‘‘ఆరోజు మా అమ్మానాన్నలతో ఫోన్‌లో మాట్లాడిస్తానని నాకు మెసేజ్ వచ్చింది. అందుకే ఆయన గదికి వెళ్లాను. అపుడు సింగ్.. నిజంగానే మా పేరెంట్స్‌కు కాల్ చేసి.. వాళ్లతో మాట్లాడించాడు. నా మ్యాచ్ గురించి, మెడల్ గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పాను. అక్కడ ఊహించని ఘటన జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు.
అంతాబాగానే ఉంది.. ప్రమాదమేమీ లేదనిపించింది. అయితే, ఒక్కసారి కాల్ కట్ చేసిన తర్వాత.. అతడి ప్రవర్తన మారిపోయింది. నేను అతడి బెడ్‌మీద కూర్చుని ఉన్నపుడు నన్ను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని వెనక్కి తోసి ఏడ్చేశాను. అతడు చేసే పనులకు బదులివ్వడానికి నేను సిద్ధంగా లేనని గ్రహించి ఒక అడుగు వెనక్కి వేశాడు.
నా భుజాల చుట్టూ చేతులు వేసి.. ‘తండ్రి లాంటి వాడిని’ అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అతడి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. ఏడుస్తూ.. అక్కడి నుంచి బయటకు పరిగెత్తి నా గదికి వెళ్లిపోయాను’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
హోటల్ గదిలో లైంగిక వేధింపులు
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ తనతో ప్రవర్తించిన తీరును.. తన ఆటోబయోగ్రఫీ ‘విట్‌నెస్’లో ప్రస్తావించింది. కజక్‌స్తాన్‌లో 2021 నాటి ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ సందర్భంగా హోటల్ గదిలో బ్రిజ్‌భూషణ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది.
స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడు
అంతేకాదు.. బాల్యంలోనూ తనకు ఇలాంటి ఘటన ఎదురైందని సాక్షి మాలిక్ తన పుస్తకంలో పేర్కొంది. ‘‘చాలా ఏళ్ల క్రితం.. నా చిన్నపుడు కూడా ఇలాగే వేధింపుల బారినపడ్డాను. నా ట్యూషన్ టీచర్ నన్ను వేధిస్తూ ఉండేవాడు. వేళ కాని వేళ ఇంటికి ఫోన్ చేసి స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడు.
అక్కడికి వెళ్లిన కాసేపటి తర్వాత ట్యూషన్ గురించి పక్కనపెట్టి నన్ను తాకాలని చూసేవాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెబితే.. తప్పు నాదే అంటారేమోనన్న భయంతో మా ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. అమ్మకు కూడా చెప్పే ధైర్యం లేకపోయింది. చాలా ఏళ్లు అతడి వేధింపులను మౌనంగానే భరించాను.
కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని
అయితే, అమ్మ విషయం అర్థం చేసుకుంది. నాకు అండగా నిలబడింది. ట్యూషన్ టీచర్, సింగ్ లాంటి వాళ్ల గురించి మర్చిపోయి.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని.. అలాంటి చెత్త మనుషుల గురించి భయపడాల్సిన పనిలేదని.. ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పింది.
ఇలాంటి చేదు అనుభవాల తర్వాత కూడా నా తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు కాబట్టే నేను ఇక్కడిదాకా చేరుకోగలిగాను’’ అని సాక్షి మాలిక్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు రాసుకొచ్చింది. కాగా కొన్నాళ్ల క్రితం.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.
నాటి రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్ సహా వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు ఈ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్నారు.
అయితే, రెజ్లింగ్ సంఘం ఎన్నికల నుంచి బ్రిజ్‌భూషణ్ తప్పుకొన్నా.. అతడి అనుచరుడు సంజయ్ సింగ్‌ను గెలిపించుకున్నాడు. దీంతో ఆవేదన చెందిన సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలికింది. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment