‘బాలికా సంరక్షణ’ ఏదీ ?
పథకానికి రెండేళ్లుగా ప్రీమియం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం.. రూ.181 కోట్లు బకాయి
సాక్షి, హైదరాబాద్: బాలికల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందిలే అన్న పేద తల్లిదండ్రుల నమ్మకాన్ని, చిన్నారుల పేరిట ఎంతో కొంత సొమ్ము జమ అవుతోందన్న ఆశను రాష్ట్ర ప్రభుత్వం వమ్ము చేస్తోంది. వింత కొర్రీలతో వారి ఆశలకు గండికొడుతోంది. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్)కు గత రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడమే దీనికి నిదర్శనం. ఈ పథకం కింద ప్రీమియం కోసం చెల్లించాల్సిన దాంట్లో రూ.181 కోట్లను ప్రభుత్వం బకాయి పడింది. అసలు ఈ పథకాన్ని మూసివేసిన సర్కారు.. బంగారు తల్లి పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. కానీ, పాత పథకానికి ప్రీమియం చెల్లింపులను ఆపేసింది. దాంతో ఎప్పుడో 20 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే తమ బాండ్లు ఉంటాయో, రద్దవుతాయో? అనే ఆందోళన ఈ పథకం కింద లబ్ధి పొందే 5.6 లక్షల మంది చిన్నారులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
రెండేళ్ల నుంచి నయా పైసా లేదు..
2005లో అప్పటి సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి పేద బాలికలకు భరోసా ఇచ్చేందుకు బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్)ను ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఒకే ఆడపిల్ల జన్మిస్తే రూ. లక్ష, ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కో బాలికకు రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. ఈ మొత్తాన్ని ఆ బాలికలకు 20 ఏళ్ల వయసు నిండిన తర్వాత అందజేస్తుంది. ఇందుకోసం ప్రతియేటా ప్రీమియం కింద ఎల్ఐసీకి కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది.
2005-06 సంవత్సరంలో ప్రారంభమయిన ఈ పథకం వైఎస్సార్ మరణం వరకు సజావుగానే సాగింది. తర్వాత అన్ని పథకాల్లాగానే ఆర్థిక అవాంతరాలను ఎదుర్కొని.. గత రెండేళ్ల నుంచి పూర్తి ప్రశ్నార్థకంగా మారిపోయింది. 2005 నుంచి 2011 వరకు మొత్తం 4.77 లక్షల మందికి ఈ పథకం కింద ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి బాండ్లు జారీ చేశారు. వీటికి గడువు ముగిసేంతవరకు ఏటా ప్రీమియం చెల్లించాలి. దాంతో పాటు 2011-12, 2012-13లో, 2013-14లోని ఒక నెల (బంగారుతల్లి పథకం అమల్లోకి వచ్చేంత వరకు) దాదాపు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి కూడా ప్రీమియం చెల్లించి బాండ్లు జారీ చేయాల్సి ఉంది. కానీ, కొత్తవారికే కాదు ఆరేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నవారికి కూడా ప్రీమియం చెల్లింపు ఆపేశారు. దాంతో ఆ మొత్తం రూ. 181 కోట్లకు చేరింది. ఈ సొమ్ము చెల్లిస్తేనే 5.56 లక్షల మంది బాలికల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది.
మరి ఏం జరుగుతోంది?
రూ. 181 కోట్ల ప్రీమియం బకాయిలను వెంటనే చెల్లించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు ఎల్ఐసీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఆ విజ్ఞాపనలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఆ నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తూ ఫైలును తిరిగి పంపుతున్నారు. ‘ఈ పథకం కింద ఎంపికైన బాలికల్లో మధ్యలో చదువుమానేసిన వారెంతమంది..? చనిపోయిన వారికి ప్రీమియం చెల్లింపు నిలిపివేశారా..? ఆ వివరాలన్నింటినీ పంపండి.. అప్పుడే నిధులు విడుదల చేస్తాం’ అంటూ అధికారులు జాప్యం చేస్తుండడం గమనార్హం. అయితే, బాలికా శిశు సంరక్షణ పథకం కింద లబ్ధి పొందుతున్న చిన్నారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని, మెచ్యూరిటీ పొందేంత వరకు ప్రీమియం డబ్బు చెల్లిస్తామని ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అసలు ఈ పథకం గురించే మరిచిపోయారన్న భావన వ్యక్తమవుతోంది. కొత్త పథకాన్ని ప్రారంభించి, తగినంత ప్రచారం పొందిన ప్రభుత్వం.. ఇక ఈ పాత పథకానికి నిధుల చెల్లించడం కష్టమేనని, ఆ పథకం కింద లబ్ధి పొందిన 5.66 లక్షల మంది భవితవ్యం ప్రశ్నార్థకమేనని ప్రభుత్వ అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.