
న్యూఢిల్లీ: కుమార్తెల భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది.
2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటు 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్ర పథకం రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో డిపాజిట్ 115 నెలల్లో రెట్టింపు అవుతుంది.
నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్‌బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment