన కడుపు నొప్పి అన్ని రకాల కణితులు ప్రమాదకరమా? ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డలు లేదా పెరుగుదలలను ఏర్పరిచే అసాధారణ కణాల సమూహాలు. అవి మన శరీరంలోని ట్రిలియన్ల కణాలలో దేనిలోనైనా ప్రారంభమవుతాయి. ►కణితులు పెరుగుతాయి. కానీ కొన్ని భిన్నంగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ లేదా ప్రాణాంతకమైనవిగా కూడా ఉంటాయి. మరికొన్ని క్యాన్సర్ కానివి లేదా అపాయకరం కానివి అనే విధానాలపై ఉధారపడి ఉంటాయి కణితులు ►ఈ కణితులు శరీరంపై ఎముకలు, చర్మం, గ్రంథులు, ఇతర అవయవాలతో సహ శరీరం అంతటా ఎక్కడైనా రావచ్చు. ఐతే అది ఎక్కడ ఏర్పడింది అనే దానిపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ►ఇలాంటి కణితుల సమస్యను ఎదుర్కొనకూడదంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ తగినంతగా వ్యాయామం కూడా చేసి ఫిట్నెస్గా ఉంటే ఈ సమస్య తలెత్తకుండా చూడొచ్చు లేదా ఈజీగా బయటపడొచ్చు. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
మహిళ కడుపులో 4.5 కిలోల కణితి తొలగింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మహిళ కడుపులోని గర్భసంచికి అతుక్కుని ఉన్న 4.5 కిలోల కణితిని విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. రక్తస్రావం, కడుపునొప్పితో విజయవాడకి చెందిన సీహెచ్ ఆదిలక్ష్మి పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి ఇటీవల వచ్చింది. ఆమెకు పరీక్ష చేసిన వైద్యులు కడుపులో పెద్దగడ్డ ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాని నిర్ణయించారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, గైనకాలజీ నిపుణులు డాక్టర్ విజయశీల, డాక్టర్ కరుణలతో కలిసి లేపరోటమీ విధానంతో అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులోని గడ్డను తొలగించారు. లేపరోటమీ, రిలీజ్ ఆఫ్ అథిషన్స్, టీఏహెచ్ విధానం అవలంభించి ఈ శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. రోగి ఆదిలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో మత్తు నిపుణులు డాక్టర్ పీఎన్‌రావు, డాక్టర్ రాంబాబు, గైనిక్ పీజీ డాక్టర్ శాంత్రలు పాల్గొన్నారు. -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
విద్యార్థిని కడపులో కేజీ కణితి!
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం): ఓ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సమయస్ఫూర్తితో ఓ విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన విద్యార్థి ప్రాణానికే ముప్పు వాటిల్లేది. వివరాలిలా.. మండలంలోని దబ్బతోగు గ్రామానికి చెందిన మల్లం లక్ష్మి అనే విద్యార్థిని బీమునిగూడెం ఐటీడీఏ బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా నెల రోజుల క్రితం ప్రత్యేక కోచింగ్‌లో భాగంగా అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరగా, అనాటి నుంచి ఇక్కడే చదువుతుంది. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రాగా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాల హెచ్ఎం అజ్మీర కృష్ణకుమారి తక్షణమే స్పందించి తన కారులోనే గుమ్మడవల్లి ప్రభుత్వ వైద్యాశాలకు తరలించి వైద్యం చేయించారు. ఐనా సరే కడుపు నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో అశ్వారావుపేట వైద్యాశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాంతో హుటాహుటిన సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే శస్త్ర చికిత్స చేసి తొలగించకపోతే కణితి పగిలిపోయి ప్రాణాపాయం కలుగుతుందని చెప్పారు. దీంతో హెచ్ఎం స్పందించి అన్నీ తానే అయి శస్త్ర చికిత్స చేయించారు. దీంతో తెల్లవారు జామున శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో నుంచి కేజీ బరువు ఉన్న కణితిని తొలగించారు. అనంతరం విద్యార్థిని ప్రాణపాయం తప్పి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హెచ్ఎం సమయస్ఫూర్తి, సకాలంలో స్పందించడం వల్లే శస్త్రచికిత్స చేసి విద్యార్థిని ప్రాణాలు కాపాడగలిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
న్యూరో కౌన్సెలింగ్
మెదడులో కణుతుల సర్జరీ ఎలాగంటే..! మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు. అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించిన తర్వాత ఇటీవల ఎమ్మారై స్కాన్ చేయిస్తే మెదడులో క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు తేలింది. ఇది మాకు షాక్‌లా ఉంది. సర్జరీ, రేడియేషన్‌తో కణుతులను తొలగించవచ్చని ఆయన అంటున్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - కిరణ్మయి, గుడివాడ మెదడులో క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. ఒకప్పుడు మెదడులో కణుతులకు చికిత్స కష్టమేమోగానీ, ఇప్పుడున్న చికిత్స పద్ధతులతో ఇది మరీ అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. చాలారకాల కణుతులకు సమర్థంగా చికిత్స అందించవచ్చు. సాధారణ కణుతులను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ కణుతుల విషయంలో వాటిని తొలగించడంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడులో వచ్చే కణుతుల్లో నాలుగు గ్రేడులు ఉంటాయి. ఇతర క్యాన్సర్ల మొదటి దశతో మొదలై క్రమేపీ ముదిరి నాలుగో దశకు చేరతాయి. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే వాటిని దాదాపుగా నయం చేసే వీలుంటుంది. కానీ మెదడులో వచ్చే క్యాన్సర్ కణుతుల విషయంలో క్రమేపీ ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం ఉండదు. మొదలవుతూనే అవి మూడు లేదా నాలుగో దశలతో ఉండవచ్చు. కణితి మొదటి రెండు గ్రేడులలో ఉంటే చికిత్సతో రోగి జీవితకాలాన్ని పదేళ్లకు పెంచవచ్చు. కానీ నాలుగో దశలో కణుతులు ఉంటే మాత్రం రోగి ఎక్కువకాలం జీవించడం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగ్‌లో అది మొదటి రెండు గ్రేడ్లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన అవసరం లేదు. అది పెరిగి 2 నుంచి 3 సెం.మీ. సైజుకు చేరితే అప్పుడు సర్జరీ అవసరమవుతుంది. అలాగే మెదడులోని నుదురు, చెవుల భాగంలో వచ్చే కణుతులను సర్జరీతో తొలగిస్తే చాలావరకు సాధారణ జీవితం గడపవచ్చు. కానీ మెదడు మధ్యభాగంలో వచ్చే కణుతులను పూర్తిగా తొలగించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు మాటలు వచ్చేలా చేసే కేంద్రం, శరీర కదలికలను నియంత్రించే కేంద్రం వంటి వాటిని గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితిని తొలగించాలి. మిగిలిపోయిన భాగాలను రేడియోథెరపీ, కీమోథెరపీల ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ కణితి మెదడు మధ్యభాగంలో వస్తే మెదడు కణజాలాన్నీ , కణితినీ వేరు చేసి చూడటం కష్టమవుతుంది. పొరబాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం. కాబట్టి ఈ తేడాను గుర్తించేందుకు నిపుణులు మైక్రోస్కోపిక్, నావిగేషన్ వంటి పరిజ్ఞానాలను వినియోగిస్తారు. అంటే భిన్న ప్రక్రియలను ఉపయోగించి మెదడు కణుతులను తొలగించేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా అన్ని సౌకర్యాలతో పాటు నిపుణులైన న్యూరోసర్జన్లు ఉన్న దగ్గర్లోని కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స తీసుకోండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్