
న్యూడిల్లి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఇప్పటికే చార్జి షీటు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు పంపే ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు.
మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రెజ్లర్లు ఉధృత స్థాయిలో నిరసనలు తెలియజేయడంతో ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేసి వెయ్యి పేజీల ఛార్జిషీటును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు సుమారు 100 మంది వాంగ్మూలాలను సేకరించినట్లు వారిలో 15 మంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు.
ఈ సాక్ష్యాలను ఢిల్లీ కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు నేరం రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ళ నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంటుందని అన్నారు.
అసలే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కాస్తంత క్రమశిక్షణతో వ్యవహరించాల్సింది పోయి ఇటీవల ఒక విలేఖరిపైన అనుచితంగా వ్యవహరించడంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. జూలై 18 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా అందుకున్న బ్రిజ్ భూషణ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే మాట్లాడతానని అన్నారు.
ఇది కూడా చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు
Comments
Please login to add a commentAdd a comment