Ravi Kumar Dahiya
-
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లక్ష్యంగా రవి దహియా సన్నాహాలు
వచ్చే నెలలో జరిగే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం భారత స్టార్ రెజ్లర్ రవి దహియా (57 కేజీలు) రష్యాకు బయలుదేరి వెళ్లాడు. రష్యాలో 29 రోజులపాటు సాగే రవి శిక్షణ శిబిరం ఖర్చులన్నీ కేంద్ర క్రీడా శాఖ భరించనుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో రవి స్వర్ణం సాధించాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ ఢిల్లీ రెజ్లర్ విశ్వ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. -
రవి దహియా కొత్త చరిత్ర
ఉలాన్బాటర్ (మంగోలియా): భారత రెజ్లర్ రవి కుమార్ దహియా కొత్త చరిత్ర లిఖించాడు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో 24 ఏళ్ల రవి దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన తొలి భారతీయ రెజ్లర్‌గానూ ఘనత వహించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు. శనివారం ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓవరాల్‌గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు), గౌరవ్ బలియాన్ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలిచారు. -
రవి దహియాకు అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ రెజ్లర్ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు జరిగే క్వీన్స్ బ్యాటన్ రిలేను బుధవారం భారత్‌లో రవి ప్రారంభించాడు. తనకిది అరుదైన గౌరవమని, బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం గెలిచేందుకు తీవ్రంగా చెమటోడ్చుతున్నట్లు రవి చెప్పాడు. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
భారత్‌లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా.. అందుకే ఇలా!
న్యూఢిల్లీ: కరోనా కాలంలో విదేశీ కోచ్‌ల వెంట పడకుండా... 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు భారతీయ కోచ్‌ల ఆధ్వర్యంలో తమ ప్రదర్శ నకు మెరుగులు దిద్దుకోవాలని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, రవి దహియా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో రవి రజతం... బజరంగ్ కాంస్యం సాధించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య వీరిద్దరి కోసం భారత్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ కోచ్‌లను నియమించే పనిలో ఉంది. ‘విదేశీ కోచ్‌లు వారి దేశంలోనే 80 శాతం కోచింగ్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు కానీ భారత్‌లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందువల్లే స్వదేశీ కోచ్‌పై దృష్టి పెట్టాను’ అని ఉన్న బజరంగ్ అన్నాడు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
Tokyo Olympics: ఏడు పతకాల కథ
ఎవరేమనుకున్నా... మధ్యలో మహమ్మారి దూరినా... కేంద్ర క్రీడా శాఖ ముందు నుంచీ ఒకే మాట చెప్పింది. ఈసారి మనం 2012 లండన్ గేమ్స్ ఆరు పతకాల సంఖ్యను దాటేస్తాం... డబుల్ డిజిట్ (పది పతకాలైనా) కూడా సాధిస్తాం! మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఎక్కడికెళ్లినా ఇదేమాట అన్నారు. ఆయన అన్నట్లే ‘టోక్యో డ్రీమ్స్’ సగం నెరవేరాయి. ఏడు పతకాలతో భారత్ ‘లండన్’ను దాటేసింది. పతకాల పరంగా పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. షూటర్ల గురి కుదిరి ఉంటే... బాక్సర్ల ‘పంచ్’ కూడా అదిరిపోయుంటే... గోల్ఫ్‌లో కాస్త అదృష్టం కలిసొచ్చి ఉంటే... రెజ్లింగ్‌లో దీపక్ పూనియా, వినేశ్ తడబడకపోతే... ఆర్చరీలో బాణం మెరిసుంటే... ఆయన అన్నట్లే పతకాల ‘సంఖ్య’ రెండంకెలు కచ్చితంగా దాటేది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత హాకీ అదిరిపోయిందనుకుంటే... అంతకుమించిపోయే అబ్బుర ఫలితం అథ్లెటిక్స్‌లో వచ్చింది. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ స్ఫూర్తితో 2024 పారిస్‌లో మనం మరింత పైకి ఎదగాలని... స్వర్ణ కాంతులు మరిన్ని విరజిమ్మాలని కోరుకుందాం. ‘రియో’ గాయాన్ని ‘టోక్యో’ మాపింది. ఏడు పతకాలతో క్రీడాభారతిని ఆనందడోలికల్లో ముంచేసింది. పతకాలు సాధించిన వారు ముమ్మాటికి విజేయులే! అలాగే పతకాల్ని త్రుటిలో కోల్పోయిన పోరాట యోధులు కూడా ఇక్కడ విజేతలే! ఎందుకంటే ఇక్కడ ఫలితమే తేడా. కానీ పోరాటంలో విజేతకి పరాజితకి తేడా లేదంటే అతిశయోక్తి కాదు. మహిళల హాకీ జట్టు కాంస్యానికి దూరమైనా ప్రదర్శనతో మన గుండెల్లో నిలిచింది. రెజ్లర్ దీపక్ పూనియా, గోల్ఫర్ అదితి పతకాలకు చేరువై చివరకు దూరమయ్యారు. మొత్తానికి టోక్యోలో మన క్రీడాకారుల శ్రమకు మంచి ఫలితాలే వచ్చాయి. మీరా రజత ధీర... ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను శుభారంభమే నీరజ్ బంగారానికి నాంది అయ్యిందేమో! ఆరంభ వేడుకలు ముగిసి పోటీలు మొదలైన తొలి రోజే ఆమె రజతంతో బోణీ కొట్టింది. ‘లండన్’ దాటేందుకు ఈ వెయిట్‌లిఫ్టరే జేగంట మోగించింది. 26 ఏళ్ల చాను పోయిన చోటే వెతుక్కోవాలనుకుంది. ‘రియో’ ఒలింపిక్స్ చేదు అనుభవాన్ని టోక్యో ఒలింపిక్స్ రజతంతో చెరిపేసింది. 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. సింధు పతకాల విందు... ‘రియో’లో భారత ఆశల పల్లకిని ఫైనల్‌దాకా మోసిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు. బ్యాడ్మింటన్‌లో రన్నరప్ అయిన సింధు పతకం రంగుమార్చాలని, స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తనకెదురైన జపాన్ స్టార్ అకానె యామగుచిని క్వార్టర్స్‌లో మట్టికరిపించిన తెలుగు తేజం దురదృష్టవశాత్తు సెమీస్‌లో తడబడింది. వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్‌కు తలవంచిన 26 ఏళ్ల సింధు కాంస్య పతక పోరులో మాత్రం పట్టువీడని పోరాటం చేసింది. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. నీరజ్ ‘మిషన్ పాజిబుల్’... భారత్ ‘టోక్యో డ్రీమ్స్’లో అథ్లెటిక్స్ పతకం ఉంది. కానీ పసిడి మాత్రం లేదు. నీరజ్ చోప్రా ఆ టోక్యో డ్రీమ్స్ ఊహకే అందని విధంగా జావెలిన్ విసిరేశాడు. 23 ఏళ్ల ఈ ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. హరియాణా రైతు బిడ్డ ఇప్పుడు భరతమాత ముద్దుబిడ్డ అయ్యాడు. రెజ్లింగ్‌లో హరియాణా బాహుబలి రవి దహియా. తన శారీరక సామర్థ్యానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించిన రవి మల్లయుద్ధంలో మహాబలుడు. ఛత్రశాల్ స్టేడియం చెక్కిన మరో చాంపియన్ రెజ్లర్. పసిడి వేటలో కాకలు తిరిగిన సింహబలుడితో చివరకు పోరాడి ఓడాడు. 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. పురుషుల హాకీ కంచు... మన తాత, తండ్రులకు తెలిసిన ఒలింపిక్స్ హకీ ఘన చరిత్రను మనకూ తెలియజేసిన ఘనత కచ్చితంగా మన్‌ప్రీత్‌సింగ్ సేనదే. విశ్వక్రీడల్లో నాలుగు దశాబ్దాల నిరాశకు టోక్యోలో చుక్కెదురైంది. పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం ఎదురైనా... పతకం ఆశ మిగిలుండటంతో ప్లేఆఫ్‌లో జర్మనీపై సర్వశక్తులు ఒడ్డి గెలిచిన తీరు అసాధారణం. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. లవ్లీనా పంచ్... పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్. భారత తురుపుముక్క, దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. ఒలింపిక్స్‌కు ఆఖరి కసరత్తుగా యూరోప్ వెళ్లేందుకు సిద్ధమైన 23 ఏళ్ల లవ్లీనాను కోవిడ్ అడ్డుకుంది. కానీ ఆమె టోక్యోలో పతకం గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. బజరంగ్ పట్టు... ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. గంపెడాశలు పెట్టుకున్న షూటర్లతో పోల్చితే బజరంగ్ ముమ్మాటికి నయం. బాల్యం నుంచే కుస్తీ పట్లు పట్టిన ఈ హరియాణా రెజ్లర్ టోక్యో వేదికపై కంచు పట్టు పట్టాడు. ఇతన్నీ ఛత్రశాల్ స్టేడియమే చాంపియన్ రెజ్లర్‌గా తీర్చిదిద్దింది. అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు నెగ్గిన ఇతని ఖాతాలో తాజాగా ఒలింపిక్ పతకం కూడా భర్తీ అయ్యింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆదివారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ‘ఎన్నో రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో సాధించిన పతకంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది’ అని మీరాబాయి ట్వీట్ చేసింది. -
టోక్యోలో మెరిసిన భారత్.. ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పతకాలు
సాక్షి, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరిసి మురిసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రాణించి యావత్ భారతావనిని ఆకర్షించింది. ఆరంభంలోనే రజతం సాధించి సత్తాచాటిన భారత్.. ముగింపులో స్వర్ణాన్ని సాధించి శభాష్ అనిపించింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు దక్కించుకున్న భారత్ ఏడు పతకాలను ఖాతాలో వేసుకుంది. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది. ఓవరాల్‌గా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఏ విభాగాల్లో పతకాలు సాధించిదనేది ఒకసారి పరిశీలిద్దాం.. నీరజ్ చోప్రా- స్వర్ణం(జావెలిన్ త్రో) భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. మీరాబాయి చాను- రజతం(వెయిట్ లిఫ్టింగ్) ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే రజతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది మీరాబాయి చాను. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది. రవికుమార్ దహియా- రజతం( రెజ్లింగ్) ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రవికుమార్ దహియా అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ అర్హత, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో దుమ్మురేపి ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఫైనల్లో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 7-4 తేడాతో ఓడిపోయాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పీవీ సింధు- కాంస్యం( బాడ్మింటన్) రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన పీవీ సింధుపై ఈ ఒలింపిక్స్‌లో మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలు నిజం చేస్తూ లీగ్, ప్రీ క్వార్టర్స్, క్వార్టర్స్‌లో దుమ్మురేపిన ఆమె ఒక్క గేమ్ కోల్పోకుండా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్చేతిలో పరాజయం పాలైన సింధు.. కాంస్య పతక పోరులో సత్తాచాటింది. సింధు 21–13, 21–15తో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోను చిత్తు చేసి కాంస్యం గెలిచింది. ఫలితంగా రెండు ఒలింపిక్ పతకాలతో భారత క్రీడా చరిత్రలో ఎవరినీ అందనంత ఎత్తులో నిలిచింది. భారత మెన్స్ హాకీ టీమ్- కాంస్యం టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో ఒక్క ఆస్ట్రేలియా మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించింది. అయితే సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తో విజయం సాధించి ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకం సాధించి హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చింది. లవ్లీనా బొర్గోహెయిన్- కాంస్యం( బాక్సింగ్) బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో లవ్లీనా.. టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గత నెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్ సింగ్(2008), మేరీ కోమ్(2012) తర్వాత పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. భజరంగ్ పూనియా- కాంస్యం(రెజ్లింగ్) ఇక భజరంగ్ పూనియా టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించాడు. ► వీరు మాత్రమే గాక ఈసారి ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు, గోల్ప్‌లో అదితి అశోక్, రెజ్లింగ్‌లో దీపక్ పూనియాలు కూడా మంచి ప్రదర్శన చేశారు. ముందుగా భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన గురించి చెప్పుకోవాలి. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకున్న భారత మహిళల జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. అయితే కాంస్య పతక పోరు కోసం భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. కాగా ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం వారిని పొగడ్తలతో ముంచెత్తింది. ► ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకంగా నిలిచిపోయింది. -
రవి దహియా గ్రామంలో సంబరాలు.. ఆనంద్ మహీంద్ర స్పందన ఇలా
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా రజతం గెలుచుకున్నాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్ర రవి దహియా గ్రామ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. మిమ్మల్ని చూసి నేను ఎంతో గర్విస్తున్నాను అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా తెలిపారు ఆనంద్ మహీంద్ర. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్ర తన ట్విటర్లో రవి దహియా పతకం సాధించడంతో అతడి గ్రామస్తులు ఎంత సంబరపడుతున్నారో వివరించారు. తమ ఊరి వ్యక్తి ఒలిపింక్స్‌లో పతకం సాధించడంతో వారు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు తప్ప.. స్వర్ణం సాధించలేదని బాధపడటం లేదన్నారు. ఇక తమ గ్రామస్తుడికి ఘన స్వాగతం తెలిపేందుకు వారు ఉవ్విళ్లురుతున్నారని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ క్రమంలో రవి దహియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. దీనిలో సదరు వ్యక్తి ‘‘మేం మ్యాచ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. రవి దహియా స్వర్ణం సాధించలేకపోయాడు..పర్లేదు. అతను సాధించిన రజతమే మాకు బంగారం కన్నా ఎక్కువ. ఎందుకుంటే ఎలాంటి సౌకర్యాలు లేకుండానే అతడు రజతం గెలిచాడు. అందుకు మేం చాలా గర్వపడుతున్నాం. తనకి ఘన స్వాగతం పలికేందుకు మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’’ అన్నాడు. Chinese athletes securing ‘only’ silver/bronze are being trolled by their fellow citizens. We may be lightweights in terms of medal performance but I’m so proud we’re true to the real Olympic spirit where ‘taking part’ is more important. I applaud the residents of Ravi’s village https://t.co/lXyFHQBS9l — anand mahindra (@anandmahindra) August 5, 2021 ఈ వీడియోని ఆనంద మహీంద్ర తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘‘రజతం, కాంస్యం మాత్రమే గెలుస్తున్నందుకు చైనీస్ అథ్లెట్స్‌ని ఆ దేశస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో నా దేశ వాసుల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. పతక ప్రదర్శనలో మనం అంత బలంగా లేము. ఒప్పుకుంటాను. కానీ ఒలింపిక్స్ లాంటి వేదికలో భాగం కావడమే మనం ఎంతో గొప్పగా భావిస్తున్నాం. నా దేశ ప్రజల్లోని ఈ నిజమైన ఒలింపిక్ స్ఫూర్తికి నేను ఎంతో గర్వపడుతున్నాను. రవి దహియా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.. వారిని అభినందిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. -
రెజ్లర్ రవి దహియాకు భారీ నజరానా.. క్లాస్ 1 కేటగిరీ ఉద్యోగం..!
చండిగఢ్: టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఒలింసిక్స్‌లో రజతం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన రవి దహియాకు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే క్లాస్-1 కేటగిరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. రవి దహియా అడిగిన చోట 50శాతం రాయితీతో ఓ ఫ్లాట్ స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దహియా పుట్టి పెరిగిన తన స్వగ్రామం నహ్రిలో.. రెజ్లింగ్ కోసం ప్రత్యేకంగా ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించింది. కాగా ఫైనల్లో రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన దహియా 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దహియా పతకంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది. ఇక సుశీల్ కుమార్ 2012 లండన్ గేమ్స్‌లో రజతం గెలుచుకోగా.. అక్కడ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. ఇక 2008 బీజింగ్ గేమ్స్‌లో సుశీల్ కాంస్యం గెలుచుకున్నారు. అంతేకాకుండా జాదవ్ 1952 హెల్సింకి గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. -
అరంగేట్రంలోనే అదరగొట్టావ్ రవి దహియా: సీఎం జగన్
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. కంగ్రాట్స్ రవి దహియా: సీఎం జగన్ టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రజతం సాధించిన రవి దహియాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజతం అందించిన నీకు శుభాకాంక్షలు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టే ప్రదర్శన చేశావు. '' అంటూ ట్వీట్ చేశారు. Congratulations to wrestler #RaviDahiya, for adding second Silver medal to India's tally at #Tokyo2020. India is proud of this young champ who made his mark in his debut #Olympics . Ravi has been brilliant throughout his Olympic journey for #TeamIndia . — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 ఓడిపోయినా మనసులు గెలుచుకున్నావు: మోదీ '' రవి కుమార్ దహియా ఒక గొప్ప రెజ్లర్.. ఫైనల్లో అతని పోరాట పటిమ నన్ను ఆకట్టుకుంది. అతని పోరాట స్పూర్తి.. మ్యాచ్ గెలవాలనే దృడత్వం అమోఘం. కానీ మ్యాచ్‌లో విజేత ఒకరే అవుతారు. దహియా.. నువ్వు ఈరోజు మ్యాచ్ ఓడిపోయుండొచ్చు.. కానీ మా మనసులు గెలుచుకున్నావ్.. రజతం సాధించిన నీకు శుభాకాంక్షలు.. నీ ప్రదర్శనతో దేశ గౌరవాన్ని మరింత పెంచావు'' అంటూ ట్వీట్ చేశారు. Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments. — Narendra Modi (@narendramodi) August 5, 2021 ''టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించావు.. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తుంది'' - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ India is proud of Ravi Dahiya for winning the wrestling Silver at #Tokyo2020. You came back into bouts from very difficult situations and won them. Like a true champion, you demonstrated your inner strength too. Congratulations for the exemplary wins & bringing glory to India. — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ''గ్రేట్ గోయింగ్.. రవి కుమార్ దహియా.. రజతం సాధించిన నీకు ఇవే నా శుభాకాంక్షలు.. మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తేవాలని కోరుకుంటున్నా''- రాహుల్ గాంధీ -
ఫైనల్లో ఓడినా.. చరిత్ర లిఖించాడు
-
ఫైనల్లో ఓడినా.. చరిత్ర లిఖించాడు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్నాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా రవి కుమార్ నిలిచాడు. కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం) తర్వాత రవి దహియా టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. గతంలో 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో సిల్వర్ సాధించిన విషయం తెలిసిందే. టక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రవికుమార్ దహియాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ రవికుమార్ బుధవారం జరిగిన అర్హత, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో దుమ్మురేపాడు. దాదాపు అన్ని ఏకపక్ష విజయాలు సాధించిన రవికుమార్ సెమీస్‌లో కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ సనయేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు వెనుకబడినా చివరి నిమిషంలో అద్బుతంగా నిలదొక్కుకొని విక్టరీ బై ఫాల్ కింద గెలపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు. -
ఓడిపోతున్నానని రవి దహియా చేయి కొరికేసిన కజకిస్తాన్ రెజ్లర్
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వర్ణం సాధించేందుకు రవికుమార్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. గురువారం సాయంత్రం రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో రవికుమార్ తలపడనున్నాడు. ఈ విషయం పక్కనపెడితే.. బుధవారం కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి దశలో సనయేవ్ ఓడిపోతున్నా అనే బాధలో రవికుమార్ చేతిని కొరకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. '' ఇదేం పద్దతి.. ఎంత ఓడిపోతున్నాననే బాధలో ఉంటే ప్రత్యర్థి చేయి కొరకడం సమంజసం కాదు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఒక ఆటగాడిని గౌరవించే పద్దతి ఇదేనా అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి భాగం ముగిశాక రవికుమార్ 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. How unfair is this , couldn’t hit our #RaviDahiya ‘s spirit, so bit his hand. Disgraceful Kazakh looser Nurislam Sanayev. Ghazab Ravi , bahut seena chaunda kiya aapne #Wrestling pic.twitter.com/KAVn1Akj7F — Virender Sehwag (@virendersehwag) August 4, 2021 -
Tokyo Olympics: దహియా ధమాకా...
భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో 23 ఏళ్ల రవి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖరారు చేశాడు. పతకం రంగు స్వర్ణమా, రజతమా అనేది నేడు తేలుతుంది. భారత్‌కే చెందిన మరో యువ రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మలిక్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ఆమెను ఓడించిన బెలారస్ ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో రెపిచేజ్ పద్ధతి ప్రకారం అన్షుకు కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం లభించింది. టోక్యో: గత రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో తాను సాధిస్తున్న పతకాలు గాలివాటంగా రాలేదని భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా నిరూపించాడు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా... ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి... మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో స్వర్ణ–రజత ఫైనల్ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ 66 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించాడు. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జవూర్ ఉగుయెవ్తో నేడు జరిగే ఫైనల్లో రవి దహియా గెలిస్తే... షూటర్ అభినవ్ బింద్రా (2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. వెనుకబడినా... నూరిస్లామ్ సనయేవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో రవి అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరాడు. తొలి భాగం ముగిశాక రవి 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని సనయేవ్ నాలుగుసార్లు మ్యాట్‌పై అటుఇటు తిప్పేయడంతో అతనికి 2, 2, 2, 2 పాయింట్ల చొప్పున మొత్తం ఎనిమిది పాయింట్లు వచ్చాయి. సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. స్పష్టమైన ఆధిపత్యం... నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రవి తొలి రౌండ్లో 13–2 పాయింట్ల తేడాతో ఎడువార్డో ఆస్కార్ టిగ్రెరోస్ (కొలంబియా)పై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజయం సాధించాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం దక్కిన వెంటనే బౌట్‌ను నిలిపివేసి ఆ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనిని ‘టెక్నికల్ సుపీరియారిటీ’ విజయంగా పరిగణిస్తారు. ఎడువార్డోతో జరిగిన బౌట్లో రవి మూడు నిమిషాల నిడివి గల తొలి భాగంలో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలో రవి ఒక్కసారిగా విజృంభించి ‘టేక్‌డౌన్’ ఎత్తులతో వరుసగా 2, 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో రవి 13–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించినందుకు రవిని విజేతగా ప్రకటించారు. అదే దూకుడు... తొలి రౌండ్లో గెలుపు తర్వాత క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ జియార్జి వలెంటినో వంజెలోవ్తో తలపడ్డ రవి ఇక్కడా వెనక్కి తగ్గలేదు. మరోసారి తన భుజ బలంతోపాటు బుద్ధి బలం ఉపయోగించి తొలి భాగంలో వరుసగా 2, 2, 2 పాయింట్లు స్కోరు చేసి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలో వంజెలోవ్ 2, 2 పాయింట్లు సాధించినా... రవి తానేం తక్కువ కాదన్నట్లు వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. బౌట్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా 14–4తో ఆధిక్యంలోకి వచ్చాడు. రవి ఆధిక్యం పది పాయింట్లకు చేరడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. చేతిని కొరికినా... ‘బై ఫాల్’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్ రెజ్లర్ సనయేవ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్ రవి చేతిని కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. కాంస్యానికి విజయం దూరంలో దీపక్ ... పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీపక్ తొలి రౌండ్లో 12–1తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అగియోమోర్ (నైజీరియా)ను ఓడించాడు. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దీపక్ 6–3తో లిన్ జుషెన్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. అయితే సెమీఫైనల్లో దీపక్ 0–10తో డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. షబానౌ అలీ (బెలారస్)–నజీమ్ (సాన్మరినో) మధ్య ‘రెపిచేజ్’ బౌట్లో విజేతగా నిలిచిన రెజ్లర్‌తో నేడు జరిగే కాంస్య పతక పోరులో దీపక్ తలపడతాడు. అన్షుకు పతకావకాశం... మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యూరోపియన్ చాంపియన్ ఇరీనా కురాచ్‌కినా (బెలారస్)తో జరిగిన బౌట్లో అన్షు 2–8తో ఓడిపోయింది. అయితే కురాచ్‌కినా ఫైనల్‌కు చేరడంతో ‘రెపిచేజ్’ పద్ధతిలో అన్షుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. ఫైనల్ చేరే క్రమంలో కురాచ్‌కినా చేతిలో ఓడిన వారి మధ్య బౌట్లను నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారు కురాచ్‌కినా చేతిలో సెమీఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో కాంస్యం కోసం తలపడతారు. నేడు జరిగే ‘రెపిచేజ్’ తొలి రౌండ్లో కొబ్లోవా (రష్యా)తో అన్షు ఆడుతుంది. ఇందులో గెలిస్తే నికొలోవా (బల్గేరియా)తో అన్షు కాంస్యం కోసం తలపడుతుంది. గతంలో సనయేవ్‌ను రెండుసార్లు ఓడించాను. దాంతో భారీ ఆధిక్యంతో వెనుకబడినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నా. సనయేవ్కు నేను ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సింది కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు. నేను స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. స్వర్ణం గెలిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది. –రవి దహియా -
10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు అడుగులు
ఢిల్లీ: రవికుమార్ దహియా.. చరిత్ర సృష్టించడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లడానికి ముందు రవికుమార్‌పై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ బుధవారం జరిగిన రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో చరిత్ర సృష్టించాడు. ఉదయం జరిగిన అర్హత బౌట్ మ్యాచ్‌లో మంచి ఆధిపత్యం ప్రదర్శించిన రవికుమార్ క్వార్టర్స్‌లోనూ అదే జోరు కనబరిచాడు. అనంతరం సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై విక్టరీ బైఫాల్ కింద గెలుపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు. రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన రెండో ఆటగాడిగా రవికుమార్ నిలిచాడు. ఈ సందర్భంగా రవికుమార్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన తీరు ఒకసారి పరిశీలిద్దాం. రవికుమార్ దహియా సొంతూరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి. హర్యానా గడ్డపై పుట్టినవాళ్లకు స్వతహాగా రెజ్లింగ్‌పై ఇష్టం ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసర లేదు. రవికుమార్ కూడా 10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు అడుగులు వేశాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సుశీల్‌కుమార్ కోచ్ సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే రవికుమార్ గొప్ప కుటుంబం నుంచి వచ్చాడనుకుంటే పొరపాటే. రవికుమార తండ్రి రాకేష్ దహియా ఒక సాధారణ రైతు. కనీసం సొంత భూమి కూడా లేకపోవడంతో కౌలు రైతుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నిజానికి రవి దహియా రెజ్లింగ్‌లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా అతడే పట్టుపట్టి రెజ్లింగ్ నేర్చుకున్నాడు అయినా తన కొడుకు కోరికను కాదనలేక అతనికి రెజ్లింగ్ నేర్పించాడు. ప్రతి రోజూ రవికి పాలు, పండ్లు ఇవ్వడానికి రాకేశ్ దహియా 40 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఇలా ఒకటీ రెండూ కాదు పదేళ్ల పాటు చేయడం విశేషం. తన కొడుకు ఇప్పుడీ స్థాయికి చేరినా.. రాకేశ్ దహియా మాత్రం ఇప్పటి వరకూ రవికుమార్ రెజ్లింగ్‌ను చూడకపోవడం విశేషం. రవికుమార్ ఘనతలు: ► 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా రవికుమార్ దహియా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ► 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ ► 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం ► 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి తన రాకను బలంగా చాటాడు. ► 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి సీనియర్ స్థాయిలో మెడల్ గెలిచాడు. అప్పటి నుంచీ 57 కేజీల కేటగిరీలో నిలకడగా రాణిస్తున్నాడు. -
Tokyo Olympics 2020: రెజ్లింగ్ ఫైనల్ చేరిన రవికుమార్
-
రవి దహియా కొత్త చరిత్ర.. సుశీల్ కుమార్ తర్వాత అతనే
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా చరిత్ర సృష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై రవికుమార్ విక్టరీ బైఫాల్ కింద గెలుపొందాడు. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్ నిలవనున్నాడు. ఇంతకముందు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు. అయితే యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్ కుమార్ మాత్రం ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్ దహియా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా నిలవనున్నాడు. కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం) నలుగురు ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్ అతన్ని రింగ్ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్ కింది విజేతగా ప్రకటించాడు. రవికుమార్ ఫైనల్ చేరడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.