జావెలిన్ త్రోలో పతక పోరుకు నీరజ్ చోప్రా
తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు దూసుకెళ్లిన నీరజ్ జావెలిన్
క్వాలిఫయింగ్‌లో ‘టాప్’లో నిలిచిన భారత స్టార్
12 మంది మధ్య రేపు ఫైనల్
అనూహ్యమేమీ కాదు...అలవాటు లేనిదేమీ కాదు... అడుగు పెడితే చాలు జావెలిన్‌తో అద్భుతంగా ఆడుకునే భారత స్టార్ నీరజ్ చోప్రా ఒలింపిక్ వేదికపై మళ్లీ తన బంగారు వేటను మొదలు పెట్టాడు. అసలు పోరుకు ముందు అర్హత సమరంలో తనదైన శైలిలో అదరగొట్టాడు. క్వాలిఫయింగ్ పోరులో ఒకే ఒక్క త్రో విసిరి అలా అలవోకగా ముందంజ వేశాడు... మరో మాటకు తావు లేకుండా అగ్ర స్థానంతో దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టి ఒక లాంఛనం ముగించాడు...
ఎక్కడా తడబాటు లేదు, కాస్త ఉత్కంఠ పెంచినట్లుగా కూడా కనిపించలేదు. రోజూ చేసే పని ఇదేగా అన్నట్లుగా క్షణాల వ్యవధిలో త్రో పూర్తి చేసి వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు... ఇదే తరహా ప్రదర్శనను రేపు జరిగే ఫైనల్లోనూ చూపిస్తే మన బంగారు బాలుడి ఒడిలో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో మరో పసిడి పతకం పరుగెత్తుకుంటూ వచ్చి వాలడం ఖాయం!
పారిస్: కోట్లాది భారత అభిమానుల పసిడి ఆశలను మోస్తూ బరిలోకి దిగిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన నీరజ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించే లక్ష్యంతో మైదానంలోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్ గ్రూప్ ‘బి’లో నీరజ్ తన జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి క్వాలిఫై అయ్యాడు. ఫైనల్ చేరేందుకు అర్హత మార్కు 84 మీటర్లు కాగా... తన తొలి ప్రయత్నంలోనే అంతకంటే ఎక్కువ దూరం బల్లెం విసరడంతో నీరజ్‌కు మళ్లీ త్రో చేయాల్సిన అవసరమే రాలేదు. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ రెండూ కలిపి నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన. వ్యక్తిగతంగా కూడా ఈ దూరం నీరజ్ కెరీర్‌లో రెండో స్థానంలో నిలుస్తుంది.
2022లో అతను జావెలిన్‌ను 89.94 మీటర్లు విసిరాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్‌తో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైన అండర్సన్ పీటర్స్ (గ్రెనడా), జూలియన్ వెబర్ (జర్మనీ) జావెలిన్‌ను 88.63 మీటర్లు , 87.76 మీటర్లు వరుసగా రెండు, మూడు స్థానాలతో ముందంజ వేశారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (86.59 మీటర్లు) కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 84 మీటర్లు విసిరిన లేదా రెండు గ్రూప్‌లలో కలిపి 12 మంది అత్యుత్తమ స్కోరర్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
క్వాలిఫయింగ్‌లో 9 మంది 84 మీటర్ల మార్క్‌ను అందుకొని ముందంజ వేయగా, మరో ముగ్గురికి మాత్రం టాప్–12లో రావడంతో అవకాశం లభించింది. పోటీలో నిలిచిన మరో భారత జావెలిన్ త్రోయర్ కిషోర్ జెనా తీవ్రంగా నిరాశపరిచాడు. జావెలిన్‌ను 80.73 మీటర్లు మాత్రమే విసిరిన అతను గ్రూప్ ‘ఎ’లో తొమ్మిదో స్థానానికే పరిమితం కావడంతో ఫైనల్ అవకాశం చేజారింది.
గత ఏడాది ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కిషోర్... అసలు సమయంలో కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ నిరాశపర్చింది. ఈ ఈవెంట్‌లో ఆమె సెమీఫైనల్ చేరడంలో విఫలమైంది. ఆరుగురు పాల్గొన్న రెపిచాజ్ హీట్–1లో మొదటి స్థానంలో నిలిస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉండగా... 52.59 సెకన్లలో పరుగు పూర్తి చేసిన కిరణ్ ఆరో స్థానంతో ముగించింది.
ఎప్పుడైనా తొలి ప్రయత్నమే మెరుగ్గా ఉండాలని భావిస్తా. ప్రతీసారి అది సాధ్యం కాకపోవచ్చు. అలా జరిగింది కూడా. నేను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే క్వాలిఫయింగ్‌కంటే ఫైనల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సన్నద్ధత కూడా చాలా బాగుండాలి. నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఫైనల్ సాయంత్రం జరుగుతుంది కాబట్టి వాతావరణం కాస్త చల్లగా ఉండవచ్చు. అయితే దానికి అనుగుణంగానే సిద్ధమవుతా. ఫైనల్ చేరిన వారంతా బలమైన ప్రత్యర్థులే కాబట్టి ఎవరితోనూ ప్రత్యేకంగా పోటీ ఉండదు. –నీరజ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment