ఢిల్లీ: రవికుమార్ దహియా.. చరిత్ర సృష్టించడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లడానికి ముందు రవికుమార్‌పై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ బుధవారం జరిగిన రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో చరిత్ర సృష్టించాడు. ఉదయం జరిగిన అర్హత బౌట్ మ్యాచ్‌లో మంచి ఆధిపత్యం ప్రదర్శించిన రవికుమార్ క్వార్టర్స్‌లోనూ అదే జోరు కనబరిచాడు. అనంతరం సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై విక్టరీ బైఫాల్ కింద గెలుపొంది ఫైనల్‌కు ప్రవేశించాడు. రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన రెండో ఆటగాడిగా రవికుమార్ నిలిచాడు.
ఈ సందర్భంగా రవికుమార్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన తీరు ఒకసారి పరిశీలిద్దాం. రవికుమార్ దహియా సొంతూరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి. హర్యానా గడ్డపై పుట్టినవాళ్లకు స్వతహాగా రెజ్లింగ్‌పై ఇష్టం ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసర లేదు. రవికుమార్ కూడా 10 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ వైపు అడుగులు వేశాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సుశీల్‌కుమార్ కోచ్ సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే రవికుమార్ గొప్ప కుటుంబం నుంచి వచ్చాడనుకుంటే పొరపాటే.
రవికుమార తండ్రి రాకేష్ దహియా ఒక సాధారణ రైతు. కనీసం సొంత భూమి కూడా లేకపోవడంతో కౌలు రైతుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నిజానికి రవి దహియా రెజ్లింగ్‌లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా అతడే పట్టుపట్టి రెజ్లింగ్ నేర్చుకున్నాడు అయినా తన కొడుకు కోరికను కాదనలేక అతనికి రెజ్లింగ్ నేర్పించాడు. ప్రతి రోజూ రవికి పాలు, పండ్లు ఇవ్వడానికి రాకేశ్ దహియా 40 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఇలా ఒకటీ రెండూ కాదు పదేళ్ల పాటు చేయడం విశేషం. తన కొడుకు ఇప్పుడీ స్థాయికి చేరినా.. రాకేశ్ దహియా మాత్రం ఇప్పటి వరకూ రవికుమార్ రెజ్లింగ్‌ను చూడకపోవడం విశేషం.
రవికుమార్ ఘనతలు:
► 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడం ద్వారా రవికుమార్ దహియా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
► 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్
► 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం
► 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ గెలిచి తన రాకను బలంగా చాటాడు.
► 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి సీనియర్ స్థాయిలో మెడల్ గెలిచాడు. అప్పటి నుంచీ 57 కేజీల కేటగిరీలో నిలకడగా రాణిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment