టోక్యో: శరీరానికి ఒకట్రెండు కుట్లు పడితేనే విలవిల్లాడుతాం. విశ్రాంతికే పరిమితమవుతాం. ఏకంగా 13 కుట్లు పడితే ఎవరైనా బాక్సింగ్ చేస్తారా! కచ్చితంగా చేయరు. కానీ భారత బాక్సర్ సతీశ్ బాక్సింగ్ బరిలో దిగాడు. ప్రత్యర్థి పంచ్‌లకు తన ముఖానికి పడిన కుట్లు ఎంతగా బాధిస్తున్నా ఆఖరి దాకా పోరాడాడు. చివరకు ఫలితం ఓటమి అయినా... ప్రదర్శనతో గెలిచాడు. పురుషుల ప్లస్ 91 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ బఖోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన పోరులో సతీశ్ కుమార్ స్ఫూర్తిదాయక పోరాటం ముగిసింది. రింగ్‌లో ఈ ఆర్మీ బాక్సర్ తన ఆర్మీ నైజాన్ని చాటాడు. యుద్ధభూమిలో బుల్లెట్లు దిగినా ఊపిరి ఉన్నంతవరకు పోరాడే తత్వాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో చూపాడు.
గత ప్రిక్వార్టర్స్ మ్యాచ్ సందర్భంగా అతని కంటిపై భాగానికి (నుదురు), గవదకు గాయాలయ్యాయి. దీంతో ఆ రెండు చోట్ల కుట్లు వేయాల్సి వచ్చింది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో బరిలోకి దిగే సాహసం చేసిన 32 ఏళ్ల సతీశ్ 0–5తో బఖోదిర్ చేతిలో ఓడిపోయాడు. గాయపడిన విషయం తెలియగానే సతీశ్ భార్య, తండ్రి ప్రిక్వార్టర్స్ విజయం దగ్గరే ఆగిపోమన్నారు. క్వార్టర్స్ బరిలో దిగొద్దని పదేపదే వారించారు. అయినాసరే ఇవేవి లెక్కచేయకుండా దేశం కోసం అతను ప్రాతినిధ్యం వహించిన తీరు అసమాన్యం. అందుకే టోక్యోలో ఉన్న కోచ్‌లు సహా భారత్‌లో ఉన్న బాక్సింగ్ సమాఖ్య చీఫ్ అజయ్ సింగ్ అతని పోరాటాన్ని ఆకాశానికెత్తారు.
కాగా... పతకాల ఆశలెన్నో పెట్టుకున్న బాక్సింగ్‌లో భారత్‌కు ఒకే ఒక్క పతకం ఖాయమైంది. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) సెమీస్ చేరింది. మిగిలిన వారంతా సతీశ్ కంటే ముందే ఇంటిదారి పట్టేశారు. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ చౌదరి (75 కేజీలు), మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు) ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment