
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ (49 కేజీలు) ఆసియా క్రీడల ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమిత్ 3–2తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)పై గెలిచి పసిడి పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏషియాడ్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన ఏకైక బాక్సర్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ దుస్మతోవ్ హసన్‌బాయ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్ తలపడతాడు.
మరో భారత బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) ఎడమ కంటి గాయం కారణంగా సెమీస్ బరిలోకి దిగలేదు. దీంతో అతనికి కాంస్య పతకం ఖాయమైంది. వికాస్ శుక్రవారం సెమీఫైనల్లో అబిల్‌ఖాన్ (కజకిస్తాన్)తో తలపడాల్సి ఉం డగా... గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ పతకంతో వికాస్ వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు.