ఎకతెరీన్‌బర్గ్(రష్యా): పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకొని చరిత్ర సృష్టించిన భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్‌కు ఫైనల్లో నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల 52 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరి ఫైనల్ పోరులో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షాకోబిదిన్ జైరోవ్ చేతిలో 5-0 తేడాతో అమిత్ ఘోర పరాజయం చవిచూశాడు. స్వర్ణ పతక రేసులో ప్రత్యర్థి పంచ్‌లకు అమిత్ తలవంచాడు. కనీసం పోరాడకుండానే ఫైనల్ బౌట్‌ను ప్రత్యర్థికి అప్పగించాడు. దీంతో స్వర్ణం సాధిస్తాడనుకున్న అమిత్ రజతానికే పరిమితమయ్యాడు. మరోవైపు ఇప్పటికే మనీష్ కౌశిక్ కాంస్య పతకం గెలవడంతో భారత్ తొలిసారి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో మెరుగైన రికార్డు సాధించింది.
మూడు దశాబ్ధాల చరిత్ర కలిగిన ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క భారత్ బాక్సర్ కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. అయితే తొలి సారి అమిత్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. దీంతో స్వర్ణపతకం గెలిచి భారత బాక్సింగ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాడని అందరూ భావించారు. కానీ ఫైనల్ పోరులో ఈ స్టార్ బాక్సర్‌కు చుక్కెదురైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అయితే రజతం సాధించినప్పటికీ కొత్త చరిత్రకు నాంది పలికాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017) కాంస్యం నెగ్గిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment