‘ట్రాక్’ నుంచి ‘రింగ్’లోకి...
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఈ నిజామాబాద్ అమ్మాయి... మళ్లీ చెలరేగి తన గత విజయం గాలివాటం కాదని నిరూపించింది. అమ్మాయిలకు ఆటలేంటి... అందులోనూ ముస్లిం అమ్మాయికి బాక్సింగ్ ఏమిటి... అంటూ అన్ని వైపుల నుంచి ఎదురైన ప్రతికూలతలపై ‘పంచ్’ విసిరింది. క్రీడాభిమాని అయిన తండ్రి జమీల్ అహ్మద్ ప్రోత్సాహంతో 17 ఏళ్ల నిఖత్ పట్టుదలగా ముందుకు వెళుతోంది.
నాలుగు నెలల శిక్షణతో...
ఆటలపై ఆసక్తి పెంచుకున్న నిఖత్ ఆరంభంలో అథ్లెటిక్స్ ఆడింది. 2008లో జిల్లా స్థాయిలో అన్ని స్ప్రింట్, రిలే, లాంగ్‌జంప్ పోటీల్లో విజేతగా నిలిచింది. అనంతరం రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం అందుకుంది. అయితే అనంతరం బాక్సింగ్ వైపు ఆమె చూపు మళ్లింది. స్వస్థలం నిజామాబాద్‌లో బాక్సింగ్ శిక్షణ కేంద్రానికి ఒకే ఒక అమ్మాయి వచ్చేది. నిఖత్‌లో చురుకుదనం చూసి ఆమె ఈ ఆటలో ప్రోత్సహించింది.
గాయాల భయంతో ముందుగా కుటుంబసభ్యులు వెనుకాడినా తర్వాత ప్రోత్సహించారు. కోచ్ సమ్‌సమ్ అండగా నిలవడంతో శిక్షణ ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా నిలకడగా రాణించి పతకాలు గెల్చుకుంది. ‘ప్రస్తుతం నేను అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ నా ప్రదర్శనను మరింతగా మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో సీనియర్ విభాగంలోనూ రాణిస్తా’ అని నిఖత్ చెప్పింది.