సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శిశుమరణాల రేటు తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ ఛౌబే మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) శాంపిల్ రిజిస్ట్రేషన్ నివేదిక ప్రకారం 2014లో ప్రతి వేయి నవజాత శిశువుల్లో 26 మరణాలు సంభవించగా.. 2016 నాటికి ఆ సంఖ్య 24కు తగ్గినట్లు తెలిపారు. శిశు జననాలలో తగ్గిపోతున్న లింగ నిష్పత్తి ఆడ పిల్లల పట్ల సమాజంలో పాతుకుపోయిన వివక్షకు అద్దం పడుతున్నాయని మంత్రి వివరించారు. మగ పిల్లల కోసం కుటుంబాలు పరితపించడం, సంతాన సాఫల్యత క్షీణించడం, టెక్నాలజీ దుర్వినియోగం వంటివి ఆడ పిల్లల జనన రేటు తగ్గిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు.
ఈ వరవడిని కట్టడి చేయడానికి ప్రభుత్వం చట్టాలను చేయడంతో పాటు ఆడ పిల్లలకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు బేటీ బచావో బేటీ పఢావో వంటి బృహత్తరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందు కోసం 2014లో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. 2030 నాటికి లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శిశు మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
క్రమబద్దమైన తనిఖీల ద్వారా శిశు జననాలను పర్యవేక్షించడం, ఆడ పిల్లల పట్ల సానుకూల దృక్పధం ఏర్పడటానికి వీలుగా సమాజంలో చైతన్యం కలిగించేందుకు చర్యలు, లింగ నిర్ధారణకు సంబంధించి ఇంటర్నెట్ ఇతర మాధ్యమాల్లో ప్రకటనలు తొలగించేందుకు 2016లో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం కార్యక్రమాలను అమలు చేసే రాష్ట్రాలకు ఆర్థిక తోడ్పాటు వంటివి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగమేనన్నారు. ఆడ పిల్లల పట్ల సమాజంలో నెలకొన్న ఆలోచనా విధానాన్ని మార్చడమే బేటీ బచావో బేటీ పఢావో పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. లింగ నిర్థారణ ద్వారా భ్రూణ హత్యల నియంత్రణ, ఆడ శిశువులకు రక్షణ వంటివి ఈ పథకం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment