ఫైనల్లో జపాన్ రెజ్లర్‌ను ఓడించిన తర్వాత వినేశ్ విజయ దరహాసం
భారత పట్టుకు మరోసారి ‘పసిడి’ చిక్కింది. ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. తొలి రోజు పురుషుల రెజ్లింగ్‌లో బజరంగ్ పూనియా బంగారు పతకం నెగ్గగా... ఈసారి మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ భారత సత్తా చాటి పసిడి కాంతులు విరజిమ్మింది. ఈ క్రమంలో 23 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు భారత షూటర్ల గురికి రెండు రజత పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్... పురుషుల ట్రాప్ విభాగంలో లక్షయ్ షెరాన్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం, రెండు రజతాలతో కలిపి మూడు పతకాలు చేరాయి. ప్రస్తుతం భారత్ ఐదు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.
జకార్తా: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత ‘పసిడి పట్టు’ పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. యావత్ జాతి గర్వపడేలా చేసింది. ఫైనల్లో వినేశ్ 6–2 పాయింట్ల తేడాతో యుకి ఇరీ (జపాన్)ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు వినేశ్ తొలి రౌండ్‌లో 8–2తో సన్ యానన్ (చైనా)పై... క్వార్టర్ ఫైనల్లో 4 నిమిషాల 37 సెకన్లలో 11–0తో కిమ్ హ్యుంగ్‌జూ (దక్షిణ కొరియా)పై, సెమీఫైనల్లో 75 సెకన్లలో 10–0తో దౌలత్‌బైక్ యక్షిమురతోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సన్ యానన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ మోకాలి గాయంతో అర్ధంతరంగా వైదొలిగింది. ఆరు నెలల విశ్రాంతి తర్వాత కోలుకున్న ఆమె ఈసారి మాత్రం సన్ యానన్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించింది. గతంలో ఆమెతో పోటీపడ్డ మూడుసార్లూ ఓడిన వినేశ్ నాలుగో ప్రయత్నంలో గెలిచింది. జపాన్ రెజ్లర్ యుకి ఇరీతో జరిగిన ఫైనల్లో వినేశ్ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రౌండ్‌లో జపాన్ రెజ్లర్ కోలుకునేందుకు ప్రయత్నించినా వినేశ్ తన పట్టు సడలించకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది.
సాక్షి మలిక్ చేజేతులా...
భారత్‌కే చెందిన సాక్షి మలిక్ (62 కేజీలు), పూజా ధాండ (57 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయారు. ఐసులు టినిబెకోవా (కిర్గిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో సాక్షి 7–9తో ఓడింది. 10 సెకన్ల సమయం ఉందనగా సాక్షి 7–6తో ఆధిక్యంలో ఉంది. అయితే చివరి 10 సెకన్లలో ఆమె రక్షణాత్మకంగా వ్యవహరించడం... టినిబెకోవా దూకుడుగా ఆడి సాక్షి మలిక్‌ను మ్యాట్ బయటకు పంపించి రెండు పాయింట్లు సంపాదించి 8–7తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే రిఫరీ 2 పాయింట్ల నిర్ణయాన్ని సాక్షి సమీక్ష కోరడం... రిఫరీ నిర్ణయం సరైనదేనని తేలడంతో ఆమె అదనంగా మరో పాయింట్ కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. కాంస్య పతక బౌట్‌లలో సాక్షి 2–12తో హాంగ్ జంగ్‌వన్ (ఉత్తర కొరియా) చేతిలో... పూజా 1–6తో సాకగామి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మరో భారత మహిళా రెజ్లర్ పింకీ (53 కేజీలు) తొలి రౌండ్‌లో 0–10తో సుమియా (మంగోలియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 125 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సుమీత్ 0–2తో దావిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
వైఎస్ జగన్ అభినందన...
స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను... రజత పతకాలు గెలిచిన షూటర్లు దీపక్ కుమార్, లక్షయ్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఏషియాడ్‌లో భారత క్రీడాకారుల బృందానికి అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగా. ఆసియాస్థాయిలో మూడుసార్లు రజతం గెలిచా. అందుకే ఈసారి ఎలాగైనా పసిడి గెలవాలనుకున్నా. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం... కఠోర శ్రమ ఫలించడం... అన్ని పరిస్థితులు అనుకూలించడం... దేవుడు కూడా సహకరించడంతో పసిడి కల నెరవేరింది.
–వినేశ్
2 ఆసియా క్రీడల్లో వినేశ్‌కు ఇది రెండో పతకం. 2014 ఇంచియోన్ క్రీడల్లో ఆమె 48 కేజీల విభాగంలో రజతం గెలిచింది. 2 ఆసియా క్రీడల్లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్. గతంలో గీతిక జఖర్ (2006; 63 కేజీల్లో కాంస్యం; 2014; 63 కేజీల్లో రజతం) ఈ ఘనత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment