స్వర్ణమే నా టార్గెట్: భారత బాక్సర్
రియో డిజెనీరో: ఒలింపిక్స్‌లో పతకం కోసం మొహం వాచి ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానుల్లో కొద్దికొద్దిగా కాంతిరేఖలు వికసిస్తున్నాయి. ఇప్పటికే మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ సెమీస్‌లోకి ఎంటరైంది. వీరికి మరో విజయం దూరంలో ఒలింపిక్స్ పతకం ఊరిస్తోంది. ఈ జోడీ ఫైనల్‌లోకి వెళితే.. పతకం ఖాయం. ఒకవేళ ఓడినా కాంస్యం దక్కే చాన్స్ ఉంది.
ఇక భారత బాక్సర్ వికాస్ కిషన్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. అతడు ఇంకో విజయం సాధిస్తే భారత్ ఖాతాలో పతకం చేరుతుంది. 75 కేజీల మిడిల్ వెయిట్ బౌట్‌లో ప్రీక్వార్టర్ ఫైనల్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన వికాస్.. టర్కీకి చెందిన ఒండర్ సిపాల్‌పై అలవోకగా విజయం సాధించాడు. 3-0 తేడాతో సంపూర్ణ విజయాన్ని సొంతం చేసుకున్న వికాస్.. భారత్ తరఫున స్వర్ణపతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం గెలువాలనే తాను కోరుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్‌తో బౌట్‌లో విజయం సాధిస్తే తాను తప్పకుండా ఒలింపిక్స్ స్వర్ణంతో భారత్‌లో అడుగుపెడతానని ఆయన పేర్కొన్నాడు.
'మెలికుజీవ్ గ్రూప్ విభాగంలో చాలా టఫ్‌గా కనిపించాడు. క్వార్టర్ ఫైనల్‌లో నేను కనుక అతన్ని ఓడిస్తే స్వర్ణంతో భారత్‌లో అడుగుపెడతాను. నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రజతం కానీ, కాంస్యంతో కానీ నేను సరిపెట్టుకోను. ఒకవేళ ఉత్త చేతులతో వస్తా లేదా స్వర్ణపతకంతో దేశంలో అడుగుపెడతా. అతన్ని ఓడిస్తే స్వర్ణాన్ని గెలువడం ఖాయం' అని 24 ఏళ్ల వికాస్ ధీమా వ్యక్తం చేశాడు. మరీ వికాస్ కచ్చితంగా గెలువాలని కోరుకుంటూ మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!