small saving schemes
-
సుకన్య సమృద్ధి పథకంలో మరింత రాబడి
న్యూఢిల్లీ: కుమార్తెల భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటు 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్ర పథకం రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో డిపాజిట్ 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు. -
కేంద్రం వడ్డీ రేట్లు పెంచింది.. చెక్ చేసుకున్నారా?
న్యూఢిల్లీ: ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును కేంద్రం శుక్రవారం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. అన్ని ఇతర చిన్న పొదుపు పథకాల రేట్లను యథాతథంగా ఉంచింది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తాజా రేట్ల విధానంపై ఆర్థికశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబర్ త్రైమాసికానికి యథాతథంగా కొనసాగుతున్న మిగిలిన పొదుపు పథకాల రేట్లు ఇలా... -
చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వరుసగా రేట్ల తగ్గింపులతో చిన్నబోయిన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి కీలకమైన వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతున్నాయి. మన ఆర్బీఐ కూడా ఇదే బాటలో నడుస్తోంది. మే చివరి నుంచి ఇప్పటి వరకు 1.4 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో మార్కెట్ తీరుకు అనుగుణంగా, తొమ్మిది వరుస త్రైమాసికాల యథాతథ స్థితి తర్వాత.. చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సైతం కేంద్ర సర్కారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.30 శాతం వరకు పలు పథకాల రేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే పథకాలపై ప్రధానంగా రేట్లను పెంచింది. అదే సమయంలో కొన్ని పథకాల రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతి త్రైమాసికానికీ ఈ పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే తదుపరి మూడు నెలల కాలానికి తాజా రేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై ప్రస్తుతం 5.5 శాతం రేటు ఉంటే, ఇక మీదట ఇది 5.8 శాతం కానుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై రేటు 0.20 శాతం పెరిగి 7.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ పథకంలో రేటు 7.4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి (123 నెలలకు మెచ్యూరిటీ).. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో రేటును 6.6 శాతం నుంచి 6.7 శాతానికి కేంద్రం సవరించింది. వీటిల్లో మార్పు లేదు..: ఏడాది, ఐదేళ్ల ఎఫ్డీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల రేట్లు ప్రస్తుతమున్న మాదిరే మరో మూడు నెలలు కొనసాగుతాయి. ఈ పథకాల రేట్లను కేంద్రం సవరించలేదు. సవరించిన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను (జూలై–సెప్టెంబర్) ఈ స్కీమ్‌లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020–21 ఏడాది తొలి త్రైమాసికం నుండి ఈ రేట్లను కేంద్రం సవరించలేదు. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక శాఖ ఈ వడ్డీరేట్లను నోటిఫై చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మే, జూన్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీరేటు రెపోను ఏకంగా 0.9 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్, రుణ రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇండియన్ బ్యాంక్ రుణ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గురువారం నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. అన్ని కాలపరమితులకు సంబంధించి రుణ రేట్లు పెరగనున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. పెరిగిన రేట్లు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్ ప్రకటన ప్రకారం, వినియోగ రుణ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి 6 నెలల మధ్య కాలవ్యవధుల రుణ రేట్లు 6.75 శాతం నుంచి 7.40 శాతం శ్రేణిలో పెరిగాయి. వీటితోపాటు బ్యాంక్ ట్రజరీ బిల్స్ ఆధారిత (టీబీఎల్ఆర్) రుణ రేటును, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) కూడా పెంచింది. 3 నెలల నుంచి మూడేళ్ల కాలానికి పెంపు శ్రేణి 5 నుంచి 6.10 శాతం వరకూ ఉంది. పెంపు 0.40 శాతం నుంచి 0.55% వరకూ నమోదయ్యింది. ఇక బేస్ రేటు 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. -
Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమీక్రాన్ కేసులు పేరుగతున్న తరుణంలో కేంద్రం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2022తో ముగిసే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కూడా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం నుంచి స్థిర ఆదాయం పొందే పెట్టుబడిదారులకు ఉపశమనం కలగనుంది. అంటే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన చిన్న పొదుపు పథకాలకు సెప్టెంబర్-డిసెంబర్ 2021 మధ్య కాలంలో వర్తించే వడ్డీరేట్లు 31 మార్చి 2022 వరకు వర్తించనున్నాయి. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్హోల్డర్లకు వార్షిక వడ్డీ 7.1 శాతం లభిస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది. ఇక సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్కీమ్ ఇదే. ఇక ఐదేళ్ల మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్‌కు 6.6 శాతం వడ్డీ, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్‌కు 5.5 శాతం, ఐదేళ్ల డిపాజిట్‌కు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు ఖాతాలకు 4% వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 2020 నుంచి ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. (చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?) -
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత
సాక్షి, న్యూఢిల్లీ : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా (కెవీపీ) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) లాంటి ఏడు ప్రజాదరణ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ పథకాలపై చెల్లించే వడ్డీరేను 70 నుంచి 140 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మధ్య, పేద తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకునే లక్షల మంది ప్రభావితం కానున్నారు. ఈ సవరించిన రేట్లు నేటి (ఏప్రిల్ 1 ) నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2016 నుండి, అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ దిగుబడులతో అనుసంధానించిన నేపథ్యంలో ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్ల సమీక్ష వుంటుంది. పీపీఎఫ్ పథకంపై ప్రస్తుతం 7.9 శాతం వర్తిస్తుండగా, తాజా నిర్ణయం ప్రకారం ఇది 7.1 శాతానికి దిగి వచ్చింది. ఐదేళ్ల జాతీయ పొదుపు ధృవీకరణ (ఎన్ఎస్సి) పత్రంపై 7.9 శాతానికి బదులు ఇపుడు 6.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే కేవీపీ 6.9 శాతంగా వుంది. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. సుకన్య సమృద్ది ఖాతా లకు 8.4 శాతానికి బదులుగా 7.4 శాతంగా వుంటుంది. ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.6 శాతంగా వుంది. అంతకు ముందు ఇది8.శాతం. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకం 6.6శాతం. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. అలాగే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లుపై వడ్డీ 5.5-6.7శాతం. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ముందస్తు పాలసీ సమీక్షలొ రెపో రేటు కోతకు మొగ్గు చూపిన అనంతరం, తాజాగా చిన్న పొదుపు పథకాల వడ్డీరేటుపై కోత పడింది. అయితే ఊహించిన దానికంటే ఈ తగ్గింపు ఎక్కువగా వుందని డిపాజిట్ రేట్లను మరింత తగ్గించడానికి ప్రభుత్వం ఇలా చేసి ఉండవచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రధానంగా ఆధారపడే వారు ఇప్పుడు వారి పోర్ట్‌ఫోలియోను తిరిగి సందర్శించాల్సి ఉంటుందని వైజెన్‌వెస్ట్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంత్ రుస్తాగి తెలిపారు. తాజా నిర్ణయంతో సాంప్రదాయ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.నేరుగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలని సూచించలేనప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో హైబ్రిడ్ ఫండ్స్ ను పరిశీలించాలని సూచించారు. కాగా కోవిడ్ -19 వ్యాప్తి, ఆర్థికవ్యవస్థపై ప్రభావం నేపథ్యంలో ఆర్బీఐ గత వారం రెపో రేటును 75 బీపీఎస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
గుడ్‌న్యూస్ : పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నతరహా పొదుపు ఖాతాల్లో మదుపు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జాతీయ పొదుపు సర్టిఫికెట్, పీపీఎఫ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి 0.4 శాతం మేర పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లకు అనుగుణంగా పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సర్కార్ సవరించింది. చిన్నతరహా పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో నోటిఫై చేస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వడ్డీ రేట్ల సవరణతో అయిదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై వడ్డీరేటును 7.8 శాతానికి, సీనియర్ సిటిజెన్ పొదుపు పథకంపై వడ్డీరేటును 8.7 శాతానికి, రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగాయి. 4 శాతంగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై వడ్డీరేటును యథాతథంగా ఉంచారు. ఇక ప్రస్తుతం పీపీఎఫ్, ఎన్ఎస్సీపై 7.6 శాతం ఉన్న వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి ఖాతాలపై 0.4 శాతం వడ్డీరేటు అధికమై 8.5కు చేరింది. ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటును 0.3 శాతం పెంచారు. -
చిన్న పొదుపు దారుల ఆశలపై నీళ్లు
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపుదారులకు తీరని నిరాశను మిగిల్చింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) , ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. పీపీఎఫ్ సహా, చిన్న పొదుపు ఖాతాలపై 0.1 శాతం వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం వీటిపై ప్రస్తుత వడ్డీరేటు 8 శాతం, రేపటినుంచి 7.9శాతంగా ఉండనుంది. పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా, ఏప్రిల్ 1, 2017 నుంచి ప్రారంభమయ్యే 2016-17 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్ల తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆ దేశాలు అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునే ఖాతాదారుల నడ్డి విరిచింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయబ్యాంకులు కూ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టే అవకశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రుణాల జారీ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను పెంచుకునేందుకు సేవింగ్స్ ఖాతాలనిల్వలపై వడ్డీ రేట్ల కోత తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.