మీ ఇంట్లో అమ్మాయి ఉందా? అయితే ఈ పథకం మీ కోసమే. ముఖ్యంగా పెట్టుబడలు పెట్టాలనుకునేవారికి ఈ పథకం ఓ వరమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంతో పాటు మరెన్నో ఇతర పెట్టుబడి మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తెచ్చిన స్కీము..సుకన్య సమృద్ధి అకౌంటు. బేటీ బజావో బేటీ పఢావో అన్న నినాదంతో అమల్లోకి వచ్చింది. వడ్డీ 7.6 శాతం. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు వడ్డీకి కూడా మినహాయింపు ఉంటుంది. అంటే మన భాషలో ఈ.ఈ.ఈ మధ్యలో విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు ఈ స్కీమును అమలుపరుస్తున్నాయి.
మ్యుచువల్ ఫండ్స్
కొంత మంది మ్యుచువల్ ఫండ్స్‌ను ఆశ్రయిస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసినందుకు 80సి కింద మినహాయింపు ఉంది. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్థిరంగా, తప్పనిసరిగా ఇంత ఆదాయం వస్తుందనే గ్యారంటీ లేదు. హెచ్చుతగ్గులు సహజం. కానీ స్కీముల్లో నిర్దేశిత శాతం మేరకు డివిడెండ్లు రావచ్చు. అయితే, డివిడెండ్లను ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు. పన్ను భారం పోగా మిగతాది డివిడెండు. లాభసాటిగా ఉంటేనే ఈ ఫండ్స్ ఉపయోగం. ఏజెంట్లు ఏవేవో చార్టులు, బొమ్మలు, గ్రాఫులు, అంకెలు చూపించి ఎర వేస్తారు. జాగ్రత్త.
కడుపులో చల్ల కదలని బేరం ఏమిటంటే..
కడుపులో చల్ల కదలని బేరం ఏమిటంటే.. బ్యాంకు పొదుపు ఖాతాల్లోని జమ. చాలా తక్కువ వడ్డీ 2 నుండి 4 శాతం వరకు వస్తోంది. భద్రత ఎక్కువ. మీరు ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడయితే, ఏటీఎం కార్డులు వచ్చాయి. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. టీడీఎస్ లేదు. ఆదాయం.. అంటే వడ్డీ మీద రూ. 10,000 దాకా మినహాయింపు. సీనియర్ సిటిజన్‌లకు 80 టీటీడీ సెక్షన్ ప్రకారం రూ. 50,000 వరకూ మినహాయింపు.
కొంత మంది బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తుంటారు. బ్యాంకుని బట్టి, కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు మొత్తం మారుతుంటుంది. స్థిరమైన ఆదాయం. ఎటువంటి పరిమితులు లేవు. మీ ఓపిక. కాల వ్యవధి మీ ఇష్టం. బ్యాంకుల్లో వివిధ రకాలు అమల్లో ఉన్నాయి. వాటి ప్రకారం ఎంచుకోవచ్చు. టీడీఎస్ తప్పనిసరి. 80సి కింద మినహాయింపు రావాలంటే 5 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. 80 టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు రూ. 50,000కు వడ్డీ మినహాయింపు లభిస్తుంది. జీవిత బీమా పథకంలో ఎన్నెన్నో పాలసీలు ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కువ. ఆదాయం గ్యారంటీ. పన్ను మినహాయింపు ప్రయోజనం. మెచ్యురిటీ అప్పుడు ట్యా క్స్ భారం లేదు. అంటే ఈ ఈ ఈ అన్నమాట.
ఇలా ఎన్నెన్నో స్కీములు, పథకాలు ఉన్నాయి. పిల్లలను చదివించడానికి, స్కూలులో చెల్లించే ట్యూషన్ ఫీజులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకరి విషయంలో క్లెయిమ్ చేయలేము. అప్పుడు తక్కువ ఫీజు క్లెయిమ్ చేయవద్దు. భార్యభర్తలు ఇద్దరూ ఆదాయపు పన్ను కడుతున్నారనుకోండి. ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు ఒకరు, మిగతా ఒక్కరి ఫీజును ఇంకొకరు క్లెయిమ్ చేయవచ్చు. ప్లానింగ్‌లోని కొన్ని విషయాలు చట్టంలో ఉండవు. మనం మన ప్రాధాన్య, అవసరం మొదలైనవి దృష్టిలో పెట్టుకోవచ్చు. పన్ను భారం తగ్గించే ప్రయత్నంలో నిజాయితీకి నీళ్లు వదలకూడదు. నీతి నిజాయితీ విషయాల్లో ‘తగ్గేదే వద్దు‘.
Comments
Please login to add a commentAdd a comment