Beti Bachao Beti Padhao
-
శతమానం భారతి: బేటీ పఢావో
ఈ 75 ఏళ్ల స్వతంత్ర వేళ కూడా బాలికలపై వివక్ష ఉందనేది కాదనలేని సత్యం. జ్యోతీబా ఫూలే దంపతులు బాలికలకు పాఠశాలల ఏర్పాటుపై 1848లోనే పోరాడారు. కానీ 173 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో 5వ తరగతితోనే వేలాదిగా బాలికలు బడి మానేస్తున్నారు. పేద కుటుంబంలోని అమ్మాయిని పాఠశాలకు పంపడం ఇప్పటికీ ఒక అద్భుతమే. ఖర్చు భరించలేక పోవడంతోపాటు బాల్యవివాహాలు, ఇంటిపని, పొలాల్లో శ్రమ వంటివి బాలికా విద్యకు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. ఇక హైస్కూల్ స్థాయిలో బాలికలు బడి మానేయడానికి, బాల్య వివాహాలు, ఇంటిపని, వ్యవసాయ శ్రమ వంటివి ఇతర కారణాలు. బాలికలకు ఉపాధి అవకాశాల కొరత ఉండటం వారు పాఠశాలకు దూరం కావడానికి ప్రధాన కారణం. తల్లితండ్రులు, కొన్ని సందర్భాల్లో భర్తలూ... అమ్మాయిలు చదువుకోవడానికి అనుమతిస్తున్నారు కానీ వారిపై తాము పెట్టిన ఖర్చు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. మరి ప్రాథమిక విద్య మాత్రమే పొందిన అమ్మాయిలు వేతనం వచ్చే ఉద్యోగాలను ఎలా పొందగలరు? పైగా బాలికలు బడికి పోవడానికి వారికి ఎలాంటి ప్రోత్సహకాలూ ఉండటం లేదు. పెళ్లి చేసుకోవడం, ఇంటిపట్టునే ఉండి పిల్లలను చూసుకుంటూ ఇంటి పని చేయడం అనే తలరాత నుంచి తాము తప్పించుకునే అవకాశం లేదని గ్రహించాక చదువు పట్ల కనీస ఆసక్తి కూడా వారికి లేకుండా పోతోంది. కళాశాల విద్య పూర్తి చేసుకోవడం, ఉద్యోగావకాశాలు తలుపులు తట్టడం అంటే వీరికి పగటి కలగానే ఉంటోంది. వచ్చే ఇరవై ఐదేళ్లలో ఈ పరిస్థితిని మార్చేందుకు ‘బేటీ పఢావో’ సంకల్పాన్ని మరింతగా ఆచరణలోకి తెచ్చేందుకు అమృతోత్సవాలు ఒక చోదక శక్తిగా పని చేయగలవన్న ఆశను బాలికలున్న కుటుంబాలు వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833) -
శిశు మరణాల రేటు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శిశుమరణాల రేటు తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ ఛౌబే మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) శాంపిల్ రిజిస్ట్రేషన్ నివేదిక ప్రకారం 2014లో ప్రతి వేయి నవజాత శిశువుల్లో 26 మరణాలు సంభవించగా.. 2016 నాటికి ఆ సంఖ్య 24కు తగ్గినట్లు తెలిపారు. శిశు జననాలలో తగ్గిపోతున్న లింగ నిష్పత్తి ఆడ పిల్లల పట్ల సమాజంలో పాతుకుపోయిన వివక్షకు అద్దం పడుతున్నాయని మంత్రి వివరించారు. మగ పిల్లల కోసం కుటుంబాలు పరితపించడం, సంతాన సాఫల్యత క్షీణించడం, టెక్నాలజీ దుర్వినియోగం వంటివి ఆడ పిల్లల జనన రేటు తగ్గిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ వరవడిని కట్టడి చేయడానికి ప్రభుత్వం చట్టాలను చేయడంతో పాటు ఆడ పిల్లలకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు బేటీ బచావో బేటీ పఢావో వంటి బృహత్తరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందు కోసం 2014లో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. 2030 నాటికి లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శిశు మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రమబద్దమైన తనిఖీల ద్వారా శిశు జననాలను పర్యవేక్షించడం, ఆడ పిల్లల పట్ల సానుకూల దృక్పధం ఏర్పడటానికి వీలుగా సమాజంలో చైతన్యం కలిగించేందుకు చర్యలు, లింగ నిర్ధారణకు సంబంధించి ఇంటర్నెట్ ఇతర మాధ్యమాల్లో ప్రకటనలు తొలగించేందుకు 2016లో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం కార్యక్రమాలను అమలు చేసే రాష్ట్రాలకు ఆర్థిక తోడ్పాటు వంటివి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగమేనన్నారు. ఆడ పిల్లల పట్ల సమాజంలో నెలకొన్న ఆలోచనా విధానాన్ని మార్చడమే బేటీ బచావో బేటీ పఢావో పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. లింగ నిర్థారణ ద్వారా భ్రూణ హత్యల నియంత్రణ, ఆడ శిశువులకు రక్షణ వంటివి ఈ పథకం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలని మంత్రి తెలిపారు. -
ఇక బేటీ బచావో..
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా యంత్రాంగం‘‘ బేటీ బచావో – బేటి పడావో’’పై ప్రత్యేక కార్యాచరణకు దిగింది. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య, విద్యా, జీహెచ్ఎంసీ, తదితర శాఖల సమన్వయంలో బ్లాక్ స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (సీపీసీ)లను ఏర్పాటు చేసింది. వివిధ శాఖల క్షేత్ర స్థాయి కార్యాచరణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే బేటీæబచావో–బేటీæపడావో కార్యక్రమం అమలులో హైదరాబాద్‌కు కేంద్ర స్థాయి గుర్తింపు లభించించింది. అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ సిటీగా రూపు దిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు బస్తీ నుంచి బడి వరకు పెద్దఎత్తున ప్రచారోద్యమం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. కాగా, బాలికల నిష్పత్తి శాతం మరింత పెంచేందుకు మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ఆశా వర్కర్లు, విద్యాశాఖకు సంబంధించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, జీహెచ్ఎంసీకు చెందిన సీసీ, డీపీవోలకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మొదటి విడత కింద సుమారు 600 మంది అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చింది. రెండో విడత కింద తాజాగా 1000 మంది ఆశా వర్కర్లకు, 48 మంది క్లస్టర్ రిసోర్స్‌పర్సన్, జీహెచ్ఎంసీ సీసీ, డీపీవోలకు ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు రోజుల ముందు హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రవి లాంఛనంగా ప్రారంభించారు. బాలికల నిష్పత్తి పెరుగుతోంది.. నగరంలో ‘బేటీ æబచావో–బేటి పడావో’ కార్యక్రమంతో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 958 కు చేరుకుంది. వాస్తవంగా 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో బాలికల నిష్పత్తి తక్కువగా ఉండటం అందోళన కలిగించింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు వర్తింప జేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జనవరి 22న నగరంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి విస్తృత ప్రచారానికి నడుంబిగించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను రంగంలో దింపింది. బాలికలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అంశాలను విస్తతంగా ప్రచారం చేస్తోంది. 1098కు ఫోన్ చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. -
యువత తగ్గుముఖం!
సాక్షి, న్యూఢిల్లీ: సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) తగ్గుముఖం పడుతుండడంతో దేశ జనాభాలో చిన్నారులు, యువత శాతం తగ్గుముఖం పట్టి.. వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభాలో 59 శాతం వరకూ ఉండనుందని వివిధ గణాంకాల ఆధారంగా విశ్లేషించింది. టీఎఫ్ఆర్ తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0 నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్య గల జనాభా తగ్గుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2011లో 41 శాతం ఉన్న ఈ గ్రూపు జనాభా.. 2041 నాటికి 25 శాతానికి పడిపోతుందని తెలిపింది. అలాగే 60 ఏళ్లు పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది. 2011లో వీరు 8.6 శాతం ఉండగా.. 2041 నాటికి 16 శాతానికి పెరగనుంది. 20 నుంచి 59 మధ్య ఉండే వర్కింగ్ గ్రూప్ జనాభా.. 2041లో కూడా 59 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పెరిగిన లింగనిష్పత్తి బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభించిన తరువాత ఆంధ్రప్రదేశ్ సహా పలు పెద్ద రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి గణనీయంగా పెరిగిందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది. అంతకుముందు 2001 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి తగ్గగా.. ఈ పథకం ప్రారంభమయ్యాక లింగ నిష్పత్తిలో మార్పు వచ్చిందని తెలిపింది. 2015–16లో ఏపీలో లింగ నిష్పత్తి 873 నుంచి 901 మధ్య ఉండగా.. 2018–19 నాటికి 930–980 నమోదైంది. మరోవైపు తెలంగాణలోనూ లింగనిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదైందని నివేదికలో వెల్లడించింది. -
944/1000
సాక్షి, హైదరాబాద్ : సమాజపు ఆలోచనలో వస్తున్న మార్పులో.. బేటీ బచావ్ బేటీ æపఢావ్ వంటిపథకాలో.. స్వచ్ఛంద సంస్థల చైతన్య కార్యక్రమాలో తెలియదు గానీ.. రెండేళ్లుగా తెలంగాణలో శిశువుల్లో లింగ నిష్పత్తిలో అంతరం తగ్గుతూ వస్తోంది. 2018లో నమోదైన జననా ల వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపించింది. దీని ప్రకారం.. రెండేళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే రాష్ట్రంలో శిశు జననాల్లో లింగ నిష్పత్తి అంతరంలో చాలా మార్పు వచ్చింది. 2018లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 944 మంది ఆడ శిశువులు జన్మించినట్లు నివేదిక పేర్కొంది. 2016లో తెలంగాణలో ఈ నిష్పత్తి 1000:880గా నమోదైంది. 2017లో బాలికల సంఖ్య 914కి చేరగా ఈసారి 944గా నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూస్తే గతేడాది అత్యధికంగా వనపర్తి జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 985 మంది ఆడ శిశువులు జన్మించారు. తర్వాత వికారాబాద్ జిల్లాలో 984మంది ఆడ శిశువులు పుట్టారు. పలు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది ఆడ శిశువులు జన్మించారు. జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి–కొత్తగూడెం, పాలమూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాలు రాష్ట్ర సగటును దాటేశాయి. మిగిలిన జిల్లాలు సగటు కన్నా తక్కువగా ఉన్నాయి. అత్యంత తక్కువగా జనగామ జిల్లాలో వెయ్యి మందికి కేవలం 864 మంది ఆడ శిశువులే జన్మించారు. ఆ తర్వాత ఆసిఫాబాద్–కొమురంభీం జిల్లాలో 883 మంది ఉన్నారని నివేదిక తెలిపింది. 2016లో కరీంగనగర్‌లో ఈ నిష్పత్తి 1000:716గా నమోదవగా 2018లో ఈ సంఖ్య 1000:923కి చేరుకుంది. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరిగేవి. తర్వాత ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక వసతులు కల్పించడంతో.. పరిస్థితి చాలా మెరుగుపడింది. తగ్గిన జననాలు రాష్ట్రంలో జననాల సంఖ్య నాలుగేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 2018లో తెలంగాణలో 6,03,919 మంది జన్మించారు. అందులో 3,10,594 మంది మగ శిశువులు, 2,93,325 మంది ఆడ శిశువులు. అత్యధికంగా హైదరాబాద్‌లో 79,359 మంది పుట్టారు. మేడ్చల్ జిల్లాలో 43,846, నిజామాబాద్ జిల్లాలో 38,027 జననాలు నమోదయ్యాయి. అయితే నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి జననాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. 2015లో 6,12,489 మంది జన్మించగా, 2016లో 6,24,581 మంది, 2017లో 6,17,620 మంది జన్మించారు. 2017తో పోలిస్తే ఈసారి 13,701 మంది తక్కువగా పుట్టడం గమనార్హం. -
బాల్యం బాగుంటేనే భవిష్యత్తు
బాల్యం అమూల్యం, ఆ అమూల్యమైన బాల్యం దృఢంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుం టుంది. బాల్యం బాగా లేకపోతే పౌరులు కూడా ఊసురోమని తయారౌతారు. మన నాయకులు స్వచ్ఛ భారత్ అంటున్నారు. బేటీ బచావ్– బేటీ పడావ్ అంటున్నారు. ఇంకా చాలా నినాదాలిస్తున్నారు. కానీ ఈ నినాదాలు నిజరూపం దాల్చడం లేదు. 28 శాతం మంది పిల్లలు బాల కార్మికులుగా బతుకు బండిని లాగుతున్నారనీ, అమ్మాయిల్లో 31 శాతం మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయనీ, పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒకరు మొదటి జన్మదినం చూడకుండానే కన్నుమూస్తున్నారనీ, 11 శాతం మంది పిల్లలు మాఫియా చేతుల్లో మగ్గిపోతున్నారనీ, సర్కారు వారి గణాం కాలే సెలవిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే పెద్దలు నినాదాలకే పరిమితమైతే పిల్లలు బాగుపడేదెన్నడు? సత్పౌరులుగా ఎదిగేదెన్నడు? ఈ దేశం బాగుపడేదెప్పుడు అనే ప్రశ్న ప్రతి వారినీ పీడించేదే. స్వచ్ఛ భారత్ అని సెలవిస్తూ కోట్లు తగలేస్తున్నవారు, ఉత్తరప్రదేశ్‌లోని నూర్పూర్లో చెత్తకుప్పల దగ్గర విషాహారం తిని ఐదుగురు అమాయక పిల్లలు చనిపోవడం స్వచ్ఛభారత్‌కి మచ్చకాదా? మున్సిపాలిటీ చెత్త బళ్లు లాగుతున్న బాల, బాలికలు అనునిత్యం దర్శనమిస్తుంటారు. మీ స్వచ్ఛ భారత్ పిల్లల్ని పక్కనబెట్టి పెద్దలకు పరిమితమైందా? ఇక బేటీ పడావ్– బేటీ బచావ్ అన్న నినాదానికి వస్తే ఉన్న స్కూళ్లను మూసేస్తుంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు. బేటీ బచావ్ అనే మీ నినాద తీవ్రత ఎంతవరకు వెళ్లిందంటే 2014 నుంచి నేటి వరకు బాలికలపై 7 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగాయి. ఇవి కేవలం పోక్సో చట్ట ప్రకారం నమోదైన లెక్కలు మాత్రమే. బాలికలపై అత్యాచారాలు చేసి చెరపట్టిన వారిలో ప్రజా ప్రతినిధులు సహితం ఉన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు. ప్రజల కోసమే పుట్టానని ప్రగల్భాలు పలికే ఓ ముఖ్యమంత్రి గారి ఏలుబడిలో ఒకే జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 18 అత్యాచారాలు జరిగాయి. ఇది సిగ్గు చేటైన విషయం కాదా? అమ్మాయిల చదువును ప్రోత్సహిస్తారా లేక షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి అని పెళ్లి చేసుకొని పరాన్నభుక్కుగా వర్ధిల్లమని దీవిస్తారా? అర్ధరాత్రి పెద్దనోట్ల రద్దు అని ప్రకటన చేసి ప్రజల్ని పరుగులు పెట్టించిన పెద్దలు, బాల కార్మిక వ్యవస్థ రూపు మాపడానికి అలాంటి ప్రకటన చేసి ఓ గడువు విధించి అనంతరం మీ వద్ద బాల కార్మికులుంటే కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేస్తే బాల కార్మిక సమస్య తీరిపోదా, కేవలం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అని కోట్లు ఖర్చు చేసి తద్దినాల్లా తంతు ముగిస్తే సరిపోతుందా. పిల్లలు విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవనం, ఆటపాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట–పాటల సౌకర్యాలు కల్పించి బాల బాలికలను భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటే భావి తరం మిమ్మల్ని క్షమిస్తుందా, పిల్లలను అనేక వ్యాధుల నుంచి దూరం ఉంచే పౌష్టికాహారం, కనీసం రక్షిత మంచినీరు అందించలేని మీరు చిన్నారుల ముందు దోషులు కాక మరేమౌతారు అని ప్రశ్నిస్తున్నది. బాలల హక్కుల కమిషన్లను సహితం నీరుకారుస్తూ, పిల్లల హక్కులని ఎందుకు కాలరాస్తున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా? దోషులుగా నిలబడతారో? బాలవీరులుగా పిల్లలను తీర్చిదిద్ది చరిత్రలో వీరులుగా నిలిచిపోతారో కేంద్ర, రాష్ట్ర పాలకులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రచయిత: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
కలెక్టర్ యోగితా రాణాకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో నగరం అద్భుత ప్రగతి సాధించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు అందుకున్నారు. గురువారం రాజస్తాన్‌లోని జుంజునులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో యోగితా రాణాకు మోదీ అవార్డును బహూకరించారు. ‘బేటీ బచావో–బేటీ పడావో’లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సంరక్షణ, బాలికా విద్యకు విశేష కృషికి గాను ఈ మేరకు ఆమెను సత్కరించారు. ఈ పథకం అమలులో హైదరాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బాలికల నిష్పత్తి పురోభివృద్ధికి యోగితా రాణా ప్రత్యేక చొరవను ప్రధాని ప్రశంసించారు. ఈ పథకం ప్రారంభం అయిన తరువాత మహా నగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 968కు పెరిగింది. లింగ నిర్ధారణ కట్టడి, బాలికల పట్ల చిన్నచూపు, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్‌లు, ఒక మగపిల్లాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పే పద్ధతి లాంటి కార్యక్రమాలతో నగరంలో బాలికల శాతం పెరిగింది. -
మగపిల్లలున్న తల్లిదండ్రులూ.. బహుపరాక్
మగపిల్లలున్న తల్లిదండ్రులూ.. బహుపరాక్.. విశ్వనగరం దిశగా అడుగుల వేస్తున్న హైదరాబాద్‌లో మీ అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా మారవచ్చు. భవిష్యత్తులో అమ్మాయిలు దొరకని పరిస్థితి దాపురించనుంది. వధువు కోసం చిన్నపాటి యుద్ధాలే చేయాల్సి రావచ్చు. ఎందుంటే గ్రేటర్ నగరంలో బాలికల నిష్పత్తి అత్యంత దారుణంగా పడిపోతోంది. తాజా సామాజిక –ఆర్థిక సర్వే ఫలితాలు ఇదే సూచిస్తున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో బాలికల శాతం రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. తాజాగా ప్రతి వెయ్యి మందికి బాలురకు బాలికలు 931 మంది మాత్రమే ఉన్నట్టు తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1000/954గా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈ నిష్పత్తి 1000/931గా నమోదైంది. అంటే ఐదేళ్లలో దాదాపు 23 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘బేటి బచావో.. బేటి పడావో’ నినాదంతో ఆడపిల్లల సంరక్షణ చర్యలు చేపడుతుంటే.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం బాలికల నిష్పత్తి తిరోగమనం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సిటీలో మున్ముందు పెళ్లికాని బ్రహ్మచారుల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సిటీలో బాలికల సంరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ‘బేటీ బచావో’పై విస్తృత ప్రచారం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో సాగుతోంది. తాజా తెలంగాణ ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి సినీనటి రకుల్ ప్రీత్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా రంగంలో దింపింది. హైదరాబాద్ నగరంలో బాలికల నిష్పత్తి అతి తక్కువగా ఉండడానికి వెనుకబాటుతనం ఒక్కటే కారణం కాదని మరోమారు రుజువైంది. వెలుగు చూస్తున్న లింగ వివక్ష... ప్రపంచ పటంలో సాంకేతిక పరంగా అరుదైన గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్‌లో లింగ వివక్ష కొనసాగుతోంది. బాలికల పట్ల చిన్నచూపు, లింగనిర్ధారణ పరీక్షలు, అమలుకాని పీసీపీఎన్డీటీ యాక్ట్, మగపిల్లవాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పడం వంటివి ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. గత ఏడాది అప్పటి హైదారబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఏకంగా గర్భిణులకు లేఖ రాశారు. ‘ఏమో..! మీ కడుపున ఒక సానియానో.. మరో సింధునో, సాక్షినో పుట్టొచ్చుకదా.! ఆడ పిల్లల్ని రక్షించుకుందాం.. చదివించుకుందాం..! ఆడ పిల్లని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం నేరమే కాకుండా.. ఆడవారై ఉండి ఆడపిల్లల పట్ల అన్యాయం చేసిన వారవుతారు’ అంటూ అందులో పేర్కొన్నారు. బాలికల సంఖ్య పెంచేందుకు చర్యలు సిటీలో బాలికల సంఖ్య పెంచేందుకు జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రతేక్యక చర్యలు చేపట్టింది. బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమానికి 18 మందితో టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసింది. వీరు ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే మిఠాయిలు పంచడం, అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి మూడో శనివారం ఆ నెలలో పుట్టిన ఆడపిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. తల్లులతో కేట్ కట్ చేయించి శుభాకాంక్షలు చెబుతున్నారు. గర్భిణులకు సామూహిక సీమంతం సైతం చేస్తున్నారు. రాఖీ పండగ రోజు బేటీ బచావో–బేటీ పడాలో అంటూ అంగన్వాడీ పరిధిలోని ప్రముఖుల నుంచి గవర్నర్ వరకు రాఖీలు కట్టారు. తాజాగా సినీనటిని రంగంలో దింపారు. బేటీ బచావోపై అవగాహన... ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, కన్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆడపిల్లలను ఆదర్శంగా తీసుకోవాలి. బాలికలను రక్షించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. హైదరాబాద్‌లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నాం. ఆడపిల్లల ప్రాముఖ్యతను చాటుతున్నాం. – మహ్మద్ ఇంతియాజ్ రహీమ్, బేటీ బచావో–బేటీ పడావో సమన్వయకర్త -
‘సుకన్య’ పథకం .. బాలికలకు వరం
అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో దరఖాస్తులు సింహాద్రిపురం : ప్రధాని నరేంద్రమోడి 2015 జనవరి 22న ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావోలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికలకు వరంగా మారింది. తల్లిదండ్రులు తమ బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖాతాలు ప్రారంభిస్తే ఆడపిల్లలు అదృష్ట లక్ష్ములుగా మారుతారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆడపిల్లల చదువు, వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇస్తోంది. ఖాతా ప్రారంభం ఇలా... : ఐదేళ్లలోపు బాలికల పేరుతో సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్ఎస్ఏ) ప్రారంభించవచ్చు. బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్ ద్వారా ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఈ ఖాతాలు తెరవవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దినసరి కూలీలు ఎవరైనా ఇందులో ఖాతాదారులు కావచ్చు. ఉచిత దరఖాస్తులు : సమీప పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. దరఖాస్తు ఫారాలను కార్యాలయంలో ఉచితంగా పొంది సమాచారాన్ని పొందుపరచాలి. దరఖాస్తుతోపాటు తండ్రి, తల్లి లేదా సంరక్షకుడి వివరాలు, బాలిక ఫొటో, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రం, ఆధార్ చిరునామా తెలిపే ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని జతపరచాలి. ఖాతా ప్రారంభ సమయంలో రూ.1000లు చెల్లించాలి. తర్వాత రూ.100లపైబడిన మొత్తాన్ని జమ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1000లనుంచి రూ.1.50లక్షల వరకు ఒకేసారి లేదా వేర్వేరు కంతుల్లో జమ చేయవచ్చు. అలా ఖాతాను ప్రారంభించిన నాటినుంచి నేరుగా అత్యధికంగా 14ఏళ్ల వరకు జమ చేసుకోవచ్చు. బాలికలకు 21ఏళ్లు వచ్చేవరకు లేదా వివాహం జరగనంతవరకు డిపాజిట్లు కొనసాగించవచ్చు. పథకంవల్ల ఉపయోగాలు : బాలికకు 18ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత చదువుకు గానీ, వివాహానికైనా ఖాతాలో ఉన్న మొత్తంలో సగం సొమ్మును డ్రా చేసుకొనే అవకాశం ఉంది. 2014-15లో డిపాజిట్‌కు 9.1శాతం వడ్డీ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాలికకు 14ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ వడ్డీ ఖాతాకు జమ అవుతుంది. పాసు పుస్తకం సదుపాయం ఉంటుంది. ఖాతా ఎక్కడికైనా బదిలీ చేసుకొనే వీలు ఉంటుంది. ఏడాది వయసున్న బాలిక పేరుతో నెలకు రూ.1000లు చెల్లిస్తే ఏడాదికి ఖాతాలో రూ.12వేలు జమ అవుతుంది. అలా 14ఏళ్లపాటు జమ చేస్తే రూ.1.68లక్షల వరకు పొదుపు చేయగలుగుతారు. జమ చేసిన నాటి నుంచి 18ఏళ్లు నిండిన తర్వాత 21ఏళ్లు నిండకముందే వివాహమైతే ప్రభుత్వ ఖాతా నిలిపివేస్తారు. -
ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా: మోదీ
అమ్మాయిలను చదివించండి.. మగపిల్లలతో వారూ సమానమే ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ ప్రారంభంలో మోదీ ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిని విడనాడాలి.. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు.. ఆడపిల్లల ప్రాణాలను భిక్షమడుగుతున్నాడు.. భ్రూణ హత్యలు, సమాజంలో బాలికలపై చూపుతున్న వివక్ష వంటివన్నీ మానసిక వ్యాధులు.. అది 18 వ శతాబ్దపు ఆలోచనాధోరణి కన్నా దారుణం. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలియగానే గర్భంలోనే చంపేయడం దారుణం.. దీనికి సహకరిస్తున్న డాక్టర్లు ఆ పాపపు పని ద్వారా సమాజానికి అన్యాయం చేస్తున్నారు.. దీని ద్వారా రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయి.. పానిపట్: మరో ప్రజాహిత కార్యక్రమానికి ప్రధాని గురువారం శ్రీకారం చుట్టారు. బాలికాసంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యాలుగా ‘బేటీ బచావో.. బేటీ పఢావో’(ఆడపిల్లల్ని కాపాడండి..ఆడపిల్లల్ని చదివించడం)’ పథకాన్ని హరియాణలోని పానిపట్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిపై నిప్పులు చెరిగారు. ‘ఈ దేశానికి ప్రధాని ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు. ఆడపిల్లల ప్రాణాల్ని భిక్షమడుగుతున్నాడు’ అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలియగానే గర్భంలోనే చంపేసే దారుణాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. దానికి సహకరిస్తున్న డాక్టర్లు ఆ పాపపు పని ద్వారా సమాజానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆక్షేపించారు. ‘మీరు వైద్యవిద్య చదువుకుంది ఆడపిల్లలను గర్భంలోనే చంపేందుకు కాదు. డబ్బు కోసం ఆ దారుణం చేస్తున్నారా? అది సమాజాన్ని మోసం చేయడమే. బాలికల రక్షణ, అభివృద్ధి బాధ్యత సమాజంలో భాగమైన మీకూ ఉంది’ అని డాక్టర్లకు హితవు చెప్పారు. ‘భ్రూణ హత్యలు, లింగ వివక్ష అనే నేరాలు చేస్తూ 18వ శతాబ్దపు మనుషుల కన్నా నీచస్థితిలో ఉన్నామని చెప్పొచ్చు. 18వ శతాబ్దంలో ఆడపిల్లల్ని కనీసం కొన్నాళ్లైనా బతకనిచ్చేవారు. ఇప్పుడు మన బిడ్డల్ని తల్లి గర్భంలో ఉండగానే చంపేస్తున్నాం’ అన్నారు. అయితే, ఏ తల్లి కూడా గర్భంలో ఉండగానే పిల్లల్ని చంపుకోవాలనుకోదని, కుటుంబ ఒత్తిడి, సమాజంలో పరిస్థితులు ఆమెను అందుకు ఒప్పుకునేలా చేస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. స్త్రీ, పురుష నిష్పత్తి అతితక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా జన్మించిన గడ్డపై ఎంతోమంది కల్పనాచావ్లాలను పురిట్లోనే చంపేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ‘భారతీయ సమాజంలో మగపిల్లలకు మాత్రం ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఆడపిల్లలు పెళ్లి అయిన తరువాత వేరే ఇంటి ఆస్తిగా మారిపోతారనే తప్పు భావన ఉంది. మగపిల్లలైతే వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే అపోహలో ఉంటారు. అదే నిజమైతే.. దేశంలో వృద్ధాశ్రమాలు ఇంతగా పెరిగేవి కావు’ అన్నారు. ‘కూతుళ్లను చదవుకోనివ్వరు. కానీ కోడళ్లు మాత్రం చదువుకున్నవారు కావాలని కోరుకుంటారు. ఇవీ మన సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలు’ అని ఎత్తిపొడిచారు. బాలికల పట్ల సున్నితంగా, సానుకూలంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు.. అందరిపై ఉందని మోదీ స్పష్టం చేశారు. ‘హర్యానాలోని మహేంద్రగఢ్, ఝజ్జర్ జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి 1000: 785గా ఉంది. అంటే రానున్న రోజుల్లో 215 మంది మగపిల్లలు అవివాహితులుగా ఉండిపోవాల్సి వస్తుంది’ అన్నారు. అనంతరం లింగవివక్షకు వ్యతిరేకంగా అక్కడున్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు మనేకాగాంధీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, జేపీ నద్దా, హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ పాల్గొన్నారు. బేటీ పఢావో.. బేటీ బచావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ‘రోజుకు 2వేల భ్రూణ హత్యలు’ దేశవ్యాప్తంగా రోజుకు 2000 మంది ఆడపిల్లల్ని తల్లిగర్భంలోనే చిదిమేస్తున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. పురుష- స్త్రీ నిష్పత్తి కొన్ని రాష్ట్రాల్లో దారుణంగా ఉందని, 1000 మంది బాలురు ఉంటే 840 మంది బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సుకన్య సమృద్ధి యోజన అదే వేదికపై బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’ను మోదీ ప్రారంభించారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ(9.1%), ఆదాయపన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలిక పెళ్లయేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేయొచ్చు. బాల్యవివాహాలను అడ్డుకునే లక్ష్యంతో 18 ఏళ్లలోపు విత్‌డ్రాయల్‌ను అనుమతించరు. -
‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభం
గుర్గావ్: నగరంలో ఆదివారం ఉదయం ‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభమైంది. తన మానస పుత్రిక అయిన ఈ కార్యక్రమా న్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. అయినప్పటికీ హర్యానా ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు సాగింది. ఈ కార్యక్రమాన్ని హర్యానా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి నర్బీర్‌సింగ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. స్వతంత్ర సేనాని జిల్లా పరిషత్ భవన్ ప్రాంగణంలో ప్రారంభించిన ఈ యాత్రలో స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాగా శనివారం హర్యానాలోని అనేక ప్రాంతాల్లో కే ంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించిన సంగతి విదితమే. పధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని పానిపట్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి నర్బీర్‌సింగ్ మాట్లాడుతూ ‘ సెక్స్ నిష్పత్తిలో అసమతుల్యతతోపాటు మహిళ ల్లో అనేకమంది విద్యకు దూరమవుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలత చెందారు. ఈ నేపథ్యంలో దీనిపై దేశవాసులకు అవగాహన కల్పించాల నే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యతోపాటు మహిళలకు సాధికారిత కల్పించడంద్వారా సెక్స్ నిష్పత్తిని పెంచవచ్చు. సమాజంలో మార్పు కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సమాజంలో మార్పు రానంతకాలం ఇందుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా అది విజయవంతం కాదు. ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ విషయంలో సామాజిక చైతన్యం రావాలంటే అందుకు ప్రజాఉద్యమం అవసరం. పానిపట్‌లో ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్దసంఖ్యలో పాల్గొనాలి’ అని కోరారు. -
ఆడపిల్లకు అండగా ఉందాం
ఇందూరు : ఆడపిల్లలపై చిన్న చూపు వద్దని, వారికి అండగా ఉందామని ఇన్చార్జి కలెక్టర్, జడ్పీ సీఈవో రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత పిలుపునిచ్చారు. శనివా రం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా బాలల సంరక్షణ విభాగం (ఐసీపీఎస్) ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లంటే భారంగా భావిం చడం మానవత్వం అనిపించుకోదన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, చేయ డం నేరమన్నారు. లింగ నిర్ధారణకు ముందుకు వచ్చిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల్లో ఆడ, మగ తేడాను చూపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. సృష్టిలో ఇద్దరూ సమానమేనని భావించాలన్నారు. పెంపకంలో తేడా చూపవద్దని కోరా రు. ఆడపిల్లలకు రక్షణ కల్పించి, చదివించాల్సిన బాధ్య త తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలను అక్రమంగా రవాణా చేయడం, చట్ట విరుద్ధంగా దత్తతనివ్వడం, అమ్మడం, కొనడం నేరమన్నా రు. వీటిని నిరోధించడానికి ఐసీపీఎస్ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకోసం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాను అంగన్వాడీ సిబ్బంది, విద్య, వైద్య, పోలీసు శాఖల సిబ్బంది విజయవంతం చేయాలని కోరారు. జడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వేకమాన్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబడ్డి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఐసీపీఎస్ సిబ్బంది చైతన్య, ముఖీం తదితరులు పాల్గొన్నారు. -
భేటీ బచావో-భేటీ పడావోకు 500 కోట్లు
న్యూఢిల్లీ : ఆడశిశువుల రక్షణ, ఆడపిల్లల విద్యపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. 'భేటీ బచావో-భేటీ పడావో' పేరుతో కొత్త పథకం ప్రకటించింది. ఆడపిల్లలను రక్షించండి, చదివించండి పథకానికి రూ.500 కోట్లు నిధులు కేటాయించనున్నారు. అలాగే దేశంలో మహిళల భద్రత కోసం రూ.150 కోట్లు నిధులు ఖర్చు చేస్తామని అరుణ్ జైట్లో తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అదేవిధంగా లింగ వివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో బోధనలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. *నిర్భయ ఫండ్ నుంచి నిధులు *ఢిల్లీలో మహిళా రక్షణకు ఎమర్జెన్సీ సెంటర్ *నగరాల్లో మహిళల రక్షణకోసం రూ. 150 కోట్లు *బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు * బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం * మహిళల రుణాల కోసం 'ఆ జీవిక' పథకం