నవ చరిత
పడి...లేచి... పసిడి పట్టాడు!
మళ్లీ స్వర్ణం గెలిచిన మో ఫరా
10 వేల మీటర్ల పరుగులో అగ్రస్థానం
రియో డి జనీరో: 10 వేల మీటర్ల పరుగు...ఫేవరెట్ మొహమ్మద్ ఫరా దూసుకుపోతున్నాడు. అయితే అనూహ్యంగా అతను ట్రాక్‌పై కింద పడిపోయాడు. అప్పటికే మరో 16 ల్యాప్‌లు పరుగెత్తాల్సి ఉంది. ఆ క్షణంలో తన పోరాటం ముగిసినట్లేనని అతను భావించాడు. కానీ కొద్ది సేపటికే తేరుకొని మొండిగా పరుగెత్తాడు. చివరకు తన స్థాయికి తగిన రీతిలో రేస్‌ను ముగించి సత్తా చాటాడు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో 27 నిమిషాల 5.17 సెకన్లలో లక్ష్యం చేరి ఫరా స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. 33 ఏళ్ల ఫరా 2012 లండన్ ఒలింపిక్స్‌లో కూడా ఇదే ఈవెంట్లో పసిడి సాధించాడు. పాల్ తనుయ్ (కెన్యా-27 ని. 5.64 సె.) రజతం గెలుచుకోగా, తమీరత్ తోలా (ఇథియోపియా-27 ని. 6.26 సె.)కు కాంస్యం దక్కింది. చివరి ల్యాప్‌లో ఫరాను దాటి తనుయ్ ముందంజ వేసినా... ఆఖరి 100 మీటర్లలో దూసుకుపోయి ఫరా విజేతగా నిలిచాడు.
సహచర అథ్లెట్, లండన్‌లో రజతం సాధించిన గాలెన్ రుప్ తోసేయడంతో ఫరా కింద పడినట్లు గుర్తించారు. అయితే ఇదంతా రేస్‌లో అనుకోకుండా జరిగిందని, ముందు ఉన్న అథ్లెట్లు ఒక్కసారిగా నెమ్మదించడంతో ఇలా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని రుప్ స్పష్టం చేశాడు. ‘నా పని అయిపోయిందనిపించింది. అయితే ముందు గెలుపు గురించి ఆలోచించకుండా కష్టమైనా పరుగు కొనసాగించాలని లేచాను. ఆ క్షణంలో నా కుటుంబం గుర్తుకు వచ్చింది. నా ఇన్నేళ్ల కష్టం ఒక్క నిమిషంలో చేజారిపోకూడదని భావించా’ అని ఫరా ఉద్వేగంగా చెప్పాడు. 5 వేల మీటర్ల పోరులో స్వర్ణం నిలబెట్టుకునేందుకు అతను బుధవారం బరిలోకి దిగనున్నాడు.
సోమాలియాలో ఎనిమిదేళ్ల పిల్లాడు... కారు మెకానిక్ కావాలని అనుకున్నాడు. కానీ తండ్రితోపాటు లండన్ వచ్చేయడంతో... ఫుట్‌బాల్ మీద మోజు పెరిగింది. ఎలాగైనా ఆర్సెనల్కు ఆడితే స్టార్ కావచ్చని అనుకున్నాడు. ఇప్పుడు అతని వయసు 33 ఏళ్లు... బ్రిటన్‌లో పెద్ద స్టార్. కానీ ఫుట్‌బాల్ ఆటగాడిగా కాదు.. లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా. మొహమ్మద్ ముక్తార్ జమా ఫరా (మో ఫరా)... రియో ఒలింపిక్స్‌లో పదివేల మీటర్ల రేసులో స్వర్ణం గెలిచాడు. బ్రిటన్ చరిత్రలో మూడు స్వర్ణాలు గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.
బ్రిటిష్ వలసపాలనలోని సోమాలియా రాజధాని మొగదిషులో పుట్టిన మో ఫరా.. తండ్రి ఉద్యోగం కారణంగా ఎనిమిదేళ్లప్పుడు కుటుంబంతో సహా సోమాలియా నుంచి వలస వచ్చేశాడు. లండన్‌లో స్కూల్లో ఉండగా... మో ఫరాలో ఉన్న అథ్లెటిక్ టాలెంట్‌ను వ్యాయామ ఉపాధ్యాయుడు గుర్తించారు. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టడం, బాల్యంలో సరైన విద్య లేకపోవటంతో లండన్‌కు వచ్చేటప్పటికీ ఇతనికి ఇంగ్లీషు సరిగా రాదు. అయినా.. ఏదో సాధించాలన్న పట్టుదలతో అటు రన్నింగ్‌తోపాటు ఇటు భాష నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. జూనియర్ స్థాయిలో ఉన్నప్పుడే, 1996లో (13 ఏళ్ల వయసులో) హాన్స్లో క్రాస్-కంట్రీ ఈవెంట్లో, లండన్ యూత్ గేమ్స్‌లో పాల్గొని అందరినీ ఆకర్షించాడు. ఈ సమయంలో మో ఫరా టాలెంట్‌ను గుర్తించిన క్రీడా ప్రేమికుడు ఎడ్డీ కులుకుండిస్... లీగల్ ఫీజులు తను చెల్లించి ఫరాకు బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించారు.
‘డబుల్’ గోల్డ్ రికార్డు
1999 నుంచి వివిధ అంతర్జాతీయ, యురోపియన్ యూనియన్ ఈవెంట్లలో రికార్డు టైమింగ్‌తో సత్తా చాటాడు మో ఫరా. అయితే.. బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 10వేల మీటర్ల పరుగులో, 5వేల మీటర్ల పరుగులో బంగారు పతకాలు సాధించి బ్రిటన్ తరపున డిస్టెన్స్ రన్నింగ్‌లో తొలి స్వర్ణం అందుకున్న అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మాస్కోలో జరిగిన ప్రపంచచాంపియన్ షిప్‌లోనూ స్వర్ణం సాధించాడు. 2015లో యూరో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్‌మెడల్ ‘డబుల్’ రికార్డు సృష్టించాడు. తాజాగా రియోలోనూ 10వేల మీటర్ల పరుగులో ‘తడబడినా పరుగిడి’ బంగారు పతకాన్ని సాధించాడు. బ్రిటన్ తరపున మూడు వ్యక్తిగత స్వర్ణాలు అందుకున్న తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు. ఫరాకు అథ్లెటిక్స్ ప్రపంచంలో మిస్టర్ క్లీన్ అనే పేరుంది.
పరోపకారమే పరమధర్మం
ఇస్లాంను తూచ తప్పకుండా పాటించే మో ఫరా... దేవుడు జీవితాన్నిచ్చింది పరోపకారం చేసేందుకు అని బాగా విశ్వసిస్తాడు. అందుకే తనకొచ్చే ఆదాయంతో.. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాడు. తను పుట్టిన సోమాలియాలో పరిస్థితేంటో తెలుసుకాబట్టి.. అక్కడ ‘మో ఫరా ఫౌండేషన్’ పేరుతో 2011 నుంచి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పేస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, నైకీ, ల్యుకోజేడ్, క్వోరన్, బూపా, వర్జిన్ మీడియా సంస్థలతో ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బునూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. 2012లో బ్రిటన్‌లోని ఐటీవీ అనే సంస్థ నిర్వహించే ‘ద క్యూబ్’ అనే గేమ్ షోలో పాల్గొన్న మో ఫరా.. చివరి వరకు ఆడి ఫుల్ జాక్‌పాట్ కొట్టేశాడు. దీంతో 2.5 లక్షల పౌండ్లు (దాదాపు రూ. 2.16కోట్లు) వచ్చాయి. దీన్ని కూడా మో ఫరా ఫౌండేషన్‌కు బదిలీ చేసి సేవా కార్యక్రమాలకు వినియోగించాడు.
మోబోట్ సంతకం
రేసు గెలవగానే మో ఫరా చేసే విజయ సంకేతం చాలా ప్రత్యేకం. దీన్ని మోబోట్ సంతకం అంటారు. తలపై ఇంగ్లీషు అక్షరం ‘ఎం’ ఆకారంలో చేతులుంచుతాడు. ఇది అథ్లెటిక్ ప్రపంచంలో చాలా ప్రతేకంగా మారింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తర్వాత బ్రిటన్‌లో ఓ రోబోట్‌కు మోబోట్ అని పేరుపెట్టారు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కూడా మో ఫరా మైనపు బొమ్మనుంచి గౌరవించారు. - సాక్షి క్రీడావిభాగం