లేడీ చిరుత | Rio Olympics 2016: Elaine Thompson wins 100m gold, Shelly-Ann Fraser-Pryce third | Sakshi
Sakshi News home page

లేడీ చిరుత

Published Mon, Aug 15 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

లేడీ చిరుత

లేడీ చిరుత

 థాంప్సన్ ‘తుఫాన్’  
 మహిళల 100 మీటర్ల పరుగులో సంచలనం
 విజేతగా నిలిచిన ఎలైన్ థాంప్సన్
 ఫ్రేజర్‌కు మూడో స్థానం

 
 రియో: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మహిళా అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న జమైకా సూపర్ స్టార్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ కల చెదిరింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలవాలన్న ఆమె కోరిక తీరలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన 100 మీటర్ల రేసులో జమైకాకే చెందిన ఎలైన్ థాంప్సన్ అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. 24 ఏళ్ల థాంప్సన్ 10.71 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. ఫ్రేజర్ (10.86 సె.) కాంస్యంతో సరి పెట్టుకోగా... టోరీ బోవీ (అమెరికా-10.83 సె.) రజత పతకం సాధించింది. ‘లైన్‌ను దాటాక నేను గెలిచానని అర్థమైంది. అసలు ఎలా సంబరాలు చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. జమైకాలో మా వర్గానికిచెందిన వారు భారీ స్క్రీన్ పెట్టి ఈ రేస్ చూసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఉందో అసలు ఊహించలేను’ అని థాంప్సన్ ఉద్వేగంగా చెప్పింది.
 
  2008, 2012 ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఫ్రేజర్‌కు  ఈ సారి మూడో స్థానం మాత్రమే లభించింది. అయితే తన ఓటమిపై నిరాశ చెందడం లేదని, జమైకా అథ్లెటే స్వర్ణం సాధించడం పట్ల గర్వపడుతున్నానని ఫ్రేజర్ వ్యాఖ్యానించింది. 100మీటర్ల రేస్‌లో ఏడుగురు అథ్లెట్లు 11 సెకన్లలోపే పరుగు ముగించడం ఇదే తొలిసారి.
 
 ప్రపంచంలో వేగవంతమైన మహిళగా థాంప్సన్
 ప్రపంచంలో ఫాస్టెస్ట్ అథ్లెట్లకు, జమైకా దేశానికి ఉన్న అనుబంధం కొత్తది కాదు... అలాగే ఆయా విజేతల నేపథ్యాలు కూడా దాదాపుగా ఒకే తరహాలో ఉంటాయి.  పేదరికం, ఆ తర్వాత ఎవరో ఒకరి ప్రోత్సాహంతో అద్భుతాలు చేయడం లాంటి వాస్తవాలు కూడా కొత్త కాదు. ఇప్పుడు ఇదే జాబితాలో వరల్డ్ ఫాస్టెస్ట్ ఉమన్ అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ కూడా చేరింది.
 
 ఒక్క బిడ్డను కూడా పోషించలేని కడు పేదరికం ఎలైన్ తల్లిదండ్రులది. దాంతో ఏడేళ్ల వయసులోనే అమ్మమ్మ తనతో తీసుకెళ్లిపోయింది. ఆమే అన్నీ అయి మనవరాలిని పెంచింది. ఇప్పుడు స్టార్ అథ్లెట్‌ను వెనక్కి తోసి ఒలింపిక్స్ స్వర్ణంతో థాంప్సన్... అమ్మమ్మకు అరుదైన బహుమతి అందించింది.
 
 సాక్షి క్రీడా విభాగం
 పాఠశాల స్థాయిలో ఎలైన్ పెద్దగా పరుగెత్తింది లేదు. సరిగా రన్నింగ్ చేయడం రాదంటూ ఆమెను స్కూల్ జట్టులోంచి కూడా తీసేశారు. అయితే అక్కడి కోచ్ పాల్ ఫ్రాన్సిస్... థాంప్సన్‌లో ప్రతిభను గుర్తించాడు. ఇప్పుడు కాకపోయినా సరైన దిశలో శిక్షణ ఇస్తే మున్ముందు విజయాలు దక్కుతాయని నమ్మాడు. అందుకే స్కాలర్ షిప్ ఇప్పించి మరీ కింగ్‌స్టన్‌లో కోచింగ్ సెంటర్‌లో చేర్పించాడు. అక్కడినుంచే ఆమె అసలు పరుగు ప్రారంభమైంది. దీనికి కొనసాగింపుగా జమైకాలో అథ్లెట్ల అడ్డా అయిన ఎంవీపీ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్‌లో కూడా థాంప్సన్‌కు అవకాశం దక్కింది. ఫ్రాన్సిస్ సోదరుడు స్టీఫెన్ ఇక్కడ హెడ్ కోచ్ కావడం కూడా ఈ జమైకా అమ్మాయికి కలిసొచ్చింది. కోచ్ ప్రోత్సాహం, మార్గనిర్దేశనంలో ఇక్కడే అథ్లెటిక్స్‌ను ఆమె మరింత సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించింది. స్కూల్, జూనియర్ స్థాయిలో వరుస విజయాలతో జమైకాలో గుర్తింపు లభించింది.
 
 అంతకంతకూ ఎదుగుతూ...
 ఇతర అథ్లెట్లతో పోలిస్తే ఎలైన్ కెరీర్ చాలా వేగంగా దూసుకుపోయింది. 2013నుంచి 100 మీటర్ల పరుగులో ప్రతీ ఏడాది థాంప్సన్ టైమింగ్‌లో మెరుగుదల ఉండటం విశేషం. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో రజతంతో ఒక్కసారిగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఈవెంట్ 4ఁ100రిలేలో స్వర్ణం నెగ్గిన జట్టులో కూడా ఎలైన్ సభ్యురాలు. 10.70 సెకన్లలో 100 మీ. పరుగు పూర్తి చేసి రియో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించింది.
 
 పట్టలేని ఆనందం...
 రియోలో సహచరి ఫ్రేజర్‌పై అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎలైన్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక్కసారి ఆమె ఫినిషింగ్ లైన్‌ను చేరాక స్వస్థలంలో సంబరాలు మిన్నంటాయి. ‘ఆమె నా బిడ్డ’ అంటూ అమ్మమ్మ గ్లోరియా మురిసిపోయింది.
 
 ఆ పతకాలు చూస్తే చాలు...
 ఎలైన్ థాంప్సన్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. కానీ అన్నింటా ఆమెకు అమ్మమ్మే అండగా నిలిచింది. గ్లోరియా మాటల్లోనే చెప్పాలంటే... ‘ఎలైన్ నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఆమె తల్లిదండ్రులనుంచి నేను తెచ్చుకున్నా మరీ గొప్ప జీవితాన్ని కూడా ఇవ్వలేదు. అయితే ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నా. నేను అప్పు చేసైనా సరే... ఆమె స్కూల్‌నుంచి, ప్రాక్టీస్‌నుంచి వచ్చాక తనకిష్టమైన మంచి భోజనం పెట్టడమే నాకు అమిత సంతృప్తినిచ్చేది. మమ్మల్ని పేదరికంనుంచి నువ్వే దూరం చేయగలవు అని చెప్పేదాన్ని.

 ఇప్పుడు ఎలైన్ దానిని నిజం చేసింది. ఆమె ప్రతీ సారి పోటీలో గెలిచినప్పుడల్లా తీసుకొచ్చి మెడల్‌ను ఇంట్లో పెట్టినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని అమ్మమ్మ నాటి రోజులు గుర్తు చేసుకుంది.  థాంప్సన్‌కు అందంగా అలంకరించుకోవడం అంటే బాగా ఇష్టమట! ట్రాక్‌పై ఎంత పెద్ద పోటీ అయినా తన డ్రెస్సింగ్‌పై కూడా అమిత శ్రద్ధ పెడుతుంది. చిన్నప్పటినుంచే జీవితంపై పోరాడి నెగ్గిన ఎలైన్ ఇప్పుడు  జమైకానుంచి వచ్చిన అనేక మంది అథ్లెట్లలో ఒకామె మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ.
 
 3 ఒలింపిక్స్‌లో మహిళల 100మీ. పరుగులో వరుసగా మూడుసార్లు జమైకా అథ్లెట్లు గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement