
సాక్షి, అమరావతి: బాలికలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనపై రాష్ట్ర తపాలా శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికా సాధికారత వారోత్సవాల పేరిట ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు అన్ని తపాలా శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అభినవ్ వాలియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చని, ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు బాలికల పేరిట ఖాతాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు.
ఈ పథకం కింద గరిష్టంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుందని, ఈ పథకంలో పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చని వివరించారు. ఏడాదిలో కనీసం రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చన్నారు. మహిళల భవిష్యత్‌కు బలమైన ఆర్థిక పునాది కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment