అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో దరఖాస్తులు
సింహాద్రిపురం : ప్రధాని నరేంద్రమోడి 2015 జనవరి 22న ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావోలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికలకు వరంగా మారింది. తల్లిదండ్రులు తమ బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖాతాలు ప్రారంభిస్తే ఆడపిల్లలు అదృష్ట లక్ష్ములుగా మారుతారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆడపిల్లల చదువు, వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇస్తోంది.
ఖాతా ప్రారంభం ఇలా... :
ఐదేళ్లలోపు బాలికల పేరుతో సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్‌ఎస్‌ఏ) ప్రారంభించవచ్చు. బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్ ద్వారా ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఈ ఖాతాలు తెరవవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దినసరి కూలీలు ఎవరైనా ఇందులో ఖాతాదారులు కావచ్చు.
ఉచిత దరఖాస్తులు :
సమీప పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. దరఖాస్తు ఫారాలను కార్యాలయంలో ఉచితంగా పొంది సమాచారాన్ని పొందుపరచాలి. దరఖాస్తుతోపాటు తండ్రి, తల్లి లేదా సంరక్షకుడి వివరాలు, బాలిక ఫొటో, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రం, ఆధార్ చిరునామా తెలిపే ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని జతపరచాలి. ఖాతా ప్రారంభ సమయంలో రూ.1000లు చెల్లించాలి. తర్వాత రూ.100లపైబడిన మొత్తాన్ని జమ చేయవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1000లనుంచి రూ.1.50లక్షల వరకు ఒకేసారి లేదా వేర్వేరు కంతుల్లో జమ చేయవచ్చు. అలా ఖాతాను ప్రారంభించిన నాటినుంచి నేరుగా అత్యధికంగా 14ఏళ్ల వరకు జమ చేసుకోవచ్చు. బాలికలకు 21ఏళ్లు వచ్చేవరకు లేదా వివాహం జరగనంతవరకు డిపాజిట్లు కొనసాగించవచ్చు.
పథకంవల్ల ఉపయోగాలు :
బాలికకు 18ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత చదువుకు గానీ, వివాహానికైనా ఖాతాలో ఉన్న మొత్తంలో సగం సొమ్మును డ్రా చేసుకొనే అవకాశం ఉంది. 2014-15లో డిపాజిట్‌కు 9.1శాతం వడ్డీ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాలికకు 14ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ వడ్డీ ఖాతాకు జమ అవుతుంది. పాసు పుస్తకం సదుపాయం ఉంటుంది. ఖాతా ఎక్కడికైనా బదిలీ చేసుకొనే వీలు ఉంటుంది.
ఏడాది వయసున్న బాలిక పేరుతో నెలకు రూ.1000లు చెల్లిస్తే ఏడాదికి ఖాతాలో రూ.12వేలు జమ అవుతుంది. అలా 14ఏళ్లపాటు జమ చేస్తే రూ.1.68లక్షల వరకు పొదుపు చేయగలుగుతారు. జమ చేసిన నాటి నుంచి 18ఏళ్లు నిండిన తర్వాత 21ఏళ్లు నిండకముందే వివాహమైతే ప్రభుత్వ ఖాతా నిలిపివేస్తారు.
‘సుకన్య’ పథకం .. బాలికలకు వరం
Published Tue, Apr 28 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement