sukanya samriddhi yojana scheme
-
ఎక్కువ ఖాతాలున్నా.. ప్రయోజనాలు సున్నా
ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తున్నా కానీ, ఇతర పెట్టుబడి సాధనాల ప్రాధాన్యాన్ని విస్మరించలేం. పెట్టుబడులు అన్నింటినీ ఒక్క చోటే పెట్టేయడం రిస్క్ పరంగా అనుకూలం కాదు. వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అందుకే ఒకవైపు ఈక్విటీల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇప్పటికీ ఎంతో మందికి ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతున్నాయి. రిస్క్‌లేని హామీతో కూడిన ఈ పథకాలు ముఖ్యమైన జీవిత లక్ష్యాలకు చేదోడుగా నిలుస్తాయనడంలో అతిశయం లేదు. అయితే ఇందులో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సీ పరంగా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం. పీపీఎఫ్ ఒక్కటే ఎక్కువ మంది ఎంపిక చేసుకునే ఆరి్థక సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపే కాకుండా, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ఈ ప్రయోజనమే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇది చూసే కొంత మంది ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లో ఒకటి, బ్యాంక్‌లో ఒకటి తెరుస్తున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకరి పేరిట ఒక పీపీఎఫ్ ఖాతానే ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయగలరని కేంద్ర ఆరి్థక శాఖ జూలై 12న ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒకటికి మించిన ఖాతాలను గుర్తించినట్టయితే అందులో ఒక దానిని ప్రాథమిక ఖాతాగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ఖాతాలో జమలపై ఎలాంటి వడ్డీ రాదన్నది తాజా ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ రెండు ఖాతాలున్నట్టు తేలితే రెండో ఖాతాలోని జమలను మొదటి ఖాతాకు బదిలీ చేస్తారు. ఒక ఆర్థిక సంత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలకు మించి జమ చేసినట్టయితే, అదనంగా ఉన్న మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వెనక్కిచ్చేస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలున్నట్టు తేలితే అప్పుడు ప్రారంభించిన తేదీ నుంచి సున్నా వడ్డీయే లభిస్తుంది.పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాలు... కొంత మంది పిల్లల పేరుతోనూ ఒకటికి మించిన పీపీఎఫ్ ఖాతాలను తెరుస్తున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. ఒక మైనర్ (బాలుడు/బాలిక) పేరిట ఒక పీపీఎఫ్ ఖాతాకే పరిమితం కావాలి. ఇలా ఒక మైనర్ పేరిట ఒకటికి మించి ఉన్న ఖాతాలను ఇరెగ్యులర్ (అక్రమం) అకౌంట్లుగా గుర్తిస్తారు. అప్పుడు మైనర్ పేరిట ఉన్న ఖాతాల్లో ఒకదానిని మెయిన్ అకౌంట్‌గా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఖాతాకు నిబంధనల మేరకు ప్రస్తుత వడ్డీ రేటు అమలవుతుంది. ఒకటికి మించి అదనంగా ఉన్న ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 4 శాతం చొప్పున 18 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తారు. 18 ఏళ్లు నిండగానే మేజర్ అయిన తర్వాత సాధారణ పీపీఎఫ్ ఖాతా కింద దాన్ని పరిగణిస్తారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ ఖాతాపై చర్యలు ఉంటాయి. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటే విడిగా ఇద్దరి పేరిట రెండు ఖాతాలు తెరిచి నిర్వహించుకోవచ్చు. అయినప్పటికీ, తన పేరుతో, తన పిల్లల పేరుతో ఇలా అన్నింటిలోనూ గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేసుకోరాదు. పీపీఎఫ్ ఖాతాను తాత, బామ్మ, అమ్మమ్మలు (గ్రాండ్ పేరెంట్స్) నిర్వహించరాదు. కేవలం తల్లిదండ్రులు మరణించి, పిల్లలకు ఆధారంగా మారిన వారే చట్టబద్ధ సంరక్షకులుగా వ్యవహరించడానికి అనుమతి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన... సుకన్య సమృద్ధి యోజన ఎంతో ప్రాచుర్యం పొందిన పథకం. రోజుల శిశువు నుంచి పదేళ్లలోపు కుమార్తెల పేరిట ఖాతా తెరిచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో ఒక ఆరి్థక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాకు 8.2 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇందులో చేసే పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇందులో రాబడులపైనా పన్ను లేదు. ఒక కుటుంబం తరఫున గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిటే సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను (ఎస్ఎస్ఏఎస్) బాలిక తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, కొందరు మనవరాలి పేరిట కూడా ఖాతాలను తెరిచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో పిల్లలకు సహజ సంరక్షకులు అయిన తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయిన వారే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ మనవరాలి పేరిట తాత, అమ్మమ్మ, బామ్మలు తెరిచినట్టు గుర్తించినట్టయితే అప్పుడు సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులకు బదిలీ అవుతుంది. ఒక కుటుంబానికి రెండుకు మించి ఖాతాలున్నట్టు తేలితే అదనంగా ఉన్న వాటిని మూసివేస్తారు. వాటిలో జమ చేసే మొత్తాలపై వడ్డీ రాదు.నేషనల్ సేవింగ్స్ స్కీమ్... ఎంతో పాపులర్ అయిన చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది. గతంలో ఏదైనా పోస్టాఫీస్ శాఖలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించేందుకు అవకాశం ఉండేది. దీన్ని 2002 నుంచి నిలిపివేశారు. కాకపోతే అప్పటికే తెరిచిన ఖాతాలను కొనసాగించేందుకు అనుమతించారు. 1990 ఏప్రిల్ 2కు ముందు తెరిచిన మొదటి ఖాతాకు ప్రస్తుత పథకం రేటు, రెండో ఖాతాకు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా రేటు (4 శాతం)కు అదనంగా 2 శాతం చెల్లిస్తారు. అక్టోబర్ 1 నుంచి ఈ రెండు ఖాతాలకు ఎలాంటి వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత తెరిచిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలకు సైతం అక్టోబర్ నుంచి ఎలాంటి వడ్డీ చెల్లించరు. దీంతో ఈ ఖాతాలను మూసివేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎన్ఆర్ఐలు అలా చేయడం కుదరదు..ఎన్ఆర్ఐ హోదాను వెల్లడించకుండా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం చెల్లదు. అలాంటి ఖాతాల్లోని జమలకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ రేటు 4 శాతమే అమలవుతుంది. అది కూడా 2024 సెపె్టంబర్ 30 వరకే. ఆ తర్వాత నుంచి బ్యాలన్స్‌పై వడ్డీ రాదు. నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అనుమతి లేదు. ‘‘భారత్‌లో పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత విదేశాలకు వెళ్లి ఎన్ఆర్ఐగా మారితే 15 ఏళ్ల గడువు ముగిసేంత వరకు ఆ ఖాతాను కొనసాగించొచ్చు. అందులో చేసే పెట్టుబడులకు ఇతరులకు మాదిరే వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, నాన్ రీపాట్రియేషన్ నిబంధనల కిందే వీరు పీపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోగలరు. అంటే గడువు ముగిసిన తర్వాత వచ్చే మెచ్యూరిటీని ఎన్ఆర్ఐ తన విదేశీ ఖాతాకు బదిలీ చేసుకోవడం కుదరదు. లేదా విదేశీ కరెన్సీలోకి మార్చుకోవడం కుదరదు. తన నివాస హోదాలో మార్పు చోటుచేసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు తెలియజేయడం తప్పనిసరి’’ అని స్టెబుల్ ఇన్వెస్టర్ వ్యవస్థాపకుడు దేవ్ ఆశిష్ తెలిపారు.మార్గం ఉంది.. పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే.. అప్పుడు దంపతులు ఇద్దరూ తమ పేరిట పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే భార్య, భర్త చెరొక పీపీఎఫ్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి మేరకు ఒక్కో ఖాతాలో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్లు నిండిన తర్వాత వైద్య పరమైన అవసరాల కోసం మూసివేసేందుకు అనుమతి ఉంటుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
సుకన్య సమృద్ధి పథకంలో మరింత రాబడి
న్యూఢిల్లీ: కుమార్తెల భవిష్యత్ అవసరాలకు పొదుపు చేసుకునే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని పొదుపు సొమ్ముపై 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటే, దీన్ని 8.2 శాతానికి పెంచింది. అలాగే, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై 0.10 శాతం వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ పథకంలో రేటు 7 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి ప్రస్తుతమున్న రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటు 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగుతాయి. కిసాన్ వికాస్ పత్ర పథకం రేటు 7.5 శాతంగా ఉంటుంది. ఇందులో డిపాజిట్ 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతంలో ఎలాంటి మార్పు లేదు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 7.4 శాతంగా కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకోమారు చిన్న మొత్తాల పొదుపు పథకాలను సమీక్షించి, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిస్తుంటుంది. ఆర్బీఐ కీలక రెపో రేటును ఏడాది కాలంలో 2.5% మేర పెంచి 6.5 శాతానికి చేర్చడం తెలిసిందే. కొన్ని విడతలుగా రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లలోనూ పెద్దగా మార్పులు ఉండడం లేదు. -
పన్ను శూన్యం.. ఆదాయం అదనం
ఆదాయపన్ను ఆదాచేసే పెట్టుబడి సాధనాలకు మంచి డిమాండ్ ఉంది. మధ్యాదాయ వర్గాల వారికి పాత పన్ను విధానమే మెరుగైనది. అందులో పన్ను ఆదా, మినహాయింపునిచ్చే సెక్షన్లు చాలానే ఉన్నాయి. పన్ను ఆదా కోసం ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ఆరంభం నుంచే ఈ సాధనాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం వల్ల చివర్లో ఏకమొత్తంలో సమకూర్చుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అయితే, పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు లాభ, నష్టాల గురించి పూర్తిగా విచారించుకోవాలి. లాక్ ఇన్ పీరియడ్‌ను చూడాలి. రాబడిని చూడాలి. రిస్క్‌ను అర్థం చేసుకోవాలి. పన్ను బాధ్యత ఏ మేరకు అన్నది పరిశీలించాలి. ముందస్తు ఉపసంహరణలకు అవకాశం ఉందా? లేదా? తెలుసుకోవాలి. చాలా మంది పెట్టుబడిపై పన్ను ఆదానే చూస్తుంటారు. కానీ రాబడిపై పన్ను బాధ్యత గురించి తెలుసుకోరు. ముఖ్యంగా రిస్క్‌లేని సంప్రదాయ డెట్ సాధనాల్లో రాబడి 6–8 శాతం మించదు. కానీ, దీనిపై పన్ను చెల్లించాల్సి వస్తే.. ఇక మిగిలేది ఏముంటుంది? కనుక పెట్టుబడిపై పన్ను ఆదాయే కాదు, రాబడిపైనా పన్ను లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదనపు రాబడిని సంపాదించుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సాధనాల గురించి తెలియజేసే కథనమే ఇది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే వారు పాత, కొత్త విధానాల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే కొత్త విధానంలో పన్ను ఆదా ప్రయోజనాలు పెద్దగా లేవు. స్టాండర్డ్ డిడక్షన్, ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాకు చేసే జమపైనే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పాత విధానంలో అయితే సెక్షన్ 80సీ, 80డీ సహా ఎన్నో సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గిస్తున్నాయి. కనుక పాత, కొత్త విధానాల్లో ఒక దానిని ఎంపిక చేసుకునే ముందు తమ ఆదాయం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత ఎంపిక చేసుకోవాలి. పాత విధానంలో అయితే, ఇక్కడ చర్చించే సాధనాలు రిస్క్‌లేని రాబడిని, పన్ను లేని రాబడినిస్తాయి. కనుక ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అన్నది ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోతగిన సాధనం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తంపైనా ఎలాంటి పన్ను లేదు. అంతేకాదు ఈ సాధనానికి మూడు రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిపైనా పన్ను కట్టక్కర్లేదు. చివర్లో గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను లేదు. భద్రత దృష్ట్యా చూస్తే.. సార్వభౌమ గ్యారంటీతో కూడిన పథకం ఇది. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక రాబడి ఈ పథకంలో ఉంది. పీపీఎఫ్ అకౌంట్ కాల వ్యవధి 15 ఏళ్లు. లాకిన్ పీరియడ్ కూడా ఇంతే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి మొదలు పెట్టిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాలం అమలవుతుంది. ఆరంభం నుంచి కాదు. ఖాతా ప్రారంభించిన ఆరో ఏట నుంచి రుణ సదుపాయం అమల్లో ఉంటుంది. ఖాతా ప్రారంభించిన ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇందుకు కొన్ని షరతులు అమలవుతాయి. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌లో ప్రారంభించుకోవచ్చు. పోస్ట్ ఆఫీసు అయితే అక్కడ సేవింగ్స్ ఖాతా తెరవాలని షరతు పెడుతున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి, స్వచ్ఛంద భవిష్య నిధి సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ కిందకు వస్తారు. వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. పని చేయించుకునే సంస్థ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఉద్యోగులు తన వంతుగా జమ చేసే మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ నిధికి 12 శాతానికి మించి జమ చేసుకోవాలంటే అందుకు వీలు కల్పించేదే స్వచ్చంద భవిష్య నిధి (వీపీఎఫ్). ఈపీఎఫ్ నిబంధనలు వీపీఎఫ్‌కు సైతం వర్తిస్తాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్ జమలపైనా అమలవుతుంది. ఈపీఎఫ్ పథకాన్ని కేంద్ర సర్కారు నిర్వహిస్తోంది. కనుక నూరు శాతం భద్రత ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీ రేటు అమలు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పథకం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది. ముందస్తు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహం, వైద్య చికిత్సల కోసం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన పథకాల మాదిరే ఈపీఎఫ్‌పైనా పన్ను లేదు. కాకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఉద్యోగి చేసే జమ రూ.2.5 లక్షలు మించినప్పుడు.. అంతకుమించి చేసే జమలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి జమ చేసే వారు 5 శాతం మంది కూడా ఉండరు. వీపీఎఫ్, ఈపీఎఫ్ రెండు కలసి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితిపైనే పన్ను ఆదా పరిమితం. జీవిత బీమా పాలసీలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కలిగిన సాధనాల్లో జీవిత బీమా సాధనాలు కూడా ఉన్నాయి. టర్మ్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, యూనిట్ లింక్డ్ పాలసీల (యులిప్‌లు)కు ఏటా చెల్లించే ప్రీమియం మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. జీవిత బీమాను పెట్టుబడి కోణంలో చూడొద్దు. కుటుంబానికి రక్షణ సాధనంగానే చూడాలి. అలా చూసినప్పుడు అసలైన బీమా ప్లాన్ అంటే టర్మ్ ప్లాన్ అనే చెప్పుకోవాలి. తక్కువ ప్రీమియంకే ఎక్కువ రక్షణ కవరేజీ లభిస్తుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బుందుల పాలు కాకుండా ఉంటుంది. గడువు తీరే వరకు జీవించి ఉంటే చివర్లో ఏమీ తిరిగి రాదు. అందుకే చాలా మంది దీని పట్ల విముఖత చూపిస్తుంటారు. దీనికి బదులు చివర్లో ఎంతో కొంత చెల్లింపులు చేసే ఎండోమెంట్ ప్లాన్ల వైపు వెళుతుంటారు. సంప్రదాయ పాలసీల్లో 20 ఏళ్లకు మించి కాలంపై రాబడి 4–6 శాతం మించదని గుర్తుంచుకోవాలి. యులిప్ ప్లాన్లు బీమా రక్షణ, పెట్టుబడితో కూడినవి. వీటిల్లోనూ ప్రీమియం అధికంగానే ఉంటుంది. యులిప్ ప్లాన్లలో పెట్టుబడులను ఈక్విటీ లేదా డెట్, లేదా ఈక్విటీ డెట్ కలసినవి ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి ఎలాంటి చార్జీల్లేకుండా మార్చుకోవచ్చు. గడువు తీరిన తర్వాత చివర్లో వచ్చే మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించకుండా చూసుకుంటే మెచ్యూరిటీపై పన్ను పడదు. యులిప్‌లలో ఉన్న మరో ప్రతికూలత ఇవి చాలా తక్కువ టర్మ్‌తో వస్తుంటాయి. యులిప్ ప్లాన్లలోనూ రాబడులకు హామీ ఉండదు. అంచనా రాబడినే బీమా సంస్థలు వెల్లడిస్తాయి. ఇక సంప్రదాయ బీమా పాలసీలు (జీవించి ఉంటే మెచ్యూరిటీ చెల్లించేది) తీసుకునే వారు వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు మించకుండా చూసుకోవాలి. అప్పుడే చివర్లో చేతికొచ్చే మొత్తం పన్ను రహితం. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పైన చెప్పుకున్న వాటికి ఇది భిన్నం. సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఈ పథకాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక రిస్క్ ఉంటుంది. రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. రాబడులపై హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాభ, నష్టాలు ఏవైనా రావచ్చు. కాకపోతే ఈక్విటీల్లో ఐదేళ్లకు మించిన కాలానికి నికరంగా రాబడులే వస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. పన్ను ఆదా సాధనాల్లో తక్కువ లాకిన్ ఉన్నది ఇదే. ఈఎల్ఎస్ఎస్ నుంచి మూడేళ్లు నిండకుండా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్‌లో ఈ పథకం నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాంతో ఫండ్ డివిడెండ్ ప్రకటించిన ప్రతీ సందర్భంలోనూ ఇన్వెస్టర్‌కు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కాకపోతే డివిడెండ్ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి, పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన కాలంపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాలు మూడేళ్ల లాకిన్‌తో ఉంటాయి కనుక.. ఇందులో వచ్చే రాబడులు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.లక్ష వరకు ఉంటే ఎలాంటి పన్ను లేదు. ఈ పరిమితికి మించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. అందుకే ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకుని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలి. మూడేళ్లు నిండిన తర్వాత నుంచి ఏటా రూ.లక్ష లాభం మించకుండా ఉపసంహరించుకుని, తిరిగి ఆ మొత్తాన్ని మరొక ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల లాభంపై పన్ను పడదు. దీర్ఘకాలంలో మంచి నిధి జమవుతుంది. సుకన్య సమృద్ధి యోజన భేటీ బచావో భేటీ పడావో అనే పథకం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. కుమార్తెలకు సంబంధించిన డిపాజిట్ పథకం ఇది. ఆడ పిల్ల విద్య లేదా వివాహం అవసరాల కోసం తల్లిదండ్రులు ఆమె పేరిట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కరు ఇద్దరు కుమార్తెల పేరిటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరికి మించి కుమార్తెలు ఉంటే, వారి పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఉండదు. పీపీఎఫ్ మాదిరే ఇందులోనూ పెట్టుబడిపై పన్ను లేదు. రాబడి, చివరిలో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. పన్ను లేని, మెరుగైన రాబడితో కూడిన డెట్ సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో వస్తుంది కనుక భద్రత పరంగా సందేహం అక్కర్లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు 8 శాతం. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఇందులోనే రాబడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడులకు 21 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణలను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తారు. కుమార్తెల వయసు 10 ఏళ్లు మించకుండా ఉంటే, వారిపైనే ఈ పథకం కింద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తె వయసు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రి లేదా సంరక్షకుడు ఖాతాను నిర్వహించొచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతా తెరుచుకోవచ్చు. -
మీ ఇంట్లో అమ్మాయి ఉందా? అయితే ఈ పథకం మీ కోసమే!
మీ ఇంట్లో అమ్మాయి ఉందా? అయితే ఈ పథకం మీ కోసమే. ముఖ్యంగా పెట్టుబడలు పెట్టాలనుకునేవారికి ఈ పథకం ఓ వరమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంతో పాటు మరెన్నో ఇతర పెట్టుబడి మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తెచ్చిన స్కీము..సుకన్య సమృద్ధి అకౌంటు. బేటీ బజావో బేటీ పఢావో అన్న నినాదంతో అమల్లోకి వచ్చింది. వడ్డీ 7.6 శాతం. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు వడ్డీకి కూడా మినహాయింపు ఉంటుంది. అంటే మన భాషలో ఈ.ఈ.ఈ మధ్యలో విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు ఈ స్కీమును అమలుపరుస్తున్నాయి. మ్యుచువల్ ఫండ్స్ కొంత మంది మ్యుచువల్ ఫండ్స్‌ను ఆశ్రయిస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసినందుకు 80సి కింద మినహాయింపు ఉంది. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్థిరంగా, తప్పనిసరిగా ఇంత ఆదాయం వస్తుందనే గ్యారంటీ లేదు. హెచ్చుతగ్గులు సహజం. కానీ స్కీముల్లో నిర్దేశిత శాతం మేరకు డివిడెండ్లు రావచ్చు. అయితే, డివిడెండ్లను ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు. పన్ను భారం పోగా మిగతాది డివిడెండు. లాభసాటిగా ఉంటేనే ఈ ఫండ్స్ ఉపయోగం. ఏజెంట్లు ఏవేవో చార్టులు, బొమ్మలు, గ్రాఫులు, అంకెలు చూపించి ఎర వేస్తారు. జాగ్రత్త. కడుపులో చల్ల కదలని బేరం ఏమిటంటే.. కడుపులో చల్ల కదలని బేరం ఏమిటంటే.. బ్యాంకు పొదుపు ఖాతాల్లోని జమ. చాలా తక్కువ వడ్డీ 2 నుండి 4 శాతం వరకు వస్తోంది. భద్రత ఎక్కువ. మీరు ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడయితే, ఏటీఎం కార్డులు వచ్చాయి. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. టీడీఎస్ లేదు. ఆదాయం.. అంటే వడ్డీ మీద రూ. 10,000 దాకా మినహాయింపు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీడీ సెక్షన్ ప్రకారం రూ. 50,000 వరకూ మినహాయింపు. కొంత మంది బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తుంటారు. బ్యాంకుని బట్టి, కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు మొత్తం మారుతుంటుంది. స్థిరమైన ఆదాయం. ఎటువంటి పరిమితులు లేవు. మీ ఓపిక. కాల వ్యవధి మీ ఇష్టం. బ్యాంకుల్లో వివిధ రకాలు అమల్లో ఉన్నాయి. వాటి ప్రకారం ఎంచుకోవచ్చు. టీడీఎస్ తప్పనిసరి. 80సి కింద మినహాయింపు రావాలంటే 5 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. 80 టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు రూ. 50,000కు వడ్డీ మినహాయింపు లభిస్తుంది. జీవిత బీమా పథకంలో ఎన్నెన్నో పాలసీలు ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కువ. ఆదాయం గ్యారంటీ. పన్ను మినహాయింపు ప్రయోజనం. మెచ్యురిటీ అప్పుడు ట్యా క్స్ భారం లేదు. అంటే ఈ ఈ ఈ అన్నమాట. ఇలా ఎన్నెన్నో స్కీములు, పథకాలు ఉన్నాయి. పిల్లలను చదివించడానికి, స్కూలులో చెల్లించే ట్యూషన్ ఫీజులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకరి విషయంలో క్లెయిమ్ చేయలేము. అప్పుడు తక్కువ ఫీజు క్లెయిమ్ చేయవద్దు. భార్యభర్తలు ఇద్దరూ ఆదాయపు పన్ను కడుతున్నారనుకోండి. ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు ఒకరు, మిగతా ఒక్కరి ఫీజును ఇంకొకరు క్లెయిమ్ చేయవచ్చు. ప్లానింగ్‌లోని కొన్ని విషయాలు చట్టంలో ఉండవు. మనం మన ప్రాధాన్య, అవసరం మొదలైనవి దృష్టిలో పెట్టుకోవచ్చు. పన్ను భారం తగ్గించే ప్రయత్నంలో నిజాయితీకి నీళ్లు వదలకూడదు. నీతి నిజాయితీ విషయాల్లో ‘తగ్గేదే వద్దు‘. -
సుకన్య సమృద్ధి యోజనపై తపాలా శాఖ శ్రద్ధ
సాక్షి, అమరావతి: బాలికలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనపై రాష్ట్ర తపాలా శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికా సాధికారత వారోత్సవాల పేరిట ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు అన్ని తపాలా శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అభినవ్ వాలియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చని, ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు బాలికల పేరిట ఖాతాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకం కింద గరిష్టంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుందని, ఈ పథకంలో పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చని వివరించారు. ఏడాదిలో కనీసం రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చన్నారు. మహిళల భవిష్యత్‌కు బలమైన ఆర్థిక పునాది కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
రోజు రూ.100 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.15 లక్షలు మీ సొంతం..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సుకన్య సమృద్ది యోజన కింద పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ పథకం కింద పంజాబ్ బ్యాంకులోని ఏ శాఖలోనైనా ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చును. ఒక పేరెంట్‌గా, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి ఖాతాలో రూ .250 కనీస డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ .1,50,000 డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. తల్లిదండ్రులు ఖాతా ఓపెన్ చేసిన 15 సంవత్సరాల వరకు లబ్దిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్‌ను డిపాజిట్ చేయవచ్చును. ఖాతా తెరిచిన తేదీ నాటికి లబ్ధిదారులకు 10 సంవత్సరాలు నిండి ఉండకూడదు .సుకన్య సమృద్ధి ఖాతాలపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ ఖాతాలపై బ్యాంకు 7.6 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది. ఈ ఖాతాలను పోస్టాఫీసులకు బదిలే చేసుకునే సౌకర్యాన్ని పీఎన్బీ బ్యాంకు కల్పిస్తుంది. అకౌంట్ హోల్డర్ ఉన్నత విద్య కోసం, ఖాతాలోని అమౌంట్ నుంచి గరిష్టంగా 50 శాతం వరకు విత్‌డ్రా చేయవచ్చును. సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ అయినప్పటి నుంచి మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలుగా ఉండనుంది. మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో రోజుకు రూ.100 చొప్పున అంటే నెలకు రూ .3000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం మిగిసే సమయానికి లబ్థిదారులు రూ .15 లక్షలకు పైగా పొందవచ్చును. ఏటా రూ .36,000 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 14 సంవత్సరాల తర్వాత 7.6 శాతం వడ్డీరేటుతో రూ .9,11,574 వరకు పొందుతారు. 21 సంవత్సరాల తర్వాత, అమౌంట్ రూ .15,22,221 వరకు వస్తోంది. -
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు ఇవే!
కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. ఇందులో పొదుపు చేసిన నగదుపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది. సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. సుకన్య సమృద్ధి యోజన అర్హతలు, ప్రయోజనాలు: పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల పేరి మీద వారి సంరక్షకులు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పోస్టాఫీసులో లేదా బ్యాంకులలోనైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలు ఉన్న కూడా ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను ఓపెన్ చేయడానికి కనీసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఏడాదికి నగదు జమ చేయవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే స్కీమ్‌లో చేరి 21 ఏళ్ల తర్వాతనే డబ్బులు తీసుకోగలం. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత కొంత నగదు తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 21 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి. ప్రతి నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలానికి రూ.15 లక్షలకు పైగా పొందవచ్చు. చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు! -
‘సుకన్య’ పథకం .. బాలికలకు వరం
అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో దరఖాస్తులు సింహాద్రిపురం : ప్రధాని నరేంద్రమోడి 2015 జనవరి 22న ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావోలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికలకు వరంగా మారింది. తల్లిదండ్రులు తమ బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖాతాలు ప్రారంభిస్తే ఆడపిల్లలు అదృష్ట లక్ష్ములుగా మారుతారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆడపిల్లల చదువు, వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇస్తోంది. ఖాతా ప్రారంభం ఇలా... : ఐదేళ్లలోపు బాలికల పేరుతో సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్ఎస్ఏ) ప్రారంభించవచ్చు. బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్ ద్వారా ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఈ ఖాతాలు తెరవవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దినసరి కూలీలు ఎవరైనా ఇందులో ఖాతాదారులు కావచ్చు. ఉచిత దరఖాస్తులు : సమీప పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. దరఖాస్తు ఫారాలను కార్యాలయంలో ఉచితంగా పొంది సమాచారాన్ని పొందుపరచాలి. దరఖాస్తుతోపాటు తండ్రి, తల్లి లేదా సంరక్షకుడి వివరాలు, బాలిక ఫొటో, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రం, ఆధార్ చిరునామా తెలిపే ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని జతపరచాలి. ఖాతా ప్రారంభ సమయంలో రూ.1000లు చెల్లించాలి. తర్వాత రూ.100లపైబడిన మొత్తాన్ని జమ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1000లనుంచి రూ.1.50లక్షల వరకు ఒకేసారి లేదా వేర్వేరు కంతుల్లో జమ చేయవచ్చు. అలా ఖాతాను ప్రారంభించిన నాటినుంచి నేరుగా అత్యధికంగా 14ఏళ్ల వరకు జమ చేసుకోవచ్చు. బాలికలకు 21ఏళ్లు వచ్చేవరకు లేదా వివాహం జరగనంతవరకు డిపాజిట్లు కొనసాగించవచ్చు. పథకంవల్ల ఉపయోగాలు : బాలికకు 18ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత చదువుకు గానీ, వివాహానికైనా ఖాతాలో ఉన్న మొత్తంలో సగం సొమ్మును డ్రా చేసుకొనే అవకాశం ఉంది. 2014-15లో డిపాజిట్‌కు 9.1శాతం వడ్డీ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాలికకు 14ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ వడ్డీ ఖాతాకు జమ అవుతుంది. పాసు పుస్తకం సదుపాయం ఉంటుంది. ఖాతా ఎక్కడికైనా బదిలీ చేసుకొనే వీలు ఉంటుంది. ఏడాది వయసున్న బాలిక పేరుతో నెలకు రూ.1000లు చెల్లిస్తే ఏడాదికి ఖాతాలో రూ.12వేలు జమ అవుతుంది. అలా 14ఏళ్లపాటు జమ చేస్తే రూ.1.68లక్షల వరకు పొదుపు చేయగలుగుతారు. జమ చేసిన నాటి నుంచి 18ఏళ్లు నిండిన తర్వాత 21ఏళ్లు నిండకముందే వివాహమైతే ప్రభుత్వ ఖాతా నిలిపివేస్తారు.