'రియోలో పతకం సాధిస్తా'
న్యూఢిల్లీ: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్లో పతకం సాధిస్తానని భారత బాక్సర్ వికాస్ క్రిషన్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ పోటీలో వికాస్ క్రిషన్(75కేజీ) సెమీస్ కు చేరి రియో అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే రియోలో కూడా పతకం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ' నాకు రియోలో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. కనీసం కాంస్య పతకమైనా సాధిస్తా. రెండు బౌట్లు గెలిస్తే కాంస్య పతకం గెలిచే అవకాశ ఉంది. నా వరల్డ్ ర్యాంకింగ్ను బట్టి రియోలో డ్రా కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. తొలి రెండు బౌట్లలో కఠినమైన ప్రత్యర్థులు ఎదురుపడకపోవచ్చు. ఇదే కేటగిరిలో గతంలో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కనీసం కాంస్య పతకాన్ని సాధిస్తానని నాకు కూడా బలమైన నమ్మకం ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోయా. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని వదులుకోను. పతకం సాధించడానికి శతవిధిలా ప్రయత్నిస్తా' వికాస్ క్రిషన్ తెలిపాడు.
తాను రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని తొలుత అనుకోలేదన్నాడు. వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలకు తీవ్రమైన ఒత్తిడిలో సన్నద్దమయ్యానని, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమించానన్నాడు. దీంతో ఫలితాన్ని సాధించానన్నాడు. ఈ పోరులో మూడు బౌట్లను ఏకపక్షంగా గెలిచి సత్తాచాటడంతో తనపై నమ్మకం పెరిగిందన్నాడు.