మో ఫరా... ‘డబుల్’ డబుల్
* 5000 మీటర్లలోనూ స్వర్ణం
* ‘రియో’లో రెండో పసిడితో రికార్డు
రియో డి జనీరో: సుదూరపు పరుగులో తనకు ఎదురులేదని బ్రిటన్ అథ్లెట్ మో ఫరా నిరూపించాడు. రియో ఒలింపిక్స్‌లో అరుదైన ‘డబుల్’ సాధించాడు. ఇప్పటికే 10 వేల మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గిన మో ఫరా... 5 వేల మీటర్లలోనూ పసిడి పతకాన్ని నెగ్గి తన సత్తా చాటుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ మో ఫరా ఈ రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. 1976లో లాసీ వీరెన్ (ఫిన్‌లాండ్) తర్వాత ఒలింపిక్స్‌లో ఈ రెండు విభాగాల్లో టైటిల్ నిలబెట్టుకున్న అథ్లెట్‌గా మో ఫరా గుర్తింపు పొందాడు.
సోమాలియాలో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడ్డ 33 ఏళ్ల ఫరాకు 5 వేల మీటర్ల ఫైనల్లోనూ అంతగా పోటీ ఎదురుకాలేదు. వ్యూహత్మంగా మొదట్లో నెమ్మదిగా పరిగెత్తిన ఫరా ఆ తర్వాత క్రమంగా వేగాన్ని పెంచాడు. చివరికొచ్చేసరికి తన ప్రత్యర్థులను సులభంగా వెనక్కి నెట్టి 13 నిమిషాల 03.30 సెకన్లలో గమ్యానికి చేరి విజయాన్ని దక్కించుకున్నాడు. కిప్కెమోయ్ పాల్ (అమెరికా-13ని:03.90 సెకన్లు) రజతం, హగోస్ జెబ్రివెట్ (ఇథియోపియా-13ని:04.35 సెకన్లు) కాంస్యం గెలిచారు.