Sukanya Samriddhi Yojana
-
‘సుకన్య సమృద్ధి’ వడ్డీ పెరిగిందా? పోస్టాఫీసు స్కీములపై అప్డేట్
చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఆయా పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుత వడ్డీ రేట్లు∇ సుకన్య సమృద్ధి యాజన (SSY): సంవత్సరానికి వడ్డీ రేటు 8.2 శాతం∇ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వడ్డీ రేటు 8.2 శాతం∇ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వడ్డీ రేటు 7.1 శాతం∇ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): వడ్డీ రేటు 7.7 శాతం∇ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS): వడ్డీ రేటు 7.4 శాతం∇ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: వడ్డీ రేటు 7.5 శాతం∇ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్: వడ్డీ రేటు 6.7 శాతంఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లను చివరిగా 2023 డిసెంబర్ 31న సవరించింది. ఈ చిన్న పొదుపు పథకాలన్నీ పోస్టాఫీసు ద్వారా అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సార్వభౌమాధికార హామీ ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి కొన్ని పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. -
సుకన్య సమృద్ధి యోజన.. కొత్త రూల్స్
నిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. బాలికల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రత్యేక పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులు బాలికల పేరున ఈ ఖాతాలను తెరుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు లేదా బంధువులు ఖాతాలు తెరిచారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షకులు కారు. కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులు తెరవని ఖాతాలను పథకం ప్రాథమిక మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బదిలీ చేయడమో లేదా మూసివేయడమో తప్పనిసరి. తల్లిదండ్రులు లేని బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు సంరక్షకులుగా ఉంటే ఇందుకోసం ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.ఖాతా మూసివేత, బదిలీకి అవసరమైన పత్రాలు» అన్ని వివరాలున్న ప్రాథమిక ఖాతా పాస్‌బుక్» బాలిక జనన ధ్రువీకరణ పత్రం» బాలికతో సంబంధాన్ని రుజువు చేసే బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర ధ్రువ పత్రాలు» తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు.» పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్పత్రాలన్నీ తీసుకుని ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వ్యక్తి ఖాతా తెరిచిన పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం సంరక్షకుడికి ఖాతాను బదిలీ చేయాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేయాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసు వారు అందించిన బదిలీ ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే ఉన్న ఖాతాదారు (తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ), కొత్త సంరక్షకుడు (తల్లిదండ్రులు) ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఫారమ్‌పై సంతకం చేయాలి.ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, బ్యాంక్ లేదా పోస్టాఫీసు సిబ్బంది అభ్యర్థనను సమీక్షించి ధ్రువీకరణను ప్రాసెస్ చేస్తారు. అవసరమైతే వారు అదనపు సమాచారం కోసం కూడా అడగవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతా రికార్డులు కొత్త సంరక్షకుని సమాచారంతో అప్డేట్ అవుతాయి. -
పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. జూలై 1 నుంచి మొదలయ్యే మూడు నెలల కాలానికి తాజా రేట్లను ప్రకటించింది. కొన్నింటి పథకాల రేట్లను 0.3 శాతం వరకు పెంచగా, చాలా పథకాల్లో రేట్లను యథాతథంగా కొనసాగించింది. ♦ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న రేటు పెంపు అనంతరం 6.5 శాతంగా మారింది. ♦ ఏడాది కాల టర్మ్ డిపాజిట్‌పై 0.1 శాతం పెరిగి 6.9 శాతానికి, రెండేళ్ల టైమ్ డిపాజిట్ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది ♦ మూడేళ్ల టర్మ్ డిపాజిట్ (7శాతం), ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ (7.5శాతం) రేట్లలో మార్పు చేయలేదు. ♦ అలాగే పీపీఎఫ్ వడ్డీ రేటు సైతం ఎలాంటి మార్పుల్లేకుండా 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగనుంది. ♦ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతం, సుకన్య సమృద్ధి యోజన రేటు 8 శాతంలోనూ మార్పు చేయలేదు. ♦ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2శాతం, కిసా న్ వికాస్ పత్రం రేటు 7.5 శాతం కొనసాగనుంది. ♦ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) రేటు 7.4 శాతంగా కొనసాగుతుంది. పెంపు ఆగినట్టేనా? జనవరి-మార్చి, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పొదుపు పథకాలపై రేట్లను పెంచింది. దీంతో ఈ విడత కేవలం 3 పథకాలు మినహా మిగిలిన వాటి రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ సైతం గత సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను మార్చలేదు. -
పెరిగిన సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీరేట్లు..ఎంతో తెలుసా?
Small saving schemes: సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జులై - సెప్టెంబర్ మధ్య కాలానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన స్మాల్ స్కీమ్ వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ మేర పెరిగాయి. సవరించిన వడ్డీ రేట్లు ఏడాది, రెండేళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరగ్గా, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఏడాది డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 6.9 శాతం, 2ఏళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 7 శాతం, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), కిసాన్ వికాస్ పాత్ర, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సంవృద్ది యోజన స్కీమ్ మినహా మిగిలిన స్కీమ్‌లు యధావిధిగా కొనసాగుతున్నాయి. జులై1 నుంచి అమలు ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలు సురక్షితం, ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈస్మాల్ సేవింగ్స్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. దీంతో కేంద్ర పథకాల్లో పెట్టుబడి పెట్టే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టే సీనియర్ సిటిజన్లు, పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తరచూ వడ్డి రేట్లను పెంచుతుంది. ఇక, తాజా వడ్డీ రేటు పెరుగుదల మునుపటి త్రైమాసికంతో పోల్చితే, ప్రభుత్వం 70బీపీఎస్ వరకు పెంపుదలను ప్రకటించింది. అంతేకాకుండా, గత రెండు త్రైమాసికాల్లో, సుకన్య సమృద్ధి ఖాతా పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నెలవారీ ఆదాయ పొదుపు పథకం, అన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల వంటి ప్రముఖ పథకాల రేట్లను ప్రభుత్వం పెంచింది. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
కేంద్రం కొత్త నిబంధనలు.. మీకు ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ఉందా?
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో కేంద్రం తెచ్చిన నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ - పాన్ లింక్ గడువును కేంద్రం పెంచింది. అయితే తాజాగా ఆధార్ - పాన్ విషయంలో మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాల్లో (small saving schemes) పాన్‌కార్డ్, ఆధార్ కార్డులను తప్పని సరిచేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ తప్పని సరి చేసింది. దీంతో పాటు నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే ఎక్కువ పెట్టుబడిపై పాన్ కార్డును అందించాలని సూచించింది. చిన్న పొదుపు పథకాల్లో కొత్త నిబంధనలు కేంద్ర ఆర్ధిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. చిన్న పొదుపు పథకాల్లోని చందాదారులు సెప్టెంబర్ 30,2023లోగా ఆధార్ నెంబర్ ను జతచేయాలని తెలిపింది. కొత్తగా పథకాల్లో చేరిన చందాదారులు 6 నెలల్లోగా ఆధార్‌ను లింక్ చేయాలని సూచించింది. ఒక వేళ స్మాల్ సేవింగ్స్ స్కీంలో కొత్తగా చేరిన వారి 6 నెలల్లోగా ఆధార్‌ను అందించాలని లేదంటే అక్టోబర్ 1, 2013 నుంచి సదరు అకౌంట్లు పనిచేయడం ఆగిపోతాయని వెల్లడించింది. పాన్ కార్డ్సైతం చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్‌కార్డ్‌ని సమర్పించాలి. ఆ సమయంలో సాధ్యం కాకపోతే రెండు నెలల్లో పాన్ కార్డ్‌ను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఇక ఆ అకౌంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్ రూ.లక్ష దాటినప్పుడు, ఒక నెలలో ఖాతా ట్రాన్సాక్షన్ల లావాదేవీలు రూ.10 వేలు దాటితే.. పాన్‌ను సమర్పించాలి. లేదంటే పాన్ అప్డేట్ చేసే వరకు సదరు ఖాతాలు స్తంభించిపోనున్నాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! -
International women's day 2023: ‘ఆమె’ కోసం ఇలా చేస్తే రూ. 25 లక్షలు మీ సొంతం!
ఆడబిడ్డల పుట్టుకే ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో వారికి ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛను ఇచ్చి ఆత్మగౌరవంతో ఎదిగేలా చేయడం చాలా అవసరం. తద్వారా అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా, వారిని ఆర్థిక భారంగా భావించకుండా, భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలందేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశంతో వచ్చిందే ‘సుకన్య సమృద్ధి యోజన’. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక పథకం, ప్రయోజనాల గురించి మాట్లాడుకోవడం ఉత్తమం. కేంద్రం ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం,రక్షణ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం బేటీ బచావో, బేటీ పఢావో. ఇందులో భాగంగా తీసుకొచ్చిన పొదుపు పథకమే సుకన్య సమృద్ధి యోజన. స్పెషల్‌గా అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అందించారు. సుకన్య సమృద్ధి యోజన (SSY) 2015లో ప్రారంభించింది ప్రభుత్వం. దీని సాయంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్ల కోసం అధీకృత వాణిజ్య బ్యాంకు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ఆదాయం లభించనుంది. ఈ ఆదాయాన్ని మనం పెట్టిన పెట్టుబడి , వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. సుకన్య సమృద్ధి యోజన - అర్హత అమ్మాయి తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి అమ్మాయికి పదేళ్లకు మించి ఉండకూడదు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఒక కుటుంబానికి ఇద్దరు కుమార్తెలకు మాత్రమే అవకాశం సుకన్య సమృద్ధి యోజనకు అర్హత పొందిన తర్వాత అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని కాలిక్యులేటర్లో నమోదు చేయాలి. ఈ పథకంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు. అంటేకేవలం రూ.250తో సుకన్య ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అలాగే గరిష్టంగా నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు. అకౌంట్ తెరవొచ్చు. ఈ ఖాతా తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే 18 ఏళ్లు వచ్చిన తర్వాత పాక్షికంగా కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి నగదు మన సొంతం అవుతుంది. ఇంతకు ముందు కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండేది. అయితే, భారత ప్రభుత్వం జూలై 2018లో దీన్ని రూ.250కి తగ్గించడం గమనార్హం. ఉదాహరణకు, 10 సంవత్సరాలకు 7.6శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 8,333 (సుమారుగా) చొప్పున ఏడాదికి లక్షరూపాయల పెట్టుబడి పెట్టారనుకుందాం. మీకు వడ్డీతో కలిపి రూ.15,29,458లు చేతికి అందుతాయన్న మాట. అదే నెలకు రూ. 5 వేలు చొప్పున 21 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా (రూ.25,59,142) వస్తాయి. అలాగే నెలకు 8 వేల రూపాయల చొప్పున 21 ఏళ్లు పెట్టుబడి పెడితే వచ్చే మెచ్యూరిటీ రూ. 40,94,627లు. అయితే ఈ వడ్డీరేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్‌లో చేరేందుకవసరమైన డాక్యుమెంట్లు పాన్ కార్డు ఆధార్ కార్డు పాప ఫోటోలు పాప ఆధార్ కార్డు పాప బర్త్ సర్టిఫికెట్ పన్ను మినహాయింపు సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఈ విమెన్స్ డే సందర్భంగా మీ ముద్దుల తనయ కోసం ఎంతో కొంత పెట్టుబడిని మొదలు పెట్టండి. బంగారు భవిష్యత్తును ఆమెకు కానుకగా ఇవ్వండి! -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
రానున్న బడ్జెట్లో ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్ సేవింగ్, ఇతర స్మాల్ సేవింగ్ పథకాలకు ఊరట లభించనుందా అంటే అవుననే సంకతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్‌కు ఈ దఫా చివరి బడ్జెట్ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం లభించనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలు పెద్ద ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ బడ్జెట్ 2023లో ఆర్థిక లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని, వాటి నుండి దాదాపు రూ. 5 లక్షల కోట్లు సేకరించవచ్చని అంచనా. సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం 2023-24 కోసం రాబోయే కేంద్ర బడ్జెట్లో ఊపందుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినా ఇందులో ఎస్‌ఎస్‌వైని చేర్చకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. 10 సంవత్సరాల లోపు ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. 60 యేళ్లకు మించిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై 8 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఈ స్కీంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మంచి మనసు చాటుకున్న జడేజా భార్య.. 101 ఖాతాలు! ప్రధాని మోదీ ప్రశంసలు
Ravindra Jadeja- Rivaba Solanki: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ కూతురి పుట్టినరోజును పురస్కరించుకుని 101 మంది చిన్నారి తల్లులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు సిద్ధమైన జడేజా దంపతుల నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ వారికి లేఖ రాశారు. కూతురి బర్త్‌డే సందర్భంగా.. భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన రవీంద్ర జడేజా 2016, ఏప్రిల్ 17న రివాబా సోలంకిని వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2017, జూన్ 8న కుమార్తె కున్వరిబశ్రీ నిధ్యానబ జన్మించింది. ఈ క్రమంలో ఈ ఏడాది కూతురు ఐదో పుట్టినరోజు సందర్భంగా తన భార్య రివాబా 101 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు తెరిచినట్లు జడేజా వెల్లడించాడు. గుజరాత్‌లోని జామానగర్‌లో గల పోస్ట్ ఆఫీసులో చిన్నారుల పేరిట ఈ మేరకు ఖాతాలు తెరిచినట్లు జడ్డూ పేర్కొన్నాడు. తమకు ఈ అవకాశం దక్కినందుకు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ అకౌంట్లలో 11000 వేల చొప్పున జడేజా దంపతులు డబ్బు డిపాజిట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వీరిని అభినందిస్తూ లేఖ రాశారు. ఈ విషయాన్ని రవీంద్ర జడేజా సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ప్రధాని లేఖను పంచుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఈ లేఖలో.. ‘‘కూతురి పుట్టినరోజు సందర్భంగా మీరు 101 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు తెరవడం గొప్ప విషయం. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న మీరు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక జడేజా ఆట విషయానికొస్తే ఆసియా కప్-2022 టోర్నీలో ఆడే జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తెచ్చిన పథకం.. సుకన్య సమృద్ధి యోజన. బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదంతో 2015లో ప్రారంభమైంది. వడ్డీ 7.6 శాతం. కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఖాతా తెరిచిన ఏడాది నుంచి 14 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు వడ్డీకి కూడా మినహాయింపు ఉంటుంది. పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. చదవండి: Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్ అయితే..: మాజీ కెప్టెన్ Kind words 🙏🏻 pic.twitter.com/mXjBIPYW7K — Ravindrasinh jadeja (@imjadeja) August 8, 2022 -
ఆడపిల్ల ఉన్న ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన పథకమిదే..
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం కింద కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికల బంగారు భవితకు భరోసాగా నిలుస్తుంది. పొదుపు పథకాలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా సుకన్య సమద్ధి యోజన అందించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పథకం కింద ఏడాదికి ఒకసారి సవరించి దానిని కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటిస్తుంది. ఏడాదికి కనీస పెట్టుబడిని కేంద్రం రూ.వెయ్యి నుంచి రూ.250కి తగ్గించడం తెలిసిందే. కాగా, ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు చెల్లించినట్టయితే 21 ఏళ్లు పూర్తయిన తర్వాత, అంటే మెచ్యూరిటీ సమయంలో రూ.48,821 పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ.20 వేలు కనీస పెట్టుబడి పెడితే 21 ఏళ్ల కు రూ.9,36,429 పొందవచ్చు ఏడాదికి కనీస డిపాజిట్ రూ.250, గరిష్ట డిపాజిట్ రూ.1.5 లక్షలు చెల్లించేలా గత ఏడాది జూన్ లో పరిమితిని సడలించారు. వార్షిక వడ్డీ 7.6 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరింత చేరువగా... : ఆడపిల్లలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరు. వారి చదువులకు, భవిష్యత్తుకు ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో భారత ప్రభుత్వం సుకన్య పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేస్తే అవే పిల్లలకు ఆసరాగా ఉంటాయి. పుట్టిన శిశువు నుంచి పదేళ్ల లోపు చిన్నారుల పేరున వారి తల్లిదండ్రులు సుకన్య పథకానికి సంబంధించిన ఖాతాను తెరవడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలను తెరిచేందుకు కావాల్సిన అన్ని వసతులు అధికారులు కల్పించారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ, మరింతమందికి పేదలకోసం ప్రీమియం చెల్లింపు మొత్తాన్ని తగ్గించింది. దీంతో ఎక్కువ మందికి ఈ పథకం చేరువవుతోంది. ఇదిలావుండగా విశాఖ డివిజన్లో 30 వేల మంది పథకంలో చేరారు. ఆన్లైన్లో కూడా చెల్లింపు అవకాశాలు...: గతంలో సుకన్య ఖాతాను ఎక్కడ ప్రారంభిస్తే అక్కడ మాత్రమే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. దీంతో సంరక్షకులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం చెల్లింపులకు ఆన్లైన్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో ఎక్కడైనా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా బదిలీ చేసుకునే వీలు కల్పించింది. ఈ ఖాతాలో జమ అయిన మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరికి మాత్రమే..: ఈ ఖాతా కాలపరిమితి 21 ఏళ్లు ఉంటుంది. ఒక చిన్నారికి ఒక ఖాతా చొప్పున ఇద్దరికి ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది.. లేదా ఒకే కాన్పులో కవలలు పుట్టిన సందర్భాల్లో లేదా మొదటి కాన్పులో ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో ముగ్గురు ఆడపిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. 21 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే ముందు అమ్మాయి వివాహం చేసుకున్నట్లయితే ఖాతా అనివార్యంగా మూతపడుతుంది. ఆ రోజు వరకు లెక్కించి నగదు చెల్లిస్తారు. ఖాతా ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 14 ఏళ్లు చెల్లించాలి. తపాలాశాఖలో అత్యధిక వడ్డీ ఇచ్చే పథకం ఇదొక్కటేనని అధికారులు చెబుతున్నారు. ఏటా పొదుపు చేస్తున్న మొత్తంపై వచ్చే వడ్డీని ఆ తరువాత ఏడాది పొదుపులో కలిపి మళ్లీ ఏడాది ఈ మొత్తానికి వడ్డీ లెక్కిస్తారు. తద్వారా వడ్డీ, చక్రవడ్డీ రూపంలో జమ అవుతుంది. దీంతో లబ్ధిదారులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం చేకూరే అవకాశం కలుగుతుంది. బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చదువు లేదా వివాహం కోసం ఈ ఖాతాల్లో ఉన్న నిల్వల్లో 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన వెంటనే ఖాతాలోని మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహమైన తర్వాత ఖాతాను రద్దు చేసుకునే వీలు కూడా ఉంది. -
మీ ఇంట్లో అమ్మాయి ఉందా? అయితే ఈ పథకం మీ కోసమే!
మీ ఇంట్లో అమ్మాయి ఉందా? అయితే ఈ పథకం మీ కోసమే. ముఖ్యంగా పెట్టుబడలు పెట్టాలనుకునేవారికి ఈ పథకం ఓ వరమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకంతో పాటు మరెన్నో ఇతర పెట్టుబడి మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తెచ్చిన స్కీము..సుకన్య సమృద్ధి అకౌంటు. బేటీ బజావో బేటీ పఢావో అన్న నినాదంతో అమల్లోకి వచ్చింది. వడ్డీ 7.6 శాతం. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు వడ్డీకి కూడా మినహాయింపు ఉంటుంది. అంటే మన భాషలో ఈ.ఈ.ఈ మధ్యలో విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు ఈ స్కీమును అమలుపరుస్తున్నాయి. మ్యుచువల్ ఫండ్స్ కొంత మంది మ్యుచువల్ ఫండ్స్‌ను ఆశ్రయిస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసినందుకు 80సి కింద మినహాయింపు ఉంది. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్థిరంగా, తప్పనిసరిగా ఇంత ఆదాయం వస్తుందనే గ్యారంటీ లేదు. హెచ్చుతగ్గులు సహజం. కానీ స్కీముల్లో నిర్దేశిత శాతం మేరకు డివిడెండ్లు రావచ్చు. అయితే, డివిడెండ్లను ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు. పన్ను భారం పోగా మిగతాది డివిడెండు. లాభసాటిగా ఉంటేనే ఈ ఫండ్స్ ఉపయోగం. ఏజెంట్లు ఏవేవో చార్టులు, బొమ్మలు, గ్రాఫులు, అంకెలు చూపించి ఎర వేస్తారు. జాగ్రత్త. కడుపులో చల్ల కదలని బేరం ఏమిటంటే.. కడుపులో చల్ల కదలని బేరం ఏమిటంటే.. బ్యాంకు పొదుపు ఖాతాల్లోని జమ. చాలా తక్కువ వడ్డీ 2 నుండి 4 శాతం వరకు వస్తోంది. భద్రత ఎక్కువ. మీరు ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడయితే, ఏటీఎం కార్డులు వచ్చాయి. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. టీడీఎస్ లేదు. ఆదాయం.. అంటే వడ్డీ మీద రూ. 10,000 దాకా మినహాయింపు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీడీ సెక్షన్ ప్రకారం రూ. 50,000 వరకూ మినహాయింపు. కొంత మంది బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తుంటారు. బ్యాంకుని బట్టి, కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు మొత్తం మారుతుంటుంది. స్థిరమైన ఆదాయం. ఎటువంటి పరిమితులు లేవు. మీ ఓపిక. కాల వ్యవధి మీ ఇష్టం. బ్యాంకుల్లో వివిధ రకాలు అమల్లో ఉన్నాయి. వాటి ప్రకారం ఎంచుకోవచ్చు. టీడీఎస్ తప్పనిసరి. 80సి కింద మినహాయింపు రావాలంటే 5 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. 80 టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు రూ. 50,000కు వడ్డీ మినహాయింపు లభిస్తుంది. జీవిత బీమా పథకంలో ఎన్నెన్నో పాలసీలు ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కువ. ఆదాయం గ్యారంటీ. పన్ను మినహాయింపు ప్రయోజనం. మెచ్యురిటీ అప్పుడు ట్యా క్స్ భారం లేదు. అంటే ఈ ఈ ఈ అన్నమాట. ఇలా ఎన్నెన్నో స్కీములు, పథకాలు ఉన్నాయి. పిల్లలను చదివించడానికి, స్కూలులో చెల్లించే ట్యూషన్ ఫీజులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకరి విషయంలో క్లెయిమ్ చేయలేము. అప్పుడు తక్కువ ఫీజు క్లెయిమ్ చేయవద్దు. భార్యభర్తలు ఇద్దరూ ఆదాయపు పన్ను కడుతున్నారనుకోండి. ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు ఒకరు, మిగతా ఒక్కరి ఫీజును ఇంకొకరు క్లెయిమ్ చేయవచ్చు. ప్లానింగ్‌లోని కొన్ని విషయాలు చట్టంలో ఉండవు. మనం మన ప్రాధాన్య, అవసరం మొదలైనవి దృష్టిలో పెట్టుకోవచ్చు. పన్ను భారం తగ్గించే ప్రయత్నంలో నిజాయితీకి నీళ్లు వదలకూడదు. నీతి నిజాయితీ విషయాల్లో ‘తగ్గేదే వద్దు‘. -
చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా?
తక్కువ రిస్క్ తో ఎక్కువ పెట్టుబడి వచ్చే సామాన్య ప్రజానీకం పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు? అలాంటి వారి కోసం బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) చాలా ఉత్తమమైన పొదుపు పథకాలు. అయితే, ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంపై మీరు చెల్లించే ఆదాయపు పన్ను గురుంచి తెలుసుకోవడం చాలా కీలకం. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత సాధించిన అన్ని పెట్టుబడి పొదుపు పథకాలు ఆదాయపు పన్ను ఈఈఈ హోదాను పొందలేవు. ఈఈఈ అంటే ఏమిటి? ఈ అంటే మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు. ఇక్కడ, మొదటి మినహాయింపు అంటే మీ పెట్టుబడి పెట్టె నగదుపై మినహాయింపుకు లభిస్తుంది. కాబట్టి, పెట్టుబడి పెట్టిన మొత్తానికి సమానమైన జీతంలో కొంత భాగంపై మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, రెండో మినహాయింపు అంటే మధ్యలో వైదొలిగినప్పుడు లభించే ఆదాయంపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అర్ధం. మూడవ మినహాయింపు అంటే మీరు పెట్టుబడి పెట్టిన ఆదాయంపై లభించే వడ్డీ, అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పొందడం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపై సాదరణంగానే ఈఈఈ స్టేటస్ లభిస్తుంది. ఇప్పుడు విభిన్న సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎఫ్డీ పెట్టుబడుల నుంచే వచ్చే ఆదాయంపై పన్ను ఎంత విధిస్తారో తెలుస్తుంది. బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ) బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ నుంచి వచ్చిన వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎఫ్డీలో చేసిన పెట్టుబడిపై వచ్చే వడ్డీపై బ్యాంకు 10శాతం టీడీఎస్ వసూలు చేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు పీపీఎఫ్ అర్హత కలిగి ఉంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) పీపీఎఫ్ మాదిరిగానే,సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి పథకం. ఈ పథకం ఈఈఈ హోదాను పొందుతుంది. ఎస్ఎస్వైలో పెట్టుబడి పెట్టిన నగదుపై లభించే వడ్డీపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ రేట్లు ఫిక్సిడ్ డిపాజిట్లు అనేది స్థిరమైన వడ్డీ రేట్లకు గ్యారెంటీ ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. అయితే, దీనిపై పెట్టె పెట్టుబడిపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులను బట్టి మారుతంటాయి. భారతదేశంలోని టాప్ బ్యాంకులు సాధారణంగా నిర్ధిష్ట డిపాజిట్‌పై 5.6 - 6.7% వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పీపీఎఫ్ ఎస్ఎస్వై వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యదాతధంగా ఉంచింది. అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు పాత వడ్డీ రేట్లు ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన ఖాతా - 7.6% పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- 7.1% చదవండి: కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త! -
‘సుకన్య’పై కలెక్టర్ చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: హరితహారం గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో బాలికల సుకన్య సమృద్ధి యోజన పథకంపై జిల్లా కలెక్టర్ యోగితా రాణా చాలెంజ్ విసిరారు. సుకన్య సమృద్ధి యోజన చాలెంజ్‌గా పది మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. తొలి విడత వార్షిక ప్రీమియం స్పాన్సర్‌గా రూ.2500 లను బండ్లగూడ ఐసీడీఎస్ సూపర్వైజర్కు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన బేటీ బచావో– బేటీ పడావో అమలుపై మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు చాలెంజ్ చేశారు. దీంతో బేటీ బచావో.. బేటీ పడావో జిల్లా స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు స్పందించి 20 మంది పిల్లలకు రూ.5000 స్పాన్సర్ చేశారు. అధికారులందరూ తమ సామాజిక బాధ్యతగా సుకన్య సమృద్ధి యోజన చాలెంజ్ స్వీకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అమలులో భాగంగా మురికివాడల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల్లోని బాలికల భవిష్యత్తు కోసం ప్రతి జిల్లా మండలస్థాయి అధికారి పదిమంది బాలికల చేత సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాలను తెరిపించాలని కలెక్టర్ యోగితా రాణా పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన ఆడశిశువు నుంచి పదేళ్ల బాలికలకు 14వ సంవత్సరం వచ్చే వరకు వార్షిక ప్రీమియంగా కనీసం రూ. 250 చొప్పున చెల్లిస్తే 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ సొమ్మును వడ్డీతో పాటు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గతంలో వార్షిక కనీస ప్రీమియం రూ.1000 ఉండేదని, దానిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.250లకు తగ్గించిందన్నారు. పోస్టాఫీసులో ఈ ఖాతాలు ప్రారంభించాలని కలెక్టర్ యోగితా రాణా సూచించారు. -
అ‘ధనం’ మీ చేతికొస్తే..!
ఇన్వెస్ట్‌మెంట్‌కు రకరకాల సాధనాలు రియల్టీ నుంచి బాండ్ల వరకూ చూడొచ్చు నెల జీతంతోనూ ఆర్డీ, సిప్ వంటివి చేయొచ్చు సేవింగ్స ఖాతాలో పడేయటం లాభదాయకం కాదు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఏడవ వేతన సంఘం సిఫారసులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు బాగా పెరిగాయి. అంతేకాక ఏడు నెలల బకాయిలు కూడా వచ్చేశాయి. కేంద్ర సర్వీసుల నుంచి రిటైరైన వారికీ అధిక పెన్షన్లతో పాటు బకాయి అందాయి. ఇవే కాదు. భూమి లేదా ఇల్లు అమ్మితే వచ్చే ధనం... ఆస్తి పంపకాలు లేదా ఇతర లావాదేవీల్లో పెద్ద ఎత్తున అదనపు సొమ్ము... వీటన్నిటినీ ఎలా సద్వినియోగం చేసుకోవాలోనన్న విషయమై చాలా మందిలో గందరగోళం నెలకొంటుంది. అదనపు ధనం అకస్మాత్తుగా వస్తే ఏం చేయాలో తోచదు. ఎలాంటి ప్రయోజనం లేని విలాసాల కోసం ఖర్చు చేసేస్తారు. లేదా నామమాత్ర రాబడి వచ్చే సేవింగ్స ఖాతాలో పడేస్తారు. ఈ అ‘ధనం’ నిధులను ఎలా సమర్థంగా వినియోగించుకోవాలో, ఆర్థిక భవిష్యత్తును మరింత భద్రతనిచ్చేలా ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెబుతున్న నిపుణుల సూచనలివి... సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడులు పెట్టడానికి సుకన్య సమృద్ధి యోజన ఒక మంచి స్కీమ్. పది సంవత్సరాలలోపు వయస్సున్న కూతురు ఉంటేనే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాది ఇన్వెస్ట్మెంట్ పరిమితి రూ.1.5 లక్షలు. ఈ ఇన్వెస్ట్మెంట్స్, విత్డ్రాయల్స్పై సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. భవిష్యత్తులో దీనిని ప్రభుత్వ బాండ్ల ఈల్డ్లతో అనుసంధానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయినప్పటికీ, పీపీఎఫ్ కంటే అధిక రాబడులే వస్తాయనే అంచనాలున్నాయి. రియల్టీలో పెట్టుబడి పెట్టండి.. ప్లాటో, ఫ్లాటో కొనగలిగే స్థాయిలో అదనపు డబ్బులొస్తే, వాటిని కొనుగోలు చేయడమే మంచి పని. స్థలాలకు, ఇళ్లకు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గుతుందనే సమస్యే లేదు. వీటిని కొనుగోలు చేస్తే స్వల్పకాలంలోనే మంచి రాబడులొస్తాయి. మీకు ఇప్పటికే సొంత ఇల్లున్నా కానీ, మరో ఇంటినో, స్థలాన్నో కొనుగోలు చేస్తే మంచిదే. కానీ రియల్టీ కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అంతా పక్కాగా ఉన్న ఆస్తులనే కొనుగోలు చేయడం మంచిది. అత్యవసర నిధి.. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం అత్యంత ప్రాధాన్యమైన అంశం. మీ వయస్సు, ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడి ఉన్నవాళ్లు తదితర అంశాలు ఆధారంగా ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు యుక్త వయస్సులో ఉండి, మీపై ఆధారపడి ఉన్నవాళ్లు ఎవరూ లేకపోతే, మీ నెలవారీ ఖర్చులన్నింటినీ లెక్కవేసి, దానికి మూడు రెట్ల మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు మధ్య వయస్సులో ఉన్నా, మీపై ఇద్దరు అంతకు మించి ఆధారపడ్డ వాళ్లు ఉన్నా, మీ నెలవారీ ఖర్చులకు ఆరు రెట్ల మొత్తం అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక వేళ మీరు రిటైరైనా, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నా కూడా రెండు సంవత్సరాల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటికే అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటే, ఈ నిధి మొత్తంలో కనీసం 10-25% వరకూ అదనంగా జమ చేయండి. ఖరీదైన అప్పును తీర్చేయండి.. అధిక వడ్డీరేట్లు ఉండే క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత, ఇతర ప్రైవేట్ రుణాలను చెల్లించివేయండి. అధికంగా మీకు సొమ్ములు వచ్చినప్పుడు ఇలాంటి ఖరీదైన అప్పుల్లో కొంత భాగాన్ని గానీ, వీలైతే పూర్తిగా కానీ తీర్చివేయండి. ఇలా చేస్తే అధిక వడ్డీ భారం మీపై తగ్గుతుంది. నెలా నెలా ఇలా చెల్లించే వడ్డీ మీకు మిగులుతుంది. ఇలా మిగిలే మొత్తాన్ని ప్రయోజనకరమైన ఖర్చులకు వినియోగించుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ).. రికరింగ్ డిపాజిట్లలో ఉన్న ఒక మంచి లక్షణం.. మీరు డిపాజిట్ చేసినప్పుడు ఏ వడ్డీరేటు ఉంటుందో, అదే వడ్డీరేటు మీ డిపాజిట్ మెచ్యూరయ్యేదాకా వర్తిస్తుంది. వడ్డీరేట్లలో మార్పు ఉండదు. వడ్డీరేట్లు తగ్గినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని వేతనం పెరగగానే/అదనపు సొమ్ములు రాగానే ఎంతో కొంత మొత్తంతో ఆర్డీ ప్రారంభించండి. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యం కోసం రికరింగ్ డిపాజిట్లలో మదుపు చేయండి. పొదుపు చేసే అలవాటును పెంపొందించే సురక్షితమైన సాధనాల్లో ఇదొకటి. బ్యాంకులు పదేళ్ల కాలపరిమితి వరకూ రికరింగ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నారుు. మీ అవసరాలను బ ట్టి కాలపరిమితిని ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స.. ఏ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో అయినా షేర్లు కీలకం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి షేర్లలో పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. మీరు మ్యూచువల్ ఫండ్స ద్వారా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొత్త ఇన్వెస్టర్లకై తే ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స స్కీమ్) ఫండ్స మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. సెక్షన్ 80సీ కింద ఈ ఫండ్సలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటిపై వచ్చే రాబడులపై కూడా ఎలాంటి పన్ను పోటు ఉండదు. ఈక్విటీ ఫండ్స ద్వారా ఆర్జించిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు, పన్ను ప్రయోజనాలూ పొందవచ్చు. న్యూ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్).. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి అదనపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేయండి. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద అదనపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. 30 శాతం పన్ను స్లాబ్ ఉన్న వ్యక్తి రూ.34,550 వరకూ ఇన్వెస్ట్ చేస్తే, అతనికి రూ.15,450 పన్ను ప్రయోజనాలు లభిస్తారుు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఫండ్స, కార్పొరేట్ బాండ్ ఫండ్స, ప్రభుత్వ బాండ్ ఫండ్‌సల్లో కలిపి ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ వయస్సుకు తగ్గట్లుగా లైఫ్‌సైకిల్ ఫండ్ కూడా అందుబాటులో ఉంది. మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎంఐపీ).. షేర్లలో ఇన్వెస్ట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే, రిస్క్ తక్కువగా ఉండే మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎంఐపీ)లో గానీ, డెట్ ఫండ్సలో గానీ ఇన్వెస్ట్ చేయండి. ఎంఐపీల నిధుల్లో 15-20 శాతం వాటానే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన దానిని బాండ్లు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స విషయంలో రిస్క్ మరింత తక్కువగా ఉంటుంది. ఇవి ఈక్విటీలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయవు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు కంటే కూడా డెట్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్. డెట్ ఫండ్స ఆదాయం విత్‌డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను భారం కూడా తక్కువగానే ఉంటుంది. వీటిపై వచ్చే రాబడులు కూడా తక్కువగానే ఉంటాయనుకోండి. జీవిత బీమా కవర్.. జీవితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక భారాన్ని తగ్గించడంలో జీవిత బీమా తోడ్పడుతుంది. మీ వార్షికాదాయానికి 6-7 ఏళ్ల రెట్లకు బీమా కవర్ ఉండాలి. సంప్రదాయ జీవిత బీమా పాలసీలు అధిక ప్రీమియమ్‌లను వసూలు చేస్తుండగా, టర్మ్ ప్లాన్లు తక్కువ ప్రీమియమ్‌కే అధిక బీమాను కల్పిస్తున్నారుు. అందుకని తక్కువ వ్యయమయ్యే టర్మ్ ప్లాన్ తీసుకోవడం ద్వారా మీపై ఆధారపడ్డవాళ్లకు ఆర్థిక భద్రత భరోసానివ్వండి. పీఎఫ్ మొత్తాన్ని పెంచండి.. రిటైరైన తర్వాత అవసరాలకు పన్ను పోటు లేని నిధిని ఏర్పాటు చేసుకోవడానికి కంట్రిబ్యూటరీ ప్రావిడెండ్ ఫండ్(సీపీఎఫ్) ఒక మంచి విధానం. వేతనం పెరిగింది కాబట్టి సీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచండి. మీరు నెలవారీ ఉద్యోగులైతే వేతనం పెరగగానే మొదట చేయవలసిన పని ఇదే. మీ వేతనం నుంచి అధిక మొత్తం సీపీఎఫ్లో డిపాజిట్ చేయమని మీ అకౌంట్స్ సెక్షన్‌కు ఒక దరఖాస్తు పెట్టుకోండి. -
ఆడపిల్లలకు అండగా..
రాయవరం : అమ్మాయిలను పెంచి, పెద్ద చేసి, చదివించి, వివాహాలు చేయడం ఖర్చుతో కూడుకున్నదనే భావన కొంతమంది తల్లిదండ్రుల్లో నేటికీ గూడు కట్టుకుని ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ‘సుకన్య సమృద్ధి యోజన’ పేరుతో ప్రారంభించిన పథకం ఆడపిల్లలకు ఎంతో ప్రయోజకరంగా ఉంది. ఆ పథకం వివరాలివీ.. పథకంలో చేరేదిలా.. పుట్టిన పాప నుంచి పదేళ్ల వయస్సులోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రారంభించవచ్చు. 2013 డిసెంబర్ రెండు తర్వాత జన్మించినవారు కూడా అర్హులే. తల్లిదండ్రులు లేదా న్యాయపరమైన సంరక్షకులు బాలికల పేరుతో పోస్టాఫీసులలో కనీసం వెయ్యి రూపాయలతో ఖాతా తెరవాలి. ఒక బాలిక పేరుతో ఒక ఖాతాను మాత్రమే ప్రారంభించాలి. గరిష్టంగా ఇద్దరు బాలికల పేరుతో ఒక సంరక్షకుడు రెండు ఖాతాల వరకూ తెరవడానికి అవకాశం ఉంది. సంరక్షకుడు ఏదైనా గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు కాపీలను ఖాతా తెరిచే సమయంలో దరఖాస్తుతోపాటు అందజేయాలి. బాలిక ఫొటోతోపాటు పుట్టిన తేదీ ధ్రువపత్రం అందించాలి. గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు.. పదేళ్ల వయసు దాటిన తర్వాత సంబంధిత బాలిక స్వయంగా ఖాతాలో లావాదేవీలు జరుపుకునే వీలుంటుంది. ప్రారంభ డిపాజిట్‌గా వెయ్యి రూపాయలు, తదుపరి డిపాజిట్లుగా ఒక ఆర్థిక సంవత్సరంలో వెయ్యి రూపాయల నుంచి రూ.1.5 లక్షల వరకూ జమ చేయవచ్చు. ఇలా ఖాతా కలిగిన బాలికకు 14 ఏళ్ల వయసు నిండే వరకూ రోజువారీ, నెలవారీ, సంవత్సరంవారీగా గరిష్ట పరిమితి మించకుండా జమ చేసుకోవచ్చు. 14 ఏళ్లు నిండిన తర్వాత ఎలాంటి లావాదేవీలూ నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఖాతా మాత్రం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. 14 ఏళ్ల వరకూ పొదుపు చేసిన మొత్తానికి 21 ఏళ్ల వరకూ వడ్డీ ఇస్తారు. ఏ బ్యాంకు, ఏ ఆర్థిక సంస్థా ఇవ్వనంత గరిష్టంగా వడ్డీ ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 9.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. 14 ఏళ్లు పూర్తయ్యే వరకూ ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన వడ్డీని ఖాతాలో జమ చేస్తారు. ఒక ఏడాదిలో వెయ్యి రూపాయలు డిపాజిట్ చెయ్యని పక్షంలో సదరు ఖాతాను స్థంభింపజేస్తారు. తిరిగి దానిని కొనసాగించాలంటే రూ.వెయ్యి డిపాజిట్‌తో పాటు రూ.50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉపయోగాలివే.. ఒక ఏడాది ఉన్న బాలికకు నెలకు వెయ్యి రూపాయల వంతున జమ చేస్తే ఏడాదికి రూ.12 వేలు అవుతుంది. 14 ఏళ్లకు రూ.1.68 లక్షలు జమ చేస్తే 21 ఏళ్లకు ఆ ఖాతాలో బాలిక పేరున రూ.6.25 లక్షలు ఉంటాయి. ఈ ఖాతా కలిగి ఉన్న బాలిక 18 ఏళ్లు నిండగానే ఖాతాలోని మొత్తంలో 50 శాతం రుణంగా పొందవచ్చు. 21 ఏళ్ల వయస్సు, 18 ఏళ్ల తర్వాత వివాహం.. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే ఆ తేదీకి ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఈ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. చెల్లింపు కాలంలో నెలవారీ లేదా సంవత్సరంవారీగా వడ్డీ లెక్కింపు లభిస్తుంది. స్తోమతకు తగ్గట్టుగా 14 ఏళ్లు పొదుపు చేసుకుంటే ప్రతి బాలికకు భరోసా లభిస్తుంది. ఖాతాదారు మరణిస్తే ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. జిల్లాలో ఆరు నెలల నుంచి మూడేళ్ల వయసు ఉన్న బాలికలు సుమారు 1.35 లక్షల మంది, మూడేళ్ల నుంచి పదేళ్ల వయసు ఉన్న బాలికలు సుమారు 1.5 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరూ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.