న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా రజతం గెలుచుకున్నాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ విభాగంలో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన రవికుమార్ 7-4 తేడాతో ఓడి రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్ర రవి దహియా గ్రామ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. మిమ్మల్ని చూసి నేను ఎంతో గర్విస్తున్నాను అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా తెలిపారు ఆనంద్ మహీంద్ర.
ఈ క్రమంలో ఆనంద్ మహీంద్ర తన ట్విటర్‌లో రవి దహియా పతకం సాధించడంతో అతడి గ్రామస్తులు ఎంత సంబరపడుతున్నారో వివరించారు. తమ ఊరి వ్యక్తి ఒలిపింక్స్‌లో పతకం సాధించడంతో వారు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు తప్ప.. స్వర్ణం సాధించలేదని బాధపడటం లేదన్నారు. ఇక తమ గ్రామస్తుడికి ఘన స్వాగతం తెలిపేందుకు వారు ఉవ్విళ్లురుతున్నారని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ క్రమంలో రవి దహియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
దీనిలో సదరు వ్యక్తి ‘‘మేం మ్యాచ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. రవి దహియా స్వర్ణం సాధించలేకపోయాడు..పర్లేదు. అతను సాధించిన రజతమే మాకు బంగారం కన్నా ఎక్కువ. ఎందుకుంటే ఎలాంటి సౌకర్యాలు లేకుండానే అతడు రజతం గెలిచాడు. అందుకు మేం చాలా గర్వపడుతున్నాం. తనకి ఘన స్వాగతం పలికేందుకు మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’’ అన్నాడు.
Chinese athletes securing ‘only’ silver/bronze are being trolled by their fellow citizens. We may be lightweights in terms of medal performance but I’m so proud we’re true to the real Olympic spirit where ‘taking part’ is more important. I applaud the residents of Ravi’s village https://t.co/lXyFHQBS9l
— anand mahindra (@anandmahindra) August 5, 2021
ఈ వీడియోని ఆనంద మహీంద్ర తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘రజతం, కాంస్యం మాత్రమే గెలుస్తున్నందుకు చైనీస్ అథ్లెట్స్‌ని ఆ దేశస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో నా దేశ వాసుల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. పతక ప్రదర్శనలో మనం అంత బలంగా లేము. ఒప్పుకుంటాను. కానీ ఒలింపిక్స్ లాంటి వేదికలో భాగం కావడమే మనం ఎంతో గొప్పగా భావిస్తున్నాం. నా దేశ ప్రజల్లోని ఈ నిజమైన ఒలింపిక్ స్ఫూర్తికి నేను ఎంతో గర్వపడుతున్నాను. రవి దహియా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.. వారిని అభినందిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment