
న్యూఢిల్లీ: స్టార్ జావెలిన్ త్రోయర్, గతేడాది ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా పేరును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశంలోని అతి కొద్దిమంది ప్రపంచస్థాయి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో ఒకడైన నీరజ్ గతేడాది కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం సాధించడంతో ‘అర్జున అవార్డు’కు ఎంపికయ్యాడు. అప్పుడు కూడా ఖేల్‌రత్నకు పరిశీలనకు పంపినా ఆ పురస్కారం దక్కలేదు.
అయితే, కొత్త జాతీయ రికార్డు (88.06 మీటర్లు)తో ఆసియా క్రీడల్లో బంగారు పతకం నెగ్గడంతో మరోసారి ప్రతిపాదించారు. ఈసారి అథ్లెటిక్స్ నుంచి ఏఎఫ్‌ఐ నీరజ్‌ను మాత్రమే ఖేల్‌రత్నకు పంపింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు తేజీందర్ పాల్‌సింగ్ తూర్ (షాట్‌పుట్), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్‌జీత్ సింగ్ (800 మీ. పరుగు), స్వప్న బర్మన్ (హెప్టాథ్లాన్)తో పాటు ద్యుతీ చంద్ (100 మీ, 200 మీ. పరుగులో రజతం)లను అర్జున అవార్డుకు ప్రతిపాదించారు.