న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా బ్రిజ్‌భూషణ్‌పై ‘ఎఫ్‌ఐఆర్’ నమోదు చేస్తామని ఇచి్చన హామీని పూర్తి చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ ‘పోక్సో యాక్ట్’ ప్రకారం ఒక ఎఫ్‌ఐఆర్... ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ప్రకారం మరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. రెండింటిపై సత్వర విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై మే 5న మరోసారి విచారిస్తామని, ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న ఒక మైనర్ రెజ్లర్ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని కూడా సుప్రీం సూచించింది. ‘మైనర్ రెజ్లర్‌కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటూ తగినంత భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశిస్తున్నాం.
ఇతర రెజ్లర భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై గోప్యత కూడా పాటించాలి’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా బెంచీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బజరంగ్, వినేశ్, సాక్షి తదితర రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఎఫ్‌ఐఆర్ మాత్రమే కాదు, బ్రిజ్‌భూషణ్ అరెస్ట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని బజరంగ్ స్పష్టం చేశాడు. ‘విజయం దిశగా ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే మా నిరసన ఇకపైనా కొనసాగుతుంది. ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించడంతో పాటు జైలుకు పంపాల్సిందే. లేదంటే విచారణను ప్రభావితం చేస్తాడు’ అని రెజ్లర్ సాక్షి మలిక్ పేర్కొంది.
మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా..? : రెజ్లర్ సాక్షి మాలిక్
‘ఢిల్లీ పోలీసులు మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైంది కాబట్టి నిరసన ముగించమని ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా. బ్రిజ్‌భూషణ్ చట్టంకంటే పెద్దవాడిగా మారిపోయాడు’.
సుప్రీం కోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నా: బ్రిజ్‌భూషణ్ సింగ్
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం నాకూ మంచిదే. విచారణలో వారికి అన్ని విధాలా సహకరిస్తా. విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ప్రశి్నంచలేదు. రెజ్లర్లు మరికొంత సమయం ఆగాల్సింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. ఎవరి పట్లా తప్పుగా వ్యవహరించలేదు. నాకు నాపై నమ్మకముంది.
Comments
Please login to add a commentAdd a comment