world youth boxing championship
-
వన్షజ్, దేవిక, రవీనా పసిడి పంచ్...
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్... మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో వన్షజ్ 5–0తో దెముర్ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్ మెకీ (ఇంగ్లండ్)పై, రవీనా 4–3తో మేగన్ డెక్లెయిర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్ 1–4తో యుటా సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. -
సచిన్ పసిడి పంచ్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోలాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల ఫైనల్లో భారత యువ బాక్సర్ సచిన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యెర్బోలాత్ సాబిర్ (కజకిస్తాన్)తో జరిగిన టైటిల్ పోరులో సచిన్ 4–1తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కిది ఎనిమిదో స్వర్ణ పతకం కావడం విశేషం. గురువారం మహిళల విభాగంలో భారత బాక్సర్లు బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ బంగారు పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో 11 పతకాలు దక్కించుకొని టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల విభాగంలో అంకిత్ నర్వాల్ (64 కేజీలు), బిశ్వామిత్ర చోంగ్తోమ్ (49 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ మెగా టోర్నీలో 52 దేశాల నుంచి మొత్తం 414 మంది బాక్సర్లు పాల్గొన్నారు. -
Indian Women Boxers: సప్త స్వర్ణాలు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత బాక్సర్లు తమ విశ్వరూపం ప్రదర్శించారు. బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు విసిరిన పంచ్‌లకు పసిడి పతకాలు వచ్చాయి. పోలాండ్‌లో గురువారం జరిగిన ఫైనల్స్‌లో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు గీతిక (48 కేజీలు), బేబీరోజీసనా చాను (51 కేజీలు), పూనమ్ (57 కేజీలు), వింకా (60 కేజీలు), అరుంధతి (69 కేజీలు), థోక్చోమ్ సనమచ చాను (75 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2017 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అత్యధికంగా ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. ఫైనల్స్‌లో గీతిక 5–0తో నటాలియా (పోలాండ్)పై... బేబీరోజీసనా 5–0తో వలేరియా లింకోవా (రష్యా)పై... పూనమ్ 5–0తో స్థెలిన్ గ్రాసీ (ఫ్రాన్స్)పై గెలిచారు. వింకా పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుల్దిజ్ (కజకిస్తాన్) ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ చివరి రౌండ్ పూర్తి కాకుండానే బౌట్‌ను నిలిపి వేశారు. అరుంధతి 5–0తో బార్బరా (పోలాండ్)పై... సనమచ చాను 3–2తో డానా డిడే (కజకిస్తాన్)పై... అల్ఫియా 5–0తో దరియా కొజోరెజ్ (మాల్దొవా)పై విజయం సాధించారు. శుక్రవారం జరిగే పురుషుల విభాగం ఫైనల్లో భారత్ తరఫున సచిన్ సివాచ్ (56 కేజీలు) బరిలో ఉన్నాడు. -
బాబోయ్... ఈ ఆవులు మాకొద్దు
రోహ్తక్: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచినందుకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆవులను హరియాణా మహిళా బాక్సర్లు తిరిగి ఇచ్చేశారు. శారీరక పుష్టి కోసం ఆవు పాలు తాగితే మంచిదనే ఉద్దేశంతో బాక్సర్లు జ్యోతి గులియా, సాక్షి చౌదరి, నీతు గాంగాస్‌లకు తలా ఓ ఆవు ఇచ్చారు. ఆ ఆవులు పాలు ఇవ్వకపోగా తమని కుమ్మేస్తున్నాయని, గాయపరుస్తున్నాయని ఆ ముగ్గురు వాపోయారు. దీంతో గత నవంబర్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఆవుల్ని తిరిగి అప్పగించారు. ‘మా అమ్మ ఐదు రోజులపాటు ఆవుకు మేత పెట్టారు. అయితే పాలు పితికేందుకు ప్రయత్నించిన మూడుసార్లూ ఆమెను ఆవు తన్నింది. దీంతో మా అమ్మ నడుం దెబ్బతింది. మా వద్ద ఉన్న గేదెలు చాలు అని సంతృప్తి పడుతూ వెంటనే మేము ఆవును తిరిగి ఇచ్చేశాం’ అని ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి జ్యోతి గులియా తెలిపింది. ఇతర బాక్సర్లు నీతు, సాక్షిలకు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో వారూ ఆవులను తిరిగిచ్చేశారు. -
పోరాడి ఓడిన శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్యంతో సరి సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ బరిలో నిలిచిన ఏకైక భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్యామ్ కుమార్ 1-2తో శాల్కర్ అఖిన్‌బే (కజకిస్థాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో తొలి రౌండ్‌ను చేజార్చుకున్న శ్యామ్ రెండో రౌండ్లో పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో రౌండ్లో మాత్రం అఖిన్‌బే ఆధిపత్యం చలాయించాడు. ఈ ఓటమితో శ్యామ్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ‘శ్యామ్ బాగా పోరాడాడు. అయితే ఓటమి ఓటమే. అతను యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందడం సానుకూలాంశం’ అని భారత కోచ్ రామానంద్ తెలిపారు. భారత బాక్సింగ్ సమాఖ్యపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నిషేధం కారణంగా ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు ‘ఐబా’ పతాకం కింద పోటీపడ్డారు. మొత్తానికి ఈ చాంపియన్‌షిప్ భారత్‌కు నిరాశనే మిగిల్చింది. కేవలం ఒక కాంస్య పతకంతో భారత్ సంతృప్తి పడింది. 2012 ఈవెంట్లో భారత్‌కు రజతం, రెండు కాంస్యాలు వచ్చాయి. 2010లో వికాస్ కృషన్ స్వర్ణం సాధించాడు. -
గౌరవ్‌కు చివరి అవకాశం
యూత్ ఒలింపిక్స్ అర్హత టోర్నీ న్యూఢిల్లీ: యూత్ ఒలింపిక్ క్రీడలకు అర్హత పొందేందుకు భారత యువ బాక్సర్ గౌరవ్ సోలంకికి మరో అవకాశం మిగిలి ఉంది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను యూత్ ఒలింపిక్ క్రీడల అర్హత టోర్నీగా పరిగణిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్లో గౌరవ్ సోలంకి 52 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. సెమీఫైనల్‌కు చేరుకున్న నలుగురు బాక్సర్లు యూత్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతారు. క్వార్టర్స్‌లో ఓడిన మిగతా నలుగురి నుంచి ఇద్దరికి యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. గౌరవ్ సోలంకి మిగిలిన ఒక బెర్త్ కోసం కార్లోస్ సిల్వాతో తలపడతాడు. ఈ బౌట్లో నెగ్గినవారు యూత్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటారు. నేడు శ్యామ్ సెమీఫైనల్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బుధవారం కీలకపోరులో బరిలోకి దిగనున్నాడు. కజకిస్థాన్ బాక్సర్ శాల్కర్ అఖిన్బేతో శ్యామ్ సెమీఫైనల్లో పోటీపడనున్నాడు. ఒకవేళ సెమీస్‌లో శ్యామ్ ఓడితే కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. -
ప్రిక్వార్టర్స్‌లో జమున బోరో
సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ జమున బోరో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల 57 కేజీల విభాగం తొలి రౌండ్లో అసోంకు చెందిన జమున ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో తన ప్రత్యర్థి మొఫాలాలీ (లెసోతో)పై గెలిచింది. బౌట్ ఆరంభమైన రెండు నిమిషాల్లోపే జమున సంధించిన పంచ్‌లకు తాళలేక మొఫాలాలీ రెండుసార్లు రింగ్‌లో పడిపోయింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి జమునను విజేతగా ప్రకటించారు. పురుషుల 60 కేజీల విభాగం తొలి రౌండ్లో సందీప్ కుమార్ (భారత్) 3-0తో అస్మానిస్ (లాత్వియా)ను ఓడించాడు. నిఖత్ నెగ్గలేదు... మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. మంగళవారం జరిగిన ఈ బౌట్లో నిఖత్ 0-3 (37-38, 36-39, 36-39)తో ఇస్తిక్ నెరిమాన్ (టర్కీ) చేతిలో ఓడిపోయింది. -
‘ట్రాక్’ నుంచి ‘రింగ్’లోకి...
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఈ నిజామాబాద్ అమ్మాయి... మళ్లీ చెలరేగి తన గత విజయం గాలివాటం కాదని నిరూపించింది. అమ్మాయిలకు ఆటలేంటి... అందులోనూ ముస్లిం అమ్మాయికి బాక్సింగ్ ఏమిటి... అంటూ అన్ని వైపుల నుంచి ఎదురైన ప్రతికూలతలపై ‘పంచ్’ విసిరింది. క్రీడాభిమాని అయిన తండ్రి జమీల్ అహ్మద్ ప్రోత్సాహంతో 17 ఏళ్ల నిఖత్ పట్టుదలగా ముందుకు వెళుతోంది. నాలుగు నెలల శిక్షణతో... ఆటలపై ఆసక్తి పెంచుకున్న నిఖత్ ఆరంభంలో అథ్లెటిక్స్ ఆడింది. 2008లో జిల్లా స్థాయిలో అన్ని స్ప్రింట్, రిలే, లాంగ్‌జంప్ పోటీల్లో విజేతగా నిలిచింది. అనంతరం రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం అందుకుంది. అయితే అనంతరం బాక్సింగ్ వైపు ఆమె చూపు మళ్లింది. స్వస్థలం నిజామాబాద్‌లో బాక్సింగ్ శిక్షణ కేంద్రానికి ఒకే ఒక అమ్మాయి వచ్చేది. నిఖత్‌లో చురుకుదనం చూసి ఆమె ఈ ఆటలో ప్రోత్సహించింది. గాయాల భయంతో ముందుగా కుటుంబసభ్యులు వెనుకాడినా తర్వాత ప్రోత్సహించారు. కోచ్ సమ్‌సమ్ అండగా నిలవడంతో శిక్షణ ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా నిలకడగా రాణించి పతకాలు గెల్చుకుంది. ‘ప్రస్తుతం నేను అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ నా ప్రదర్శనను మరింతగా మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో సీనియర్ విభాగంలోనూ రాణిస్తా’ అని నిఖత్ చెప్పింది.