
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోలాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల ఫైనల్లో భారత యువ బాక్సర్ సచిన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యెర్బోలాత్ సాబిర్ (కజకిస్తాన్)తో జరిగిన టైటిల్ పోరులో సచిన్ 4–1తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కిది ఎనిమిదో స్వర్ణ పతకం కావడం విశేషం. గురువారం మహిళల విభాగంలో భారత బాక్సర్లు బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ బంగారు పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో 11 పతకాలు దక్కించుకొని టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల విభాగంలో అంకిత్ నర్వాల్ (64 కేజీలు), బిశ్వామిత్ర చోంగ్తోమ్ (49 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ మెగా టోర్నీలో 52 దేశాల నుంచి మొత్తం 414 మంది బాక్సర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment