
జామ్‌నగర్ రాజకుటుంబం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తమ కుటుంబం తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ అజేయ్ జడేజాను ఎంపికచేసింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ.. అజయ్ జడేజాను అధికారికంగా తన వారసుడిగా ప్రకటించారు.
"పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజైనా దసరా పర్వదినం సందర్భంగా, అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాము. నా వారసుడిగా అతడు సింహాసనాన్ని అధిష్టించనున్నాడు.
ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. థంక్యూ ఆజేయ్" అని ఓ ప్రకటనలో శత్రుసల్యాసిన్హ్జీ పేర్కొన్నారు. కాగా అజయ్ జడేజా వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన జామ్‌నగర్ రాజకుటుంబానికి భారత క్రికెట్‌లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీవాళీ క్రికెట్‌లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన K.S.రంజిత్‌సింహ్‌జీ K.S. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టారు.
ఇక జడేజా క్రికెట్‌లో కూడా తన పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాడు. 1990లో భారత క్రికెట్ చూసిన గొప్ప క్రికెటర్లలో జడేజా ఒకడు. 1992 నుంచి 2000 వరకు 15 టెస్టులు, 196 వన్డేల్లో భారత జట్టుకు అజేయ్ ప్రాతినిథ్యం వహించాడు.
ముఖ్యంగా 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్ సగటు క్రికెట్ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది. జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చినవే కావడం గమనార్హం.
చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప